- రివర్స్ టెండరింగ్‌లా ఫిట్‌మెంట్
- కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల ప్రస్తావన ఏదీ ?
ప్రజాశక్తి-యంత్రాంగం : ఉద్యోగులకు నష్టదాయంగా ఉన్న పిఆర్‌సిని పున:సమీక్షించాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మధ్యంతర భృతి (ఐఆర్)ను 27 శాతం ప్రకటించిన ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను 23 శాతానికే పరిమితం చేయడం ఉద్యోగులను, ఉపాధ్యాయులను నిరుత్సాహపర్చిందని పేర్కొ న్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులకు పిఆర్‌సి అమలు చేయకపోవడం దారుణమని అన్నారు.
చరిత్రలో ఇలాంటి పిఆర్‌సిని చూడలేదు
- పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ బాలసుబ్రహ్మణ్యం
ఐ.ఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువగా ఉండడం ఇప్పటి వరకూ చరిత్రలో తాను ఎన్నడూ చూడలేదని శాసనమండలి పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ వి.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. సిపిఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి వెళ్లడం పెద్ద వంచనని పేర్కొన్నారు. శనివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పంచడం వల్ల రాబోయే రెండేళ్లూ ఒక్కరు కూడా రిటైర్ కారని అని పేర్కొన్నారు. వారికి రిటైర్మెంట్ బెన్‌పిట్స్ ఈ రెండేళ్లలో ఇవ్వాల్సిన అవసరం ఉండదని, అందుకే రిటైర్మెంట్ వయస్సును ప్రభుత్వం అడగకపోయినా పెంచిందని అన్నారు.
ఫిట్‌మెంట్ తగ్గింపు రివర్స్ టెండరింగా ?
-సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఎవి.నాగేశ్వరరావు
ఫిట్‌మెంట్ తగ్గింపు రివర్స్ టెండరింగా? అని సిఐ టియు రాష్ట్ర కోశాధికారి ఎ.వి.నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆయన విశాఖలో మీడియా తో మాట్లాడారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై సిఎం స్పందించకపోవడం అన్యాయమని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులకు 11వ పిఆర్‌సి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పిఆర్‌సి ఫిట్‌మెంట్‌పై సిఎం పునరాలోచించాలి
యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు
ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా 27 శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్‌సి అమలు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. విజయ నగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురం వాసవి కల్యాణ మండపంలో జరిగిన యుటిఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంటి అద్దె అలవెన్సుల ప్రస్తుత రేట్లు యథాతథంగా ఉంచాలని కోరారు.
ఉద్యోగులకు నష్టదాయకంగా ఉంది
ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు
ప్రసుత్తం ప్రకటించిన పిఆర్‌సిని తాము వ్యతిరేకిస్తు న్నామని పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. పిఆర్‌సి పబ్లిక్ డాక్యుమెంట్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను అక్టోబర్ నాటికి రెగ్యులర్ చేయాలని. ఇప్పుడు తొమ్మిది నెలలు ముందుకు జరిపి రెగ్యులర్ చేస్తామంటున్నారని తెలిపారు.










