'స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా 'దేశద్రోహం' కేసులా?' అని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించినా పట్టించుకోని మన నేతలు తమ ఐడియాలజీకి వ్యతిరేకంగా గట్టిగా ఎవరు మాట్లాడినా కేసులు బనాయిస్తున్నారు. దేశంలో బలహీన వర్గాలకు, మైనార్టీలకు వాక్ స్వాతంత్య్రం కరువైంది. వారు తినే తిండి, వేసుకునే దుస్తులు, చివరికి మాట్లాడే మాటలు కూడా నియంత్రించబడుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణే జమ్మూకాశ్మీర్ విద్యార్థుల అక్రమ అరెస్టులు. అరెస్టు చేసిన వారిని ఏ జైలుకు తీసుకెళ్లారో ఇంతవరకు బంధువులకు సమాచారం లేదు. తమవారి ఆచూకీ చెప్పమని, తమ మీద కనికరం చూపమని వారి కుటుంబాలు అధికారులను అభ్యర్థిస్తున్నాయి. ఈ ఘటన గురించి కలలోనైనా ఊహించని పేద కుటుంబాలు ఆ ముగ్గురు విద్యార్థులవి. 'నా కొడుకు తెలిసో తెలియకో తప్పు చేశాడు. ఆ తప్పును క్షమించమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మా కుటుంబానికి ఏకైక ఆధారం అతడే. దశాబ్దకాలం క్రితమే నా భర్త చనిపోయాడు. అర్షద్‌తో పాటు ఇద్దరు కూతుళ్ల భారం నా పై ఉంది' అంటుంది అరెస్టయిన అర్షద్ యూసఫ్ పౌల్ తల్లి హనీఫా.
సెంట్రల్ కాశ్మీర్ హర్దిఛెకి ఛక్‌పోరా గ్రామంలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు అర్షద్. అతనిపై సెక్షన్ 153ఎ (మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం), 505(1) (బి) (ప్రజల్లో భయాన్ని కలిగించే ఉద్దేశంతో ఏదైనా వర్గానికి వ్యతిరేకంగా లేదా ప్రజల ప్రశాంతతకు వ్యతిరేకంగా నేరం చేసేందుకు ప్రేరేపించడం)తో పాటు సమాచార సాంకేతిక చట్టం 2008లోని 66ఎఫ్ (సైబర్ ఉగ్రవాదం) నేరాలు మోపబడ్డాయి. అర్షద్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు ఇన్యాత్ అల్తాఫ్ షేక్, షోకత్ అహ్మద్ గనై అరెస్టయిన వారిలో ఉన్నారు. గతవారం ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ముగ్గురిని అరెస్టు చేశారు.
అరెస్టు ఇలా జరిగింది...
ముగ్గురు విద్యార్థులపై స్థానిక బిజెపి నాయకులు అభియోగం మోపారు. అక్టోబరు 24 ఆదివారం ఇండియా పాకిస్తాన్‌కు జరిగిన టి 20 క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. రాజా బల్వంత్ సింగ్ మేనేజ్‌మెంట్ టెక్నికల్ క్యాంపస్ (ఆర్.బి.ఎస్.ఎం.టి.సి)లో మ్యాచ్ వీక్షిస్తున్న ఈ ముగ్గురూ బిగ్గరగా పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారన్నది వారి అభియోగం. అయితే 'అనుమతి లేకుండా మా క్యాంపస్ లోకి ప్రవేశించినందుకు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు, కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినందుకు బిజెపి కార్యకర్తలపై కేసులు బనాయించాల'ని ఆర్.బి.ఎస్.ఎం.టి.సి అకడెమిక్స్ డైరెక్టర్ బి.ఎస్ కుశవహా ఆరోపణను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా 'ముగ్గురు విద్యార్థులపై కళాశాల యాజమాన్యం ఇచ్చిన 'క్లీన్ చిట్' పత్రాన్ని కూడా యు.పి పోలీసులు లెక్కచేయకుండా పేద విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో 'అభ్యంతరకర' వ్యాఖ్యలు చేసిన ఈ ముగ్గురు విద్యార్థులపై 'దేశద్రోహం' కేసులు పెట్టాలని యు.పి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. ఈ విషయం తెలిసిన విద్యార్థుల కుటుంబాలు చాలా కలవరపడుతున్నాయి. ఇప్పటివరకు అతని ఆచూకీ మాకు తెలియలేదు. ఫేస్‌బుక్ ద్వారా అరెస్టు వార్త తెలిసింది. అప్పటినుంచి ఫోను చేస్తున్నా అది స్విచ్చాఫ్ వస్తోంది' అంటూ ఆందోళనపడుతున్నాడు అర్షద్ మామ హిలాల్ అహ్మద్. అతనో దినసరి కూలీ.
ముగ్గురు విద్యార్థులూ వెనుకబడిన కాశ్మీరీ కుటుంబాలకు చెందినవారు. కాంగ్రెస్ నేతృత్వం లోని యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ప్రత్యేక స్కాలర్‌షిప్ పథకం ద్వారా విద్యాభ్యాసం చేస్తున్నారు. తండ్రిని కోల్పోయిన అర్షద్ కుటుంబంలో మహిళలు, పెద్దవారైన ఇద్దరు పురుషులను మినహాయిస్తే మిగిలిన ఆరుగురు కుటుంబ సభ్యులు యువతీ యువకులే. చదువుకునే అవకాశం ఉన్న వీరంతా పేదరికం కారణంగా అర్థంతరంగా చదువు మానేశారు. స్కాలర్‌షిప్ ద్వారా అర్షద్ ఒక్కడికే డిగ్రీ చదివే అవకాశం వచ్చిందని మొదట ఆ కుటుంబం ఎంతో సంతోషపడింది. అర్షద్‌ను కుటుంబానికి రోల్ మోడల్‌గా భావించేవారు. 'ఇప్పుడు అతని భవితవ్యం ప్రశ్నార్థకమైంది. ఏమవుతోందని భయంగా ఉంది' అంటారు హిలాల్.
ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత విద్యార్థులను కోర్టుకు హాజరుపరిచినప్పుడు 14 రోజుల రిమాండు విధించమని కోర్టు ఆదేశించింది. ఆ సమయంలో 'పాకిస్తాన్ ముర్దాబాద్', 'భారత్ మాతాకీ జై' అన్న నినాదాలతో కొంతమంది, ముగ్గురు విద్యార్థులపై భౌతికదాడికి తెగబడ్డారు. ఆ వీడియోలు మీడియాలో ప్రసారమయ్యాయి.
వాటిపై స్పందిస్తూ 'ఆ వీడియోలను మేము కూడా చూశాం. కాని ఏం చేయలేకపోయాం. మేము చాలా దూరంలో ఉన్నాం. వారేమీ నేరం చేయలేదు. అయినా ఎందుకు అరెస్టు చేశారో మాకు అర్ధం కావడం లేదు. చిన్న పిల్లలు...కాని పెద్ద నేరస్తుల్లాగా హింసిస్తున్నారు' అంటారు హిలాల్.
ముగ్గురు విద్యార్థుల్లో ఇన్యాత్ తరపున అతని స్నేహితుడు ఆగ్రాకు చేరుకున్నాడు. లాయర్‌ను కలసి ఇన్యాత్‌ను విడిపిద్దామని అతని ప్రయత్నం. అయితే ఆగ్రా బార్ అసోసియేషన్, విద్యార్థుల తరపున కేసు వాదించకూడదని నిర్ణయించినట్లు ఓ న్యాయవాది చెప్పడంతో అతను అయోమయంలో పడిపోయాడు. 'ఇంతవరకు నేను ఇన్యాత్‌ను కలవలేదు. ఏ జైలులో పెట్టారో కూడా సమాచారం లేదు. పోలీసు స్టేషనుకు వెళ్లాలంటే భయంగా ఉంది' అంటాడు ఆయన.
యు.పి ముఖ్యమంత్రి చేసిన ట్వీట్‌పై ప్రతిస్పందించిన సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా దాన్ని 'న్యాయపరమైన అంశాలకు వ్యతిరేక ట్వీట్'గా అభివర్ణించారు. 'ఏ విషయంలోనైనా మంచి, చెడులు ఉంటాయి. అంతమాత్రాన వాటిని నేరపూరితమైనవిగా, చట్టవిరుద్ధమైనవిగా పరిగణిం చలేం. అలాగే న్యాయపరమైన చర్యలన్నీ మంచివి, నిజాయతీతో కూడుకు న్నవై ఉండాలన్న నిబంధన లేదు. ఎందుకంటే మేము కేవలం న్యాయపరంగా పరిపాలించబడతాం' అని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. అలాగే జమ్మూ, పూంచ్ జిల్లాలో ఆరోగ్య కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి తన వాట్సాప్ స్టేటస్‌లో 'అభ్యంతర వ్యాఖ్యలు' షేర్ చేసిందన్న నెపంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ అభియోగంపైనే శ్రీనగర్ లోని రెండు వైద్య కళాశాలల విద్యార్థులు, బోధనేతర సిబ్బందిపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం బనాయించారు. ఈ మొత్తం అంశంలో టీ 20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ విజయం అంశం అలా ఉంచితే... ఈ విషయంపై కాశ్మీర్ ప్రజల స్పందనల్లో జమ్మూకాశ్మీర్ బిజెపి పాలనపై ప్రతి చర్యగా చూడాలి. ఈ అంశంలో మెజార్టీ కాశ్మీర్ ప్రజల అభీóష్టాలను తోసిరాజని బలవంతంగా 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన బిజెపి ప్రభుత్వం, ఒక్క కాశ్మీర్ లోనే కాదు. మొత్తం దేశంలోనే దుర్మార్గ పాలన సాగిస్తోందనడానికి నిదర్శనం.
/ ఫీచర్స్ అండ్ పాలిటిక్స్ /










