Mar 01,2023 22:34

కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం

ప్రజాశక్తి-కదిరి అర్బన్‌ : రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన కదిరి ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 15 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది. ఉత్సవాల సందర్భంగా ఖాద్రీశుడు రోజుకో వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 2వ తేదీ అంకురార్పణ, 3న కళ్యాణోత్సవం, 4న హంస వాహనం, 5న సింహావాహనం, 6న హనుమంత వాహనం, 7న బ్రహ్మ గరుడసేవ, 8న శేషవాహనం, 9న సూర్యచంద్ర ప్రభ, 10న మోహిని ఉత్సవం, 11న ప్రజాగరుడసేవ 12న గజవాహనం, 13న ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోరథోత్సవం(తేరు), 14న అలకోత్సవం, 15న తీర్థవాది, 16న పుష్పయాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఖాద్రీ నుంచి కదిరిగా...
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి కదిరి ప్రాంతంలో పాదం మోపినందున ఖాద్రీ అన్న పేరు వచ్చిందని చరత్రకారులు చెబుతుంటారు. కాలక్రమంలో ఖాద్రీ కాస్త కదిరిగా మారిందని పెద్దలు చెబుతుంటారు. కదిరి ఆలయం భక్తులు, పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక శిల్పకళావైభవంతో నిర్మించారు. ఖాద్రీ బ్రహ్మోత్సవాల్లో దవనం, మిరియాలు ప్రత్యేకతగా చెబుతారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే వారు స్వామిపై దవనం మిరియాలు చల్లుతారు. ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పాలబావి ఉంది. దేవస్థానానికి పడమరభాగాన బృగుతీర్థం కోనేరు ఉంది. వీటిని కూడా బ్రహ్మోత్సవాలకు వచ్చే వారు సందర్శిస్తుంటారు. కదిరి ఆలయంలో శుభ ముహూర్థాల్లో నిత్యం వివాహాలు జరుగుతుంటాయి. అయితే బ్రహ్మోత్సవాల సమయంలో ముహూర్థాలు ఉన్నా అక్కడ వివాహాలు జరపకుండా ఉండడం ఆనవాయితీగా వస్తోంది.
అందరి సహకారం అవసరం
గురువారం నుంచి జరుగునున్న ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేందుకు అందరి సహకారం అవసరం అని పాలకమండలి ఛైర్మన్‌ గోపాలకష్ణ తెలిపారు. ఉత్సవాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాం. మౌలిక వసతులతో పాటు, పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు.
గోపాలకష్ణ,
ఆలయ పాలకమండలి ఛైర్మన్‌
అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నాం..
ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించామని ఈవో పట్టెం గురుప్రసాద్‌ తెలిపారు. ఇప్పటికే స్వాగత తోరణాలు, ఇతర పనులను పూర్తి చేశామన్నారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ దీపాలంకరణ చేశామన్నారు. 3వ తేదీ జరగనున్న స్వామివారి కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
పట్టెం గురుప్రసాద్‌,
ఆలయ ఈవో