Apr 09,2023 21:58

పండుగ పూట విషాదం

వేంపల్లె : మండలంలోని అలవలపాడు ఎస్‌సి కాలనీకి చెందిన అక్కా తమ్ముడు సుశాంత్‌ (10), సాయి తేజశ్రీ (11), వారి మేనమామ శశికుమార్‌తోపాటు వేమల మండలం వేల్పుల గ్రామానికి చెందిన జానయ్య (25) కలిసి ఆదివారం ఈస్టర్‌ పండగ సందర్భంగా సరదాగా గ్రామ సమీపంలోని జిఎన్‌ఎఎస్‌ఎస్‌ పంట కాల్వల వద్దకు ఈత కోసం వెళ్లారు. మొదటగా ఇద్దరు చిన్నారులు కాలువలోకి దిగారు. కాల్వలో బురద మట్టి ఎక్కువగా ఉండడంతో వారు అందులో ఇరుక్కుపోయారు. జానయ్య అనే యు వకుడు ఇద్దరు చిన్నారులను కాపాడే ప్రయత్నంలో అతనూ అందులో చిక్కుకుని పోయాడు. వారి ముగ్గురి ఆచూకీ కోసం చిన్నారుల మేనమామ శశికుమార్‌ వెతికాడు. వారు కన్పించకపోవడంతో వెనుదిరిగి గట్టుపైకి వచ్చాడు. కాలువ సమీపంలో పనిచేస్తున్న కొందరు వ్యక్తులతో పాటు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు బాలస్వామిరెడ్డి సభ్యులు కాల్వలోకి దిగి బురదలో చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీశారు. అప్పటికే ముగ్గురు మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తిరుపాల్‌నాయక్‌ పేర్కొన్నారు.
ఏడాది కిందటే రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి
చిన్నారుల తల్లిదండ్రులు రూతు, సురేష్‌కుమార్‌. వారిది చక్రాయపేట మండలం చిలేకాంపల్లె. ఏడాది కిందట తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. దీంతో వారు వేంపల్లె మండలంలోని అలవలపాడులో తమ అవ్వా, తాతల వద్ద ఉంటూ నారాయణ పాఠశాలలో 5,6 తరగతులు చదువుకుంటున్నారు. చిన్నారుల తండ్రి ఎర్రగుంట్ల డాబాలో వంట మాస్టర్‌గా పని చేస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నాడు. ఈస్టర్‌ పండగ కావడంతో బంధువులతో కలిసి గ్రామ సమీపంలోని ఎస్‌సి కాలనీలో సంతోషంగా పండుగ జరుపుకున్నారు. మేనమామ శశికుమార్‌తో కలిసి ఇద్దరు చిన్నారులు, సమీప బంధువైన వేంపల్లె మండలానికి చెందిన జానయ్య కూడా కాలువ వద్దకు ఈత కోసం వెళ్లి మృతువాత పడ్డారు.
పెళ్లైన ఆరు నెలలకే..
ఇదీలా ఉండగా జానయ్య పులివె ందులలో మెకానిక్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఆరు నెలల కిందటే వీరపునాయనపల్లె మండలం పాలగిరికి చెందిన శృతి అనే అమ్మాయితో వివాహమైంది. ఇద్దరు చిన్నా రులను కాపాడబోయే మృత్యువాత పడడంతో అతని కుటుంబంలోనూ తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లైన ఆరు నెలలకే జానయ్య మృతి చెందడంతో బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా మృతుడి తండ్రి గత డిసెంబర్‌లో విద్యు దాఘాతంతో మృతిచెందాడు.
శోకసంద్రంలో బంధువులు
పండుగ రోజు ముగ్గురు నీటిలో పడి చనిపోవడంతో అలవలపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మృతదేహాలను చూసేందుకు వచ్చిన బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఏడాది కిందట భార్యను, ఇప్పుడు పిల్లలిద్దరిని కోల్పోవడంతో సురేష్‌కుమార్‌ బాధకు అంతు లేకుండా పోయింది. మరో వైపు వివాహమైన ఆరు నెలలకే భర్తను కోల్పోయిన జానయ్య సతీమణి శృతి కన్నీరు మున్నీరుగా విలపించింది. దీంతో ఇరు కుటుంబాల బంధువులు శోక సంద్రంలో ముగినిపోయారు.