పుట్టపర్తి అర్బన్ : పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి శిక్షణ పొందాలని కలెక్టర్ పి.బసంత్ కుమార్ పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం హాలులో పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌పై నిర్వహించిన మొదటి శిక్షణ తరగతుల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా, ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో పట్టభద్రలకు సంబంధించి 54 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయులకు సంబంధించి 32 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అనుమానాలు ఉన్నా మాస్టర్ ట్రైనర్లచే సందేహాలను నివత్తి చేసుకోవాలన్నారు. బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్, ఇతర పోలింగ్ మెటీరియల్‌తో పాటు సదరు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన పొంది బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు వచ్చిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డిఆర్‌ఒ కొండయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. బ్యాలెట్ పేపర్ అకౌంటును పరిశీలించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి డివిజన్లకు సంబంధించిన ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










