Mar 27,2022 06:59

      'కాళిదాసు అనే రాక్షసుడు సృష్టి లోని అందాన్నంతా బంధించాడు' అంటాడు గుంటూరు శేషేంద్రశర్మ. ఈ విశ్వంలో మనసుకింపైన ఆనందాన్నిచ్చేది- అందం. ఈ ప్రకృతిలో ఎన్నెన్నో జీవులు... ఎన్నో సౌందర్యాలు, ఎన్నెన్నో వస్తువులు. దేని అందం దానిదే. దేని సౌందర్యం దానిదే. అన్నిటికీ మించి ప్రకృతికి ప్రతిరూపంగా స్త్రీ సౌందర్యాన్ని చూపుతారు. 'ఎంతో రసికుడు దేవుడు/ ఎన్ని పువ్వు లెన్ని రంగు/ లెన్ని సొగసులిచ్చాడు/ అన్నిటిలో నిన్నే చూడమన్నాడు' అంటాడో సినీ కవి. ఆ సొగసులన్నీ స్త్రీల సొంతం అని నాటి కాళిదాసు నుంచి నేటి భావ కవుల వరకు పుంఖానుపుంఖాలుగా రాసిపడేశారు. ఒకప్పుడు రాజమందిరాలు సౌందర్య నిలయాలుగా వుంటే, నేడు కార్పొరేట్‌ సంస్థలు అందాన్ని ప్రచారం చేసే సాధనాలుగా మారాయి. ప్రజలు అందం పట్ల ఉదాసీనంగా ఉంటేనో, పట్టీ పట్టనట్లుగా వుంటేనో సౌందర్య సాధనాలు తయారుచేసే ఈ సంస్థలకు నచ్చదు గాక నచ్చదు. అందుకు వారు అందానికి రకరకాల నిర్వచనాలు చెబుతారు. ఆడవాళ్ళయినా, మగవాళ్ళయినా అందంగా కనపడాలనుకోవడం తప్పు కాదు. కానీ 'అతి సర్వత్ర వర్జయేత్‌' అనేది సౌందర్య పోషణకైనా, అలంకరణకైనా వర్తిస్తుంది. అందం గురించి మితిమీరిన వ్యామోహాన్ని పెంచి పోషించడం కాస్మొటిక్స్‌ సంస్కృతి ముఖ్య లక్షణం.
    90 శాతం మంది నలుపురంగులో వుండే దేశంలో పుట్టి, తెల్లగా లేనందుకు ఆత్మన్యూనతతో బాధపడేలా ఈ కంపెనీలు చేస్తున్నాయి. 'అందంగా లేనా... అసలేం బాలేనా' అనుకునే భావన, ఆత్మన్యూనతా ధోరణి గత రెండు దశాబ్దాల నుంచీ బాగా పెరిగింది. అందాన్ని మెరుగుపర్చుకోడానికి వాడే కాస్మొటిక్స్‌ వెనుక పెద్ద వ్యాపార మాఫియా ఊడలు వేసుకొని ఊళలు వేస్తోంది. ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేసయినా సరే, అందంపై మితిమీరిన వ్యామోహాన్ని పెంచడం ఈ సంస్కృతి ముఖ్య లక్షణం. జీరో సైజ్‌ మోజుతో అమ్మాయిలెందరో అనొరెక్సియా వ్యాధిబారిన పడుతున్నారు. సినీ తారలను అనుకరిస్తూ... 'నయా ట్రెండ్‌' అంటూ కార్పొరేట్‌ మీడియా వంతపాడుతూ 'సౌందర్యాత్మక హింస'ను ప్రోత్సహిస్తున్నాయి. 'మనమంటే 34, 24, 35 కొలతలమైన చోట/ మొటిమలు మొలవడం, జుట్టురాలడం/ నడుం సన్నగా లేకపోవడమే/ మన నిరంతరాందోళనలైన చోట'- ఆలోచనల్లో, మాటల్లో, నడకలో, నవ్వులో అసహజంగా సౌందర్య స్పృహ తప్ప మరేదీ మిగలని అవస్థ ఎంతటి హింసాపూరితమో... అంటారు కవయిత్రి విమల. ఇంతకంటే వికృతమైన మరో నిజమేమిటంటే.... ఈ కాస్మొటిక్స్‌లో మానవ ఎముకల పొడి కలుపుతున్నారంటే మరింత ఆశ్చర్యపోక తప్పదు మరి. సామూహిక దహన స్థలాలు, ఖనన స్థలాల నుంచి ఎముకలను సేకరించి, కాల్షియం తయారీ కర్మాగారాలకు, సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేసే యూనిట్లకు విక్రయించడం కొందరికి ఉపాధి. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ తర్వాత ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటికీ....గత రెండు దశాబ్దాలుగా ఈ ఎముకలు సేకరించే పని ఉనికిలో వుంది. ఈ విషయం వరల్డ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ అలయన్స్‌, సౌత్‌ ఏషియన్‌ శానిటేషన్‌ లేబర్‌ నెట్‌వర్క్‌, పశ్చిమ బెంగాల్‌ లోని సఫాయి కర్మచారి ఏక్తా మంచ్‌ సంయుక్త పరిశోధనలో వెల్లడైంది. కొందరు వ్యక్తులు బతుకుతెరువుగా ఈ పని ఎంచుకుంటే, ఇంకొందరు తమ లాభాలను పెంచుకోడానికి వీరిని ప్రోత్సహిస్తున్నారు.
    'కారులో షికారు కెళ్లే/ పాలబుగ్గల పసిడి దానా/ బుగ్గమీద గులాబి రంగు/ ఎలావచ్చెనో చెప్పగలవా' అంటాడు ఆత్రేయ. చర్మ సౌందర్యానికి, ముఖ నిగారింపులకు వాడే సాధనాల వెనుక రెండురకాల దోపిడీ వుంది. అటు కార్మికులను, ఇటు కాస్మొటిక్స్‌ ఉపయోగించేవారినీ దోచుకుంటున్నారు. సౌందర్య సాధనాలు, ఎరోబిక్స్‌, జిమ్‌లు, డైటీషియన్‌ ప్రోగ్రామ్‌ల వంటివి ఇప్పుడు విస్తారమైన వ్యాపారంగా మారాయి. మన దేశంలో దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందంటే నమ్మక తప్పదు. ఈ వ్యాపారం కూడా స్త్రీల సౌందర్యోద్ధరణ కోసమే అన్నట్లుగా ప్రచారం నిర్వహించడం... కార్పొరేట్ల లాభాన్వేషణలో ఒక భాగం. మహిళలను వంట గదిలో బంధించినట్లే... వారి ఆలోచనల్ని కాస్మొటిక్స్‌ వ్యాపార విలువల పంజరంలో బంధించారు. ఒక పంజరానికి మరొకటి తోడైంది. ఇప్పుడు చేయాల్సింది... కాస్మొటిక్స్‌ పంజరాల నుంచి బయటపడటం. ప్రతి ఒక్కరిలోనూ సహజత్వం వుంటుంది. దాన్ని కాపాడుకోవడమే నిజమైన అందం.