ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : తెలుగు రాష్ట్రాల స్థాయి కాలేజి, యూనివర్శిటీ విద్యార్థుల నాటిక పోటీలు స్థానిక చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సుమధుర కళానికేతన్, జాషువా సాంస్కృతిక వేదిక, ఆంథ్రనాటక కళాసమితి, సిద్ధార్ధ కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో 26, 27, 28 తేదీలలో తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన 7 నాటికలను ప్రదర్శిస్తున్నారు. మంగళవారం సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన 'ఇంకానా' అనే నాటిక ప్రేక్షకులను కట్టిపడేసింది. సమాజంలో మహిళల సమస్యలపై చాలా అర్థవంతంగా ఈ నాటికను ప్రదర్శించారు. 'దంతవేదాంతం' అనే నాటికను విశాఖపట్నం వి.ఎస్.కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు, 'ఊసరవెల్లి' అనే నాటికను హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ప్రముఖ నాటక ప్రవక్త, సినీనటులు వై.ఎస్.కృష్ణేశ్వరరావు మాట్లాడుతూ మొదటి ప్రయత్నంతోనే యువకులలో నాటికల పట్ల ఉన్న జిజ్ఞాసను వెలికితీయడానికి జాషువా సాంస్కృతిక వేదికచేసిన ప్రయత్నాన్ని అభినందించారు. నాటకం సామాజాన్ని అధిక్షేపిస్తుంది, ప్రశ్నిస్తుంది, లాలిస్తుంది, బుజ్జగిస్తుంది, శాసిస్తుంది అన్నారు. అందుకనే నాటకం ఈ సమాజంలో చాలా విలువైందన్నారు. నాటకంలో కవి ఏమిచూస్తే ప్రజలు అదిచూస్తారని అన్నారు. అందువల్ల కవులు సమాజం అభివృద్దికోసం చూస్తున్నారా ? లేదా సమాజ తిరోగమనంకోసం చూస్తున్నారా అనేది ముఖ్యమన్నారు. సమాజాన్ని కవులు ఎలా దర్శిస్తారు, ఏ కోణంనుండి దర్శిస్తారనే అంశం ఆధారంగా నాటకం విలువ ఉంటుందన్నారు. జాషువాలాంటి కవులు అంటరానితనానికి వ్యతిరేకంగా, పేదల సమస్యలకోసం రచనలు సాగించి నందునే వర్తమాన సమాజానికి అతనొక దార్శనికుడ య్యాడని గుర్తుచేశారు. అలాంటి రచయితలు, నాటికలు ఈ నాటి యువకులనుండి రావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో నన్నపునేని నాగేశ్వరరావు, డాక్టర్ చదలవాడ నాగేశ్వర రావు, డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య, చెన్నుపాటి వజీర్ తదితరులు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు.










