వర్గ దోపిడీ లేకపోతే ప్రజలు ఏం సాధించగలరో సోవియట్ యూనియన్ సాధించిన ఘన విజయాలు నిరూపించాయి. సోవియట్ రాజ్యం భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసింది. దాని స్థానంలో పేద రైతులు, వ్యవసాయ కార్మికులు భాగస్వాములుగా ఉండే సహకార వ్యవసాయం, ఉమ్మడి వ్యవసాయం స్థాపించింది. 1965 వరకు సోవియట్ యూనియన్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆర్థిక అభివృద్ధి నమోదు చేసుకుంది. ఇది జపాన్ కంటే ఎక్కువ. కొద్ది సంవత్సరాల్లోనే నిరక్షరాస్యతను రూపుమాపింది. 15 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టింది. విప్లవం పూర్తయిన వెంటనే పౌరులందరికీ ఉచిత ఆరోగ్య పథకాన్ని ప్రారంభించింది. విప్లవం వచ్చిన పదేళ్ల లోపే సంపూర్ణ ఉద్యోగిత సాధించబడింది.
అక్టోబర్ మహా విప్లవం 'ప్రపంచాన్ని కుదిపేసి' వందేళ్లయింది. ప్రపంచ గమనాన్ని మార్చిన ఆ విప్లవం నేటికీ ప్రపంచ కార్మిక వర్గాన్ని ఉత్తేజపరుస్తూనే ఉంది. కార్మిక వర్గంపై నయా ఉదారవాద విధానాల దాడి తీవ్రమైన నేటి దశలో ఆ విప్లవ ప్రాశస్త్యం మరింత పెరిగింది.
ఈ విప్లవం మొదటిసారిగా కార్మికవర్గ నాయకత్వంలో రైతాంగాన్ని ఇతర అనేక తరగతుల శ్రమజీవులను సంఘటితం చేసుకుని, వర్గ దోపిడీ రహిత కొత్త సమాజాన్ని స్థాపించింది. చరిత్రలో మొదటిసారిగా కార్మిక వర్గం, రైతాంగం దోపిడీకి గురవుతున్న తరగతులను కలుపుకుని, దోపిడీ చేస్తున్న పాలక వర్గాన్ని పడగొట్టింది. 'అన్ని అధికారాలు సోవియట్లకే' అనే బోల్షివిక్ పార్టీ పిలుపుతో సోవియట్ కార్మికవర్గం, రైతాంగం, సైనికులు 1917 నవంబర్ 7న (అప్పుడు వారి క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 25న)...ఆ నాటి రష్యా రాజధాని పెట్రోగ్రాడ్‌ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ తరువాత రష్యా లోని ఇతర నగరాలన్నీ ఒక దాని తరువాత ఒకటి, చివరికి రష్యా అంతా కార్మికుల వశమైంది.
వర్గ దోపిడీ లేకపోతే ప్రజలు ఏం సాధించగలరో సోవియట్ యూనియన్ సాధించిన ఘన విజయాలు నిరూపించాయి. సోవియట్ రాజ్యం భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసింది. దాని స్థానంలో పేద రైతులు, వ్యవసాయ కార్మికులు భాగస్వాములుగా ఉండే సహకార వ్యవసాయం, ఉమ్మడి వ్యవసాయం స్థాపించింది. 1965 వరకు సోవియట్ యూనియన్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆర్థిక అభివృద్ధి నమోదు చేసుకుంది. ఇది జపాన్ కంటే ఎక్కువ. కొద్ది సంవత్సరాల్లోనే నిరక్షరాస్యతను రూపుమాపింది. 15 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టింది. విప్లవం పూర్తయిన వెంటనే పౌరులందరికీ ఉచిత ఆరోగ్య పథకాన్ని ప్రారంభించింది. 1936 కల్లా, అంటే విప్లవం వచ్చిన పదేళ్ల లోపే సంపూర్ణ ఉద్యోగిత సాధించబడింది.
శైశవ దశలో ఉన్న సోవియట్ యూనియన్ 1918లో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత వచ్చిన ఇన్‌ఫ్లూయెంజా మహమ్మారి వ్యాప్తిని సమర్ధవంతంగా అరికట్టింది. సోషలిస్టు రాజ్యం పాస్ చేసిన డిక్రీల్లో ఒకటి ఉచిత ఆరోగ్య రక్షణ. ప్రజారోగ్యాన్ని పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్న హామీ. ఈనాడు కోవిడ్‌్ మహమ్మారి దాపురించిన కాలంలో, ప్రజలు పడుతున్న అష్టకష్టాలు, ఉద్యోగాలు ఊడిపోవడం, నిరుద్యోగం పెరగడం, ఇతర అనేక ఆర్థిక సమస్యలతో పోల్చి చూస్తే ఆనాటి శైశవదశలో ఉన్న సోవియట్ యూనియన్ సాధించిన విజయాలు ఎంత ఘనమైనవో అర్ధమవుతుంది.
రష్యన్ విప్లవం విజయవంతం కాగానే అక్కడ మహిళలకి ఓటు హక్కు ఇవ్వబడింది. ఈనాడు ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పు కుంటున్న అనేక దేశాల్లో మహిళలకు ఓటుహక్కు రావడానికి చాలాకాలం పట్టింది. సోవియట్ యూనియన్ పని హక్కును ప్రాథమిక హక్కుగా చేసి, పనిని ప్రతి పౌరునికి గ్యారంటీ చేసింది. మౌలిక సేవల అభివృద్ధి, ఇళ్ళు, రోడ్లు, అడవుల పెంపడం, గ్రామీణ విద్యుదీకరణ మొదలైన వాటిపై శ్రద్ధ పెట్టింది. విద్యుత్, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు కలిగిన ఇళ్లను కార్మికులకు వారి వేతనంలో 4-5 శాతానికి అందుబాటు లోకి తెచ్చింది. రవాణాను అతి తక్కువ ధరకు సమకూర్చింది. కార్మికులందరికీ పెన్షన్ గ్యారంటీ చేశారు. కార్మికుల ఆరోగ్యానికీ, ఉల్లాసానికీ ప్రాధాన్యత ఇవ్వబడింది. కార్మికుల కోసం దేశ వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు, ఆట స్థలాలు, విశ్రాంత విహారాలు నిర్మించబడ్డాయి. ఇటువంటివి ఇదివరకటి రోజుల్లో ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. అన్ని పరిశ్రమల్లో వారంలో 5 రోజుల పని అమలు చేయబడింది. అపాయకరమైన పరిశ్రమల్లో రోజుకి 7 గంటలకు పని పరిమితం చేయబడింది. శ్రామిక మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు ఇవ్వబడ్డాయి. ప్రసూతి ప్రయోజనాలు అందించబడ్డాయి. పని ప్రదేశాల్లో పసిపిల్లల రక్షణ కోసం క్రష్‌లు ఏర్పాటు తప్పనిసరి చేయబడింది.
కార్మిక వర్గ రాజ్యం ఏర్పడి, కార్మిక ప్రయోజనాల కోసం అది చేపడుతున్న చర్యల ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై పడింది. సోషలిస్టు భావాలు వ్యాపించకుండా నిరోధించడానికి కార్మికుల సమస్యలపై అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు దృష్టిపెట్టసాగాయి. అందులో భాగంగానే 1919లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ)ను ఏర్పాటు చేశారు.
అక్టోబర్ విప్లవం, తక్కువ కాలంలో కార్మికుల జీవన స్థితిగతుల్లో అది తీసుకొచ్చిన అద్భుత పురోగతి...మన దేశంతో సహా ప్రపంచం లోని అనేక దేశాలను ఉత్తేజపరిచింది. విప్లవ దృక్పథంతో కార్మిక వర్గ సంఘాలు ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు మొదలయి అవి మొదటిసారిగా 1920లో అఖిల భారత కార్మిక సంఘ కేంద్రం ఏర్పాటుకు దారి తీశాయి. దోపిడీ రహిత సమాజం స్థాపించుకోడానికి వీలవుతుందనే ఆశతో కార్మిక వర్గం బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన స్వతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొంది.
ఆనాడు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో స్వాతంత్య్రం కోసం జరుగుతున్న పోరాటాలకు అక్టోబర్ విప్లవం గొప్ప ఊపునిచ్చింది. భగత్ సింగ్, ఆయన సహచరులతో సహా మన దేశ స్వాతంత్య్ర పోరాట యోధులు విచారణను ఎదుర్కొంటున్న కోర్టు నుండే 'లెనిన్ జయంతి'కి అభినందన సందేశాలు పంపించారు. జాతీయ విముక్తి పోరాటాలకు సోవియట్ యూనియన్ హృదయపూర్వక మద్దతు ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధంలో ఫాసిజాన్ని ఓడించేందుకు, ఫాసిజం కోరల నుండి ప్రపంచాన్ని రక్షించేందుకు రెండు కోట్ల మంది ప్రజల, సైనికుల ప్రాణాలను ఒడ్డిన సోవియట్ విశిష్ట పాత్రను ఎన్నటికీ మరువలేం.
శాస్త్రీయ మార్క్సిస్టు లెనినిస్టు అవగాహన ఆధారంగా దోపిడీ రహిత సమాజాన్ని స్థాపించడానికి అక్టోబర్ విప్లవం విజయ వంతంగా సాగిన మొదటి ప్రయోగం. కార్మిక రాజ్యం సోషలిజం నిర్మాణాన్ని ప్రారంభించక ముందే సామ్రాజ్యవాద దేశాలు దాని పీక నులమసాగాయి. సామ్రాజ్యవాదుల మద్దతుతో పెరిగిన ప్రతీఘాత విప్లవ శక్తులను అణచడానికి సోవియట్ యూనియన్ లోని ఎర్ర సైన్యానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత సోషలిస్టు వ్యవస్థలో దేశం నలుదిశలా అభివృద్ధి చెందింది. త్వరితగతిన అమెరికాతో అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి ఎదిగింది.
అయితే, కార్మిక వర్గంలో సోషలిస్టు చైతన్యం దిగజారడం, సంస్కరణవాద సిద్ధాంతాల ప్రభావం, పరిశ్రమల్లో అధికారుల పెత్తందారీతనం వంటి అనేక కారణాలు సోషలిజం నిర్మాణంలో కార్మిక వర్గ నాయకత్వ పాత్రను బలహీన పరిచాయి. పెరుగుతున్న ప్రజల అవసరాలు, ఆకాంక్షలను రాజ్యం గ్రహించలేక పోయింది. ఫలితంగా అనేక సరుకుల కొరత ఏర్ప డింది. సామ్రాజ్య వాద పాత్ర కూడా తక్కువగా అంచనా వేయబడింది. పెట్టుబడిదారీ సిద్ధాంత వ్యాప్తిని అరికట్టలేదు. ప్రజల్లో పెరుగుతున్న అసంతప్తిని ప్రతీఘాత శక్తులు ఆసరా చేసుకుని సోషలిస్టు వ్యవస్థను నాశనం చేసి, పెట్టుబడిదారీ వ్యవస్థను పునరుద్ధరించాయి. సోషలిస్టు వ్యవస్థను నాశనం చేస్తున్న కొద్దీ కార్మికవర్గ స్థితిగతులు దిగజారాయి. సోషలిస్టు వ్యవస్థలో పొందుతున్న ప్రయోజనాలు తొలగించబడ్డాయి. కార్మికుల స్థితిగతులు నేల చూపులు చూడడం, ఉద్యోగ భద్రత కోల్పోవడం, నిరుద్యోగం పైకి ఎగబాకడం, జీవన ప్రమాణాలు నానాటికీ దిగజారడంతో రష్యన్ ప్రజలు తామేం కోల్పోయామో తెలుసుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో, కార్మిక వర్గంలో...దోపిడీకి లూటీకి వ్యతిరేకత పెరుగుతోంది. ఈనాడు నయా ఉదారవాద విధానాలు రోసిపోయాయి. పెట్టుబడిదారీ వ్యవస్థే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈనాటి దోపిడీ వ్యవస్థకి ప్రత్యామ్నాయాన్ని ప్రజలు వెతుక్కుంటున్నారు.
భారతదేశంలో మనం 75 సంవత్సరాల స్వతంత్ర సంబరాలు జరుపుకోబోతున్నాం. మరోవైపు నయా ఉదారవాద ఎజెండాని ఎంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా అమలు చేయాలనే మొండి వైఖరితో మోడీ ప్రభుత్వం వుంది. సన్నకారు రైతుల వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే 3 బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు ఏడాది కాలంగా పోరాడుతున్నారు. తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ-సంఘం నిర్మించుకునే హక్కు, సంఘటితంగా జీతభత్యాలు, పనిని గురించి బేరసారాలు చేసుకునే హక్కు, సామూహిక కార్యక్రమాలు చేపట్టే హక్కు - లేకుండా చేసి, తమను దాదాపు బానిసలుగా చేసే లేబర్ కోడ్‌లను కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానాలన్నీ జాతి సంపదను ఆశ్రిత కార్పొరేట్లు, లూటీలు, దోపిడీలు చేసుకోడానికి అనువైన విధానాలే. అయితే, ఈ విధానాలను అమలు చేస్తున్నది ఒక్క బిజెపి ప్రభుత్వమే కాదు. బిజెపి, కాంగ్రెస్ లేదా సంకీర్ణ ప్రభుత్వమైనా అవన్నీ పాలకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవే - అమలు చేస్తున్నవి అవే విధానాలు.
దివాళా తీసిన పెట్టుబడిదారీ విధానాలకు ప్రత్యామ్నాయం అక్టోబర్ మహా విప్లవం చూపగలిగింది. అది సోషలిజమే ప్రత్యామ్నాయమని తెలియజేస్తోంది. అక్టోబర్ విప్లవం 104వ వార్షికోత్సవ సందర్భం...అసంఖ్యాక కార్మికుల్లో ఈ చైతన్యాన్ని కలిగించాల్సిన సందర్భం. తమను వేధిస్తున్న దైనందిన సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తూనే, అన్ని రకాల దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్న స్పృహ కల్పించాల్సిన సందర్భం.
/ వ్యాసకర్త సిఐటియు అధ్యక్షురాలు /
కె. హేమలత











