ప్రజాశక్తి - చిలమత్తూరు :: జగనన్న భూరక్ష పథకంలో బాగంగా ప్రభుత్వం నిర్వహించే రీసర్వే పనులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బసంత్‌కుమార్ పేర్కొన్నారు. రీ సర్వేలో భాగంగా భూ హద్దులు తెలియజేసే సర్వే రాళ్లు తయారీని టెండర్ల ద్వారా మండల పరిధిలోని పలు గ్రానైట్ పరిశ్రమలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ నేప్యంలో సర్వే రాళ్ల కొలతలు, వాటి స్వరూపాన్ని కలెక్టర్ బసంత్‌కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా గ్రానైట్ యాజమాన్యాలకు రాళ్ల నాణ్యతపై పలు సూచనలు చేశారు. అనంతరం మండల పరిధిలోని దేమకేతేపల్లి గ్రామంలో సిపి పాయింట్‌ను పరిశీలించారు. సిపి పాయింట్ ఏర్పాటు ద్వారా డ్రోన్ డిజిటల్ మ్యాపింగ్ సులభతరం అవుతుందని ఈసందర్బంగా ఆయన చెప్పారు. అత్యంత పారదర్శంగా ఈ రీ సర్వే జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నాగరాజు, సర్వేయర్ సురేష్, ఎంపిడిఒ రాంకుమార్, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
సోమందేపల్లి : మండలంలో భూ సర్వే పనులను సక్రమంగా చేపట్టాలని కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. శనివారం మండలంలోని పందిపర్తి గ్రామంలో జరుగుతున్న భూ సర్వే పనులను ఆయన పరిశీలించారు. సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. భూ సర్వే ద్వారా సమస్యలు తీరుతాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్వే జరిగేటప్పుడు తప్పనిసరిగా రైతులకు కూడా ఉండేటట్లు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాగే చెరువు గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న అమృత్ సరోవర్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో మండల, జిల్లా సర్వేయర్లు, రెవిన్యూ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ చేతన్, తహశీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీడీ శివానంద నాయక్, డిప్యూటీ తహశీల్దార్ శ్రీకాంత్, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.










