Jul 10,2021 16:35

పాట్నా : వివాహ వేడుకల్లో చిన్నపాటి వర్షం పడినా.. ప్రదేశమంతా చిత్తడిచిత్తడిగా అయ్యి ఏదో తూతూ మంత్రంగా పెళ్లి జరిగిపోతుంది. ఇక ఆ వేడుకకు హాజరైన అతిథులు సంగతి సరేసరి. అనుకోని అతిథుల్లా వచ్చే వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులెదురైనా.. పలానా పెళ్లి అలా జరిగిందని చరిత్ర ఉంటుంది. తాజాగా బీహార్‌లో జరిగిన వివాహం కూడా.. సరిగ్గా ఈ కోవకు చెందినదే. బీహార్‌ సంస్తిపూర్‌ జిల్లాలోని గోబర్సిత్త గ్రామంలో వివాహానికి ముందు తగిన ఏర్పాట్లు చేసుకున్నా.. సరిగ్గా పెళ్లి సమయానికి వరదలు ముంచెత్తాయి. దీంతో అతిథుల కోసం మూడు పడవలను ఏర్పాటు చేసి ఆ పడవలోనే వివాహాన్ని జరిపించారు. మరలా తిరిగి అదే పడవల్లో ఇంటికి చేరుకున్నారు ఆ వధూవరులు.. అతిథులు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఇలా వరదలు ముంచెత్తడానికి గల కారణమేమిటంటే.. భారీ వర్షాలు పడడం వల్ల బాగ్మతి నది నీటి మట్టం పెరిగి గోబర్సిత్త గ్రామంలో వరదలకు దారితీసింది.