Apr 16,2022 07:13

ఏలూరు జిల్లా అచ్చిరెడ్డిగూడెం లోని జనావాసాల మధ్య ఉన్న పోరస్‌ ఫ్యాక్టరీలో గత బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు కష్టజీవులు బుగ్గిపాలైపోయారు. మరో 13 మంది మృత్యువుతో పోరాటం సాగిస్తున్నారు. అగ్నికీలలకు మాడి మసైపోయి గుర్తుపట్టడానికి కూడా నోచుకొని ఆ అభాగ్యుల భౌతికకాయాలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. చనిపోయిన ఆరుగురిలో నలుగురు బీహార్‌కు చెందిన వలస కార్మికులు కాగా ఇద్దరు స్థానికులు. మొన్న విశాఖ, నిన్న హైదరాబాద్‌, ఇప్పుడు ఏలూరులో చోటుచేసుకున్న పారిశ్రామిక ప్రమాదాలను కేవలం యాదృచ్ఛిక ఘటనలుగానే చూడలేం. పరిశ్రమల్లో ప్రత్యేకించి రసాయన పరిశ్రమల్లో పదేపదే చోటుచేసుకుంటున్న ఈ ప్రమాదాలకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న వినాశకర విధానాలే కారణం. కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తుతూ వారిసేవలో పునీతమౌతున్నందునే ఈ దారుణాలు. పాలకుల అలవిమాలిన నిర్లక్ష్యానికి, పెట్టుబడిదారుల లాభాల వేటకు అమాయకులైన ప్రజలు బలైపోతున్నారు. పొట్ట చేత పట్టుకొని మనుగడ కోసం సుదూర ప్రాంతాలకు తరలివచ్చిన వలస కార్మికుల ప్రాణాలయితే గాలిలో దీపాలే. పారిశ్రామిక ప్రమాదాలకు సమిధులౌతున్నవారిలో అత్యధికులు వలస కార్మికులే.
    దేశవ్యాప్తంగా కూడా పారిశ్రామిక ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. కష్టజీవుల బతుకులు బుగ్గిపాలైపోతున్నాయి. కార్మికుల వేతనాలకు, భత్యాలకు భరోసానిచ్చే చట్టాలతో పాటు పని ప్రదేశాల్లో వారికి భద్రత కల్పించే చట్టాలన్నిటినీ గంపగుత్తగా చుట్టేసి గంగలో పడేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వాటిస్థానంలో కేవలం మూడే మూడు కోడ్‌లను తీసుకొచ్చింది. దీంతో పరిశ్రమల్లో భద్రతాపరమైన తనిఖీలకు, ఆడిటింగ్‌లకు ప్రభుత్వాలు తిలోదకాలు ఇచ్చేస్తున్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు గేట్లు బార్లా తెరిచి వాటి చేతిలో ప్రభుత్వాలు కీలుబొమ్మలుగా మారిపోయాయి. కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లతో కార్మికుల బతుకులను బలిపెట్టేస్తున్నారు. పరిశ్రమల జవాబుదారీతనానికి లేబర్‌ కోడ్‌లు సమాధి కట్టేశాయి.
    పారిశ్రామిక ప్రమాదాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోంది. రెండు సంవత్సరాల క్రితం విశాఖలోని ఎల్‌జి పాలిమర్స్‌లో ప్రమాదం ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నా కూడా పాలకులు పాఠాలు నేర్వడం లేదు. కెమికల్‌ ఫ్యాక్టరీలను చట్ట ప్రకారం కనీసం ప్రతి మూడు మాసాలకు ఒకసారైనా సేఫ్టీ ఆడిట్‌ చేయాల్సివుంది. కానీ పోరస్‌ ఫ్యాక్టరీలో రెండేళ్లుగా ఇలాంటి తనఖీలు నిర్వహించిన ఆనవాళ్లే లేవని స్థానికులు చెబుతున్నారు. లక్షలాది లీటర్ల విష వ్యర్థాలను పొలాల్లోకి, ప్రజల తాగునీటి వనరుల్లోకి నేరుగా వదిలేస్తున్నారన్న విమర్శలు కూడా పోరస్‌ ఫ్యాక్టరీపై ఉన్నాయి. ఇవన్నీ కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను ఉల్లంఘించడమే. ఇంత మారణహోమం జరిగాక కాలుష్యాన్ని గుర్తించినట్లు, ఫ్యాక్టరీని సీజ్‌ చేస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి గురువారం నాడు ప్రకటించింది.
    రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలి. రాష్ట్రంలో అన్ని రసాయన పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ చేపట్టాలి. భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై తక్షణమే చర్యలు చేపట్టాలి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసి ఎక్స్‌గ్రేషియా ప్రకటించేసి చేతులు దులిపేసుకోవడం కాకుండా నిర్దిష్టమైన కార్యాచరణతో ప్రజల క్షేమం కోసం సంకల్పించాలి. జనావాసాల మధ్యనున్న పరిశ్రమలను తక్షణమే తరలించాలి. ఇక నుంచి అయినా పారిశ్రామిక ప్రమాదాల వల్ల ప్రజలకు ముప్పు రానివ్వబోమన్న భరోసాను ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లను ఆసరాగా చేసుకొని యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలకు నీళ్లొదిలేయడంతో పదేపదే చోటుచేసుకున్న పారిశ్రామిక ప్రమాదాలు కార్మిక వర్గానికి ఒక హెచ్చరిక. లేబర్‌ కోడ్‌లను తిప్పికొట్టకపోతే శ్రమజీవుల ప్రాణాలకు భద్రత ఉండదు. కార్మిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న లేబర్‌కోడ్‌లు రద్దు అయ్యేదాకా పోరు సల్పాలి.