ప్రజాశక్తి-హెల్త్ యూనివర్శిటీ: వైద్య ఆరోగ్య రంగాన్ని అభివృద్ది చేసి నిరుపేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మెహన్‌రెడ్డి వైద్య రంగానికి వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కార్మికనగర్, గంగిరెద్దులదిబ్బ, ఆటోనగర్ సమీపంలోని ఎపిఐఐసి కాలనీలో ఒక్కొక్కటి కోటి రూపాయల నిధులతో నిర్మించిన అర్భన్ ప్రైమరి హెల్త్ సెంటర్లను మంగళవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం గంగిరెద్దులదిబ్బ అర్భన్ ప్రైమరి హెల్త్ సెంటర్ వద్ద జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 కోట్ల రూపాయల ఖర్చుతో 523 అర్భన్ హెల్త్ సెంటర్లకు నూతన భవనాలను నిర్మిస్తున్నామన్నారు. వీటితో పాటు 1,125 ప్రైమరి హెల్త్ సెంటర్లకు 470 కోట్ల రూపాయలు, సెకండరీ హెల్త్ సెంటర్లకు 1,223 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వం హెల్త్ సెంటర్‌లలో ఆదునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేసి నాణ్యత ప్రమాణాలతో కూడిన 172 రకాల మందులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. హెల్త్ సెంటర్లలో నెలకు కనీసం 10 డెలివరీలు జరిగేలా వైద్య అధికారులు సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యార్థుల సౌకర్యం కోసం 16 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్చ్ దేవినేని అవినాష్, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి, డియంహెచ్ యం సుహాసిని పాల్గొన్నారు.










