Apr 18,2023 20:49

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌
పకడ్బంధీగా రెండో విడత రీ సర్వే

నెల్లూరు:జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద జిల్లాలో రెండో విడత చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, తహసిల్దార్లు, మండల సర్వేయర్లదే పూర్తి బాధ్యతని కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రీ సర్వే, పలు రెవెన్యూ అంశాలపై జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాధ్‌, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ శోభిక, ఇంచార్జ్‌ జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు డివిజన్‌ లలో మొదటి విడత రీ సర్వే చేపట్టిన గ్రామాల్లో పనుల పురోగతిని డివిజన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ భూమిలో సుమారు వందేళ్ల తర్వాత భూములకు హక్కు కల్పించడం, రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ప్రక్రియకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని, అధికారులు క్షేత్రస్థాయిలో రీ సర్వే పనుల పురోగతిని పరిశీలించి పనుల్లో వేగం పెంచాలన్నారు.
రెండో విడతలో 62 గ్రామాల్లో రీ సర్వే చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రధానంగా సర్వే రికార్డులను సిద్ధం చేయడం, అవసరమైన రెవిన్యూ పత్రాలను అందుబాటులో ఉంచుకోవడం, భూ హక్కు పత్రాలను తయారు చేయడం, వెబ్‌ లాండ్‌ 2.0 లో నమోదు చేయడం, హద్దురాళ్ళు నాటడం, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టడం వంటి ఆరు దశలపై ప్రత్యేక దష్టి సారించి ఎక్కడా ఇబ్బందులు లేకుండా రీ సర్వే ను పూర్తిచేయాలన్నారు. జిల్లాలో మొదట విడత రీ సర్వేకు ఎంపిక చేసిన 107 గ్రామాలకు ఫైనల్‌ ఆర్‌ఓఆర్‌ పూర్తయిందని, ఈ రికార్డులను సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. 41569 ఖాతాలకు గాను 28802 ఖాతాలు ప్రింటింగ్‌ అయ్యాయని, మిగిలినవి కూడా త్వరగా ప్రింటింగ్‌ కు సిద్ధం చేయాలన్నారు. అలాగే 1,19,198 హద్దురాళ్ళు రాగా, 58785 రాళ్లను నాటడం జరిగిందని, ఇంకా 60413 హద్దురాళ్ళు నాటాల్సి ఉందన్నారు. మొదటి విడతలో వచ్చిన సమస్యలు రెండో విడతలో రాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఆర్డిఓ, డిఐలు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు. రీ సర్వే డీటీ కి కేవలం రీ సర్వే పనులు మాత్రమే అప్పగించాలన్నారు. అలాగే చుక్కల భూముల సమస్యలు, స్మశాన వాటిక నిర్మాణం, అసైన్మెంట్‌ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. స్పందన అర్జీలపై ప్రత్యేక దష్టిసారించాలని, వచ్చిన అర్జీలే మళ్లీ మళ్లీ రాకుండా చూడాలన్నారు. భూముల మ్యూటేషన్లు, సర్వేకి సంబంధించి ఎఫ్‌ లైన్‌ దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని, వీటిపై ప్రత్యేక దష్టిసారించాలన్నారు. ప్రతి దరఖాస్తు కూడా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. రెవిన్యూ అధికారులు అందరూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా, ప్రజలతో స్నేహపూర్వకంగా మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని కలెక్టర్‌ ఈ సందర్భంగా సూచించారు. భూముల రీసర్వే లో హద్దు రాళ్లు ఏర్పాటు చేయడం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.గ్రామాల వారీగా ప్రణాళిక తయారు చేసుకుని హద్దు రాళ్లు ఏర్పాటు చేయడం వేగవంతం చేయాలని సూచించారు. హద్దు రాళ్లు ఏర్పాటు చేసేటప్పుడు సక్రమంగా వేస్తున్నారా లేదా వి ఆర్‌ ఒ,వి. ఆర్‌. ఎ లు దగ్గర ఉండి పర్యవేక్షించాలన్నారు. భూ హక్కు పత్రాలు భూ యజమానులకు ఎప్పటి కప్పుడు అందజేయాలని,రైతుల నుండి డబ్బు ఆశించి రైతులకు అందించకుండా వి ఆర్‌ ఒ ల వద్దే పెట్టుకుని పంపిణీ చేయక పోతే సస్పెండ్‌ చేస్తామన్నారు.ఈ సమీక్షా సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ విద్యాధరి, సర్వే ల్యాండ్‌ రికార్డుల ఏడి హనుమాన్‌ ప్రసాద్‌, ఆర్డీవోలు మలోల, కరుణ కుమారి, శీనా నాయక్‌, తాసిల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.