నిరవధిక సమ్మెకు వెళతాం మున్సిపల్ కార్మికుల ధర్నాలో కాశీనాధ్ హెచ్చరిక సిఎంఒహెచ్‌కు విపతిపత్రం అందజేత
ప్రజాశక్తి - విజయవాడ : కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పని చేస్తున్న ఆప్కాస్ కార్మికులందరికీ ఆదివారం పుల్ డే సెలవు మంజూరు చేయకపోతే వచ్చే నెల 9 నుంచి నగర వ్యాప్తంగా పని బంద్ చేసి, నిరవధిక సమ్మెలోకి కార్మికులు వెళ్లడం జరుగుతుందని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు దోనేపూడి కాశీనాధ్ తెలిపారు. విఎంసిలోని ఆప్కాస్ కార్మికులందరికీ పుల్‌డే సెలవు మంజూరు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విఎంసి ప్రధాన కార్యాలయం వద్ద ఆప్కాస్ కార్మికులు యూనియన్ ఆధ్వర్యంలో శనివారం పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అధికారులు ఇచ్చిన హామీ మేరకు ఆదివారం పుల్‌డే సెలవు మంజూరు చేయాలని, పని భారం తగ్గించాలని, పర్మినెంట్ చేయాలని కార్మికులు చేసిన నినాదాలు మారుమోగాయి. ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కమిషనర్ తపునున ప్రజారోగ్య విభాగం ముఖ్యఅధికారి (సిఎంఒహెచ్) డాక్టర్ పి రత్నావళికి నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా కాశీనాధ్ మాట్లాడుతూ... కార్మికులు చేసిన అనేక ఆందోళనలు, నిరసనల నేపధ్యంలో ఆప్కాస్ కార్మికులందరికీ పుల్‌డే సెలవు ఇస్తామని స్వయంగా నగర కమిషనర్ ఇచ్చిన హామీని అమలు చేయించుకోవడానికి, మరోసారి కార్మికులు ఆందోళన చేయాల్సి రావడం అత్యంత దారుణమని, కార్మికుల పట్ల అధికార వైసిపి, అధికారులకున్న చిత్తశుద్ది ఏపాటిదో తెలుస్తుందన్నారు. ఇప్పటికయినా పాలకవర్గం, అధికారులు ముందుకు వచ్చి కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఆదివారం నాడు పుల్‌డే సెలవు సత్వరమే మంజూరు చేయకపోతే వచ్చే నెల 9 నుంచి నగర వ్యాప్తంగా పనులను స్తంభింప చేసి, వేలాది మంది కార్మికులతో నిరవధిక సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షుడు ఎస్.జ్యోతిబాస్ ,పార్క్ సెక్షన్ కన్వీనర్ టీ.చిన్నా, నగర ఉపాధ్యక్షురాలు టి.తిరుపతమ్మ, జే. విజయలక్ష్మి, గార్లపాటి లక్ష్మి,టి.బుజ్జి, కొన అప్పారావు,శ్రీను,వెంకట్రావ్, నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి టి.ప్రవీణ్ పాల్గొన్నారు. నాయకులిచ్చిన వినతిపత్రంపై కమిషనర్‌కు తెలియజేసి, సెలవు మంజూరు అయ్యేటట్లుచూస్తానని సిఎంఒహెచ్ డాక్టర్ రత్నావళి హామీనిచ్చారు.










