- ఉత్సాహంగా 'యువ తరంగం' నాటక పోటీలు
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్
జాషువా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నుండి మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమైన యువనాటిక పోటీలు బుధవారమూ కొనసాగాయి. నవచైతన్య నాటక సమాజం విశాఖపట్నం వారిచే ఇంతింతై అనే నాటిక, జాబిల్లి కల్చరల్ సొసైటీ నిజామాబాద్ వారిచే అసురవేదం అనే నాటికలను ప్రదర్శించారు. సుమధుర కళానికేతన్ బాధ్యులు సామంతపు నరసరాజు మాట్లాడుతూ నగరంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతను నాటక రంగం వైపు మళ్లించాలనే మంచి సదుద్దేశంతో ఇటువంటి నాటక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జాషువా సాంస్కృతిక వేదిక, సుమధుర కళానికేతన్, ఆంధ్ర నాటక కళాసమితి, సిద్ధార్థ కళాపీఠం కలిసి యువతరాన్ని నాటక రంగంలో ప్రత్యేకంగా ప్రోత్సహించడం భావితరాలకు ఇది ఒక దిశా నిర్ధేశంగా ఉంటుందన్నారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ ఇప్పటికీ నాటికలకు, నాటకాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలోనే నాటక రంగం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. తెలంగాణా సాయుధ పోరాటంలో మా భూమి అనే నాటికను చూసే అనేక మంది పోరాటాలకు వచ్చే వారంటే అతిశయోక్తి కాదన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాటక రంగంలో మార్పులు చేసుకుంటూనే యువకులకు దీన్ని నేర్పాలన్నారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను నాటికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం నేడు ఉందన్నారు. మహిళా వాసవ్య మండలి బాధ్యులు జి.రష్మి మాట్లాడుతూ కళల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జాషువా సాంస్కృతిక వేదిక నాయకులు పర్చూరి అజరు, గుండు నారాయణ, కొప్పుల అశోక్ పాల్గొన్నారు. అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కొండలరావు కళాకారులకు సర్టిఫికెట్‌లను, బహుమతులను అందజేశారు.










