Sep 27,2020 07:32


తమ కాలం కంటే ముందుండే వాళ్ళను దార్శనికులంటాం. సవాళ్లు, సమరాలలో ముందుండే వాళ్ళను సాహసికులంటాం. ధన, ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించగలిగిన వాళ్ళను త్యాగులంటాం. చేయవలసిందేమిటో, ఎందుకో స్పష్టంగా చెప్పగలవాళ్ళను సిద్ధాంతకారులంటాం. ఇందులో ప్రతి నిర్వచనమూ భగత్‌సింగ్‌కు వర్తిస్తుంది. భగత్‌సింగ్‌ అంటే శాండర్స్‌ (స్కాట్‌) హత్య, పార్లమెంటులో బాంబు ప్రయోగం, ధైర్యంగా ఉరికంబం ఎక్కడం గుర్తుకు రావచ్చు. నిజానికి నెత్తి మీద టోపీతో మన మనసులలో స్థిరపడిన భగత్‌సింగ్‌ ఇమేజికన్నా ఆయన ఉజ్వల జీవితం ఎన్నో రెట్లు విశిష్టమైంది. విప్లవాత్మకమైంది. ఆయన సమరశీల జీవితం, సమగ్ర అవగాహన, సంయమనం నిండిన ఆచరణ ఆ కాలానికి అనితర సాధ్యమైనవి. ఇప్పటికీ వర్తించేవి. ప్రత్యేకించి యువతకు అవి మార్గదర్శకాలు. ఉత్ప్రేరకాలు. పాతికేళ్లు రాకుండానే ఉరికంబం ఎక్కిన యువ కిశోరం గనక ఆయన యువతకు మార్గదర్శకుడై నాడన్నది చాలా పరిమితమైన అవగాహన. యువత ఎలా వుండాలి? తమ జీవితాలు ఎలా మల్చుకోవాలి? దేశం కోసం, ప్రజల కోసం ఎలా పని చేయాలి? అన్న దానిపై ఆయన అధ్యయనం, ఆచరణ ఆదర్శప్రాయంగా వుండటం అందుకు కారణమవుతుంది. దేశంలో ఏకపక్ష పోకడలు, మతతత్వాలు స్వార్థపూరితమైన ధనాఢ్య వర్గ రాజకీయాలు వెర్రితలలు వేస్తున్న ఈ రోజున త్యాగం, సాహసం, భావ స్పష్టత నిండిన భగత్‌ సింగ్‌ బాట ప్రత్యేకించి చెప్పుకోదగింది. మత వాద, మితవాద రాజకీయాలు ఒకవైపు, తుపాకులు ఎన్‌కౌంటర్లే విప్లవం అన్న ప్రచారాలు మరో వైపు, ఎవరో కొందరు వ్యక్తులనే విగ్రహాలుగా చేసి వారి చుట్టూ పరిభ్రమించే వ్యక్తి ప్రధాన రాజకీ యాలు ఇంకోవైపు చూస్తున్నపుడు వాటికి భిన్నమైన విశాల రాజకీయాలను లోతైన సిద్ధాంత దృష్టిని ప్రదర్శిం చిన భగత్‌సింగ్‌ ముందు చూపు తెలుస్తుంది.
వందేమాతరం, అహింస, సత్యాగ్రహం వంటి మాటలే వినిపిస్తున్న రోజున 'ఇంక్విలాబ్‌ జిందాబాద్‌' అని నిప్పులు కక్కుతూ నినదించిన వాడు ఆయన. కోర్టు విచారణకు హాజరైన ప్రతిసారి భగత్‌సింగ్‌ బృందం అదే నినాదమిస్తూ ప్రవేశించేది. 'విప్లవం వర్ధిల్లాలి' అన్న ఆ మాటలు ఒక బ్రిటిష్‌ న్యాయమూర్తికి మింగుడు పడలేదు. 'ఎప్పుడూ ఎందుకు ఆ నినాదం ఇవ్వడం?' అని ఆయన ప్రశ్నిస్తే 'ఆ భావన జనం లోకి తీసుకువెళ్లడానికి' అని సూటిగా జవాబిచ్చాడు. ఎందుకంటే ఆయనకు దేశ స్వాతంత్య్రం బ్రిటిష్‌వారి నిష్క్రమణతో అధికార మార్పిడి తోనే పూర్తి కాదని బాగా తెలుసు. స్వాతంత్య్రం కోసం అహింసను మంత్రంగా వల్లించడమూ మార్గం కాదు. అలా అని ఆయన వ్యక్తిగత హింసకే పట్టం కట్టాలని అనుకోలేదు. అతి చిన్న వయసు లోనే అపారమైన అధ్యయనం చేసిన ఆయన భారత ప్రజల విమోచనకు సోషలిజమే మార్గమన్న అవగాహనకు వచ్చాడు. అంతకు ముందు కాలంలో దుర్గాదేవి ముందు రక్త ప్రమాణంతో సహా జాతీయ విప్లవకారుల మార్గం ఆవేశ ప్రధానంగా ఉండేది. దాన్ని సంఘటిత పరిచి దానికి ఒక ఏక రూపతను, భావ స్పష్టతను కలిగించాడు. హిందుస్తాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ ఆర్మీగా ఏర్పరచారు. అక్టోబర్‌ విప్లవానికి స్వాగతం పలికాడు. అక్కడ లెనిన్‌ అనుసరించిన రాజకీయ వ్యూహాలను లోతుగా అధ్యయనం చేశాడు. అందుకు విప్లవానికే అంకితమైన కార్యకర్తలు ఉండాలని ప్రతిపాదించాడు. కమ్యూనిస్టు పార్టీ కూడా బలపడని రోజులలోనే భగత్‌సింగ్‌ అంతటి పరిపక్వత ప్రదర్శించడం అపూర్వమే.
ప్రజా భద్రతా చట్టం, పారిశ్రామిక వ్యవహారాల చట్టం రెండూ ప్రజల ఉద్యమాన్ని అణచివేయడానికి వచ్చాయి. వాటికి నిరసనగా భగత్‌సింగ్‌ పార్లమెంటులో బాంబులు విసరాలని ప్రతిపాదించడమే కాక అందుకు తానే వెళ్తానని పట్టుపట్టాడు. బాంబులు వేశాక దొరికిపోయి తమ భావాలు లోకానికి చాటాలని నిర్ణయించుకున్నారు గనుక ఆ పనికి ఆయనను పంపడానికి సహచరులు ఒప్పుకోలేదు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ వచ్చాక ఆయన సహాయంతో మరోసారి చర్చ చేయించి తనే వెళ్లేలా నిర్ణయం మార్పించాడు. తన భావాలు బలంగా వినిపించాలన్నది ప్రధాన ఉద్దేశం. పార్లమెంటులో అమాయకులకు ముఖ్యంగా భారతీయులకు ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో పొగ బాంబులు మాత్రమే తీసుకెళ్ళాడు. వాటిని విసిరి కలకలం సృష్టించిన తరువాత కరపత్రాలు విసిరి పారిపోవడానికి అవకాశమున్నా 'విప్లవం వర్థిల్లాలి' అని నినదిస్తూ అనుకున్న ప్రకారమే దొరికిపోయాడు. తర్వాత కోర్టులో తన చర్యను సమర్థించుకుంటూ తాము ప్రాణాలకు చాలా విలువనిస్తామని అనవసరంగా చంపబోమని స్పష్టీకరించాడు. బాంబులు విలువైనవని, వాటిని వ్యర్థంగా వాడటం నష్టంకూడానని చెప్పాడు. విప్లవానికి ఆధారం ఆయుధాలు, దౌర్జన్యకర చర్యలు కావని, ప్రజా బలమేనని చాటి చెప్పాడు. మరీ తొలి దశలో కొద్దికాలం తప్ప తానెప్పుడూ టెర్రరిస్టుగా లేనని ప్రకటించాడు. నిజమైన విప్లవకారులు ప్రజాస్వామిక వాదులు కూడా కనుక వారు విభేదాలపై అసహనం చూపరు. భగత్‌సింగ్‌కు గురువు లాంటి లాలా లజపతిరారు ఒక దశలో మత రాజకీయాల ప్రభావానికి గురైతే భగత్‌సింగ్‌ పరోక్షంగా విమర్శించారు. రాజకీయంగా లజపతిరారు విప్లవకారులను వ్యతిరేకించేవారు. అయినా దారుణమైన లాఠీఛార్జీ జరిపి ఆయన మృతికి కారణమైన బ్రిటిష్‌ అధికారులను శిక్షించాలని నిర్ణయించడం భగత్‌సింగ్‌ విశాల దృష్టిని తెల్పుతుంది. వారి భావాలతో ఏకీభవించకపోయినప్పటికీ విఠల్‌భారు పటేల్‌, మోతీలాల్‌, మాలవ్యా వంటి వారు భారత ప్రజల ప్రియతమ నాయకులని, అలాంటి వారున్న సభలో తాము ప్రమాదకరమైన బాంబులు విసరడం కలలోనైనా ఊహించలేని విష యమని కోర్టులో ప్రకటిస్తాడు. ఇది ప్రజాస్వామిక వాదులను కలుపుకొని పోవాలన్న చైతన్యం.
త్యాగం, సాహసం రెండు రకాలని అంటూ ఉరికంబం ఎక్కడం కంటే చివరి వరకూ ప్రజల కోసం పని చేయడంలోనే అత్యధిక త్యాగం ఉన్నదని చెప్పడం ఆయన నమ్రతకు, వాస్తవికతకు నిదర్శనం. 'సుఖలాలస కోసమే జీవితం కాదు, లక్ష్య సాధనకు అంకితం కావాల'ని ఆయన అనేక చోట్ల సందేశమిస్తారు. అయితే అందుకు అధ్యయనం అవసరమని ఆయనకు తెలుసు. అందుకే ఎప్పుడూ పుస్తకాలు వెంట పెట్టుకుని తిరిగేవాడు. భగత్‌సింగ్‌ దగ్గరకు వెళ్తే ఆ జేబు లోంచి ఒకటి ఈ జేబు లోంచి ఒకటి పుస్తకాలు తీస్తారని మిత్రులు హాస్యమాడేవారు. తనను ఉరి తీస్తారని తెలిసిన తర్వాత కూడా పుస్తకాలు ఆపకుండా చదవడమే కాదు-ఫలానా గ్రంథాలయంలో ఫలానా పుస్తకం దొరుకుతుంది, తెచ్చిపెట్టమని మిత్రులకు ఉత్తరం రాయడం చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎంత దృఢమైందో అర్థమవుతుంది. ఆ సమయంలోనూ చదివినవి నోట్సు రాసిపెట్టుకున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా నమ్మకం కోల్పోరాదన్నది ఆయన సందేశం. ఒకసారి చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆత్మహత్య చేసుకోవడం గురించి ప్రస్తావిస్తే దాన్ని గట్టిగా ఖండించాడు. ఎట్టి పరిస్థితులలోనూ పోరాడాలే గాని ప్రాణాలు తీసుకోవడం తప్పన్నాడు. ఈ మధ్య వచ్చిన పలు నివేదికలు దేశంలో నిరుద్యోగం, ఆర్థిక సమస్యల పెరుగుదల గురించి, మరో వైపు ఆత్మహత్యలు పెరగడం గురించి చెబుతున్న నేపథ్యంలో ఈ బోధనలు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సి వుంది.
మత రాజకీయాలతో ప్రజలను విభజించడం మంచిది కాదని ఆయన పదే పదే చెబుతారు. కేవలం ఒక మతానికి చెందినవారనే కారణంతో ఒక జన సముదాయాన్ని ద్వేషించడం మూర్ఖత్వమని కోర్టులో స్పష్టంగా ప్రకటించారు. నేటి పరిస్థితులకు ఇవెంతగా వర్తించేది చెప్పనవసరం లేదు. జలియన్‌ వాలాబాగ్‌కు వెళ్లి పిడికెడు మట్టి జేబులో వేసుకుని వచ్చిన భగత్‌సింగ్‌ను షహీన్‌బాగ్‌లో చూస్తున్న నిరంకుశత్వం గుర్తు చేస్తుంది. పార్లమెంటుపై బాంబులు విసిరిన సమయంలో బ్రిటిష్‌ వారు సభ స్ఫూర్తిని ఎలా దెబ్బ తీసి నిరంకుశ చట్టాలు ఆమోదింపచేసుకుంటున్నారో విమర్శిం చారు. తాజాగా రైతు, కార్మిక వ్యతిరేక బిల్లుల ఆమోదంలో అచ్చంగా అదే చూశాం. ఇక ఎవరో కొందరు వ్యక్తుల చుట్టూ పరిభ్రమించడం వల్ల ప్రజల జీవితాలు మారబోవని ఆయన పదే పదే చెబుతారు. కాని ఇప్పుడు కేంద్రంలో మోడీ భజన, రాష్ట్రంలో జగన్‌, చంద్రబాబుల మధ్యనే రాజకీయాలు తిప్పుతున్న తీరు కుల, మత తత్వాలను పెంచే వ్యూహం చూస్తే ఆ మాటలు మరింత బాగా అర్థమవుతాయి.
ప్రేమ కొద్దీ తనను విడిపించేందుకు క్షమాభిక్ష కోసం ప్రయత్నించిన నాన్నపై భగత్‌సింగ్‌ గౌరవంగా ఆగ్రహం వెలిబుచ్చడం ఆయన పరిపక్వతను చెబుతుంది. ఎందుకంటే నాన్న, చిన్నాన్న కూడా దేశభక్తులే. ఈ సమయంలో తన సహచరులనైనా అక్కడి నుంచి తరలించి మెత్తబర్చవచ్చునని ప్రభుత్వం అనుకుంది. జైలు సూపరింటెండెంట్‌ వారికి చివరిసారిగా భగత్‌సింగ్‌ను కలుసుకునే అవకాశం కలిగించాడు. వారిలో ఒకరైన జయదేవ్‌ కపూర్‌ 'సర్దార్‌, నీవు చనిపోవడానికి ఇక సిద్ధంగా వున్నావు. ఇందుకు నీవేమీ విచారించడం లేదా?' అని అడిగితే, దానికాయన బిగ్గరగా నవ్వి ఇలా అన్నాడు. 'విప్లవ పథంలో అడుగిడినప్పుడే నా ప్రాణాలర్పించి దేశమంతటా ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, విప్లవం వర్థిల్లాలి అనే నినాదాన్ని వ్యాపింపచేయగలిగితే జీవితం ధన్యమైపోతుందనుకున్నాను. ఈనాడు జైలు గదిలో కూర్చు న్నప్పటికీ కోట్లాది మన ప్రజల కంఠం నుండి వెలువడుతున్న ఆ నినాదాన్ని వినగలుగుతున్నాను. ఈ నా నినాదం స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఉద్దీపింపచేసే శక్తిగా సామ్రాజ్య వాదులను చివరివరకూ దెబ్బ తీస్తూనే ఉంటుందనే నమ్మకం నాకుంది. ఇంత చిన్న జీవితానికి ఇంతకన్నా మరేం కావాలి?
నిజంగానే భగత్‌సింగ్‌ నమ్మకం వమ్ము కాలేదు. తన మాటలు, జీవితం కోట్ల మంది యువతకు నాటికీ నేటికీ ప్రేరణగా కొనసాగుతున్నాయి. యువత ఉద్యమాలు అవసరమని భావిస్తోందని ఇటీవల సర్వేలలో కూడా వెల్లడైంది. కరోనా పేరిట హక్కులను హరించి నిరసనలు తెలిపే అవకాశం లేకుండా చేసినా ఆన్‌లైన్‌ లోనూ పరిమిత పద్ధతుల లోనూ ఎక్కడికక్కడ శ్రమజీవులు, రైతులు, వివిధ తరగతుల ప్రజలు ఆందోళనలు సాగిస్తూనే వున్నారు. పార్లమెంటు లోనూ నిరసన ప్రతిధ్వనించింది. ఎ.పి లో మతతత్వం రగిలించే కుటిల వ్యూహాలు విఫలమైనాయి. అయితే ఇప్పటికీ ఆయన ఆశించిన సమగ్ర అవగాహన, సమ సమాజ సాధన సుదూరంగానే వున్నాయి. సామ్రాజ్య వాదం కొత్త రూపాల్లో దేశ సార్వభౌమత్వాన్ని, ఆర్థిక స్వాతంత్య్రాన్ని దెబ్బ తీస్తూనే వుంది. ఈ సమయంలో వాటిపై పోరాటానికి మరింతగా యువతను మరల్చడం ఉద్యమాల కర్తవ్యం. అందుకు ఉత్తేజం అందించే భగత్‌సింగ్‌ జీవితం త్యాగం, సాహసం...ఆయన రచనల అధ్యయనం, అన్వయం అందుకు అవగాహన కలిగిస్తాయనడంలో సందేహం లేదు.