నికిత సూసైడ్ కారణాలను నిశితంగా పరిశీలించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : అంగన్‌వాడీ కార్యకర్త నికిత సూసైడ్‌పై విచారణ చేపట్టి నిశితంగా వాటి కారణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అజరుకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సీతారాంపురం మండలం సీతారాంపురం హరిజనవాడ అంగన్‌వాడీ కార్యకర్త పి.నీకిత వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటన విధితమేనని, అంగన్‌వాడీ నాయకులు కార్యకర్తలతో ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పరామర్శించామన్నారు. నికిత యాక్టింగ్ సూపర్‌వైజర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పథకం ప్రకారం ఆమెపై దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా నాయకత్వానికి స్థానిక నాయకులకు వివరించిందని సిఐటియు అండగా ఉంటుందని హామీ ఇచ్చామని, ఇంతలో ఇలా జరగడం బాధాకరమన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సంబంధిత శాఖ ఉన్నత అధికారులు రికార్డులను పరిశీలించి తేడా ఉంటే నోటీసు పంపించి శాఖా పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తోటి సూపర్వైజర్‌పై మరో ఇద్దరు సూపర్వైజర్‌లను తనిఖీకి పంపించడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. అనంతరం మరోమారు విలేకరులతో కలిసి వచ్చి తనిఖీ చేయడం దారుణమని ఆయన నికిత అవినీతికి పాల్పడుతుందని నిరూపించగలిగే సాక్షాలు సంపాదించారని ఆయన సిఐటియు తరఫున ప్రశ్నిస్తున్నానన్నారు. దురదృష్టవశాత్తు ఆమె మరణించి ఉంటే కుటుంబ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. అధికారుల వేధింపుల ఎక్కువ అయ్యాయని జర్నలిస్టుల సోదరులకు ఒక వార్త ప్రచురించేటప్పుడు ఆధారాలతో ప్రచురించాలని ఆయన కోరారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారని, మెరుగైన వైద్యం కోసం అవసరమైతే నెల్లూరుకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగు న్యాయం చేయకపోతే ఈ అటెండ్ సూసైడ్‌ను సుమోటోగా తీసుకొని ప్రయివేట్ కేసు వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం స్థానిక సిడిపిఒ కార్యాలయంలో సిడిపిఒను కలిసి నికితపై జరిగిన వేధింపులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిఐటియు తరఫున కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా సిఐటియు సభ్యులు గడ్డం నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు కాకు వెంకటయ్య, కోడె రమణయ్య అంగన్‌వాడీ వర్కర్ అండ్ వెల్ఫేర్ యూనియన్ నాయకులు మహాలక్ష్మి, రజియా, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.










