Apr 18,2023 21:37

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా ఆశా కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు దుగ్గిరాల అన్నపూర్ణమ్మ

నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలి
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని తూర్పు చెన్నంపల్లి గ్రామంలో ఇటీవల ఆశా వర్కర్‌పై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడు తిపిరబోయిన లక్ష్మీనారాయణను తక్షణమే అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచాలని జిల్లా సిఐటియు మహిళా నాయకురాలు, జిల్లా ఆశా కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు దుగ్గిరాల అన్నపూర్ణమ్మ మంగళవారం స్పష్టం చేశారు. తొలుత డాక్టర్‌ను కలిసి సమస్యను వివరిస్తూ నిందితుడిని శిక్షించేంత వరకు ఆశ కార్యకర్తలు హాస్పిటల్‌కు వస్తారు కానీ, అరెస్టు చేయనంత వరకు విధులకు హాజరుకారని వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిత్యం రేయనక పగలనక విధులు నిర్వహించే ఆశా కార్యకర్తలకు రక్షణ కరువైందన్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేవలం అంబులెన్స్‌ ఆలస్యంగా రావడంతోనే ప్రయివేటు కారులో గర్భిణీని హాస్పిటల్‌కు తీసుకెళ్లారన్నారు. తిరుగు ప్రయాణంలో బాధితురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలిపారు. మండలంలోని అంబులెన్సులు కూడా సరైన సమయంలో సక్రమంగా పనిచేయాలన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు తాము ఉద్యమిస్తూనే ఉంటామన్నారు.
అనంతరం ఎస్‌ఐ విజరు శ్రీనివాసరావు కలిసి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు న్యాయం చేస్తానని, ఇప్పటికే ఎలాంటి ప్రలోభాలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నానని ఎస్‌ఐ హామీనిచ్చారు. కార్యక్రమంలో నెల్లూరు అర్బన్‌ ఆశ వర్కర్‌ కార్యదర్శి పి.భాగ్యలేక, వింజమూరు ఆశ వర్కర్ల యూనియన్‌ లీడర్‌ పి.అరుణ, ఆశ కార్యకర్తల కోశాధికారి ఎస్‌.మధుసూదన్‌, మండల సిఐటియు ప్రధాన కార్యదర్శి మట్టి హరినారాయణ, ఎపి రజిక ఉత్పత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి రేకలగుంట అంకయ్య, జిల్లా కమిటీ సభ్యులు మన్నూరు శివ, అంకయ్య, జిల్లా సభ్యుడు చిలకపాటి సుబ్బారావు, మండల కమిటీ సభ్యులు వెంకటాద్రి, మండల కార్యదర్శి చెరువుపల్లి శేషయ్య, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.