Jul 20,2021 21:47

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మధ్య తరగతి వారికిచ్చే జగనన్న ఇళ్ల కాలనీల్లో జర్నలిస్టులకు ఇళ్లు మంజూరు చేస్తామని, జులై ఆఖరులోగా అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనరు టి.విజరుకుమార్‌ రెడ్డి హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌) నేతలు కమిషనరు కార్యాలయంలో మంగళవారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అక్రిడిటేషన్‌ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో ఎపిడబ్ల్యుజెఫ్‌కు ప్రాతినిథ్యం కల్పించాలని నేతలు కోరారు. చిన్న, మధ్య తరహా పత్రికలకు జిఎస్‌టి మినహాయించాలని, వెంటనే బస్సు పాస్‌లను జారీ చేయాలని, హెల్త్‌ బీమా, ప్రమాద బీమాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని, ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. వీటిపై కమిషనర్‌ విజరుకుమార్‌ రెడ్డి స్పందిస్తూ హెల్త్‌ కార్డులకు వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, వెటరన్‌ జర్నలిస్టులకు ఇబ్బంది లేకుండా అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని తమిళ జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు సాయం అందించేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు అమరయ్య, ఉమామహేశ్వరరావు, గోరంట్లప్ప, కె.కలిమిశ్రీ, ఎం.బి.నాథన్‌, శేఖర్‌, ఉమామహేశ్వరి, ఉదరు శంకర్‌, టివి రమణ, పద్మావతి పాల్గన్నారు.