ప్రజాశక్తి - గంపలగూడెం: 'నేను ప్రభుత్వ పక్కా గృహం కోరకుండానే నాకు గృహం మంజూరయ్యింది. నాకు తెలియకుండానే దాని ద్వారా 10 కట్టలు సిమెంట్ కూడా తీసుకున్నానంట' అంటూ ఓ మహిళ వాపోతోంది. వివరాలు చూస్తే... గంపలగూడెం గ్రామానికి చెందిన రోశమ్మకు 2005-2006 సంవత్సరంలోనే పక్కా గృహం మంజూరైందని, అందుకు గాను ఆమెకు 10 కట్టలు సిమెంటు కూడా అందిందని దానికి సంబంధించిన ఐడి 060811206 ష10245గా, గృహ నిర్మాణ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే ఆ విషయం విన్న రోశమ్మ అవాక్కయ్యింది. అసలు తాను పక్కా గృహం అడగలేదని, ఎలాంటి సిమెంట్ తీసుకోలేదని చెబుతుంది. ఇదే విషయం గృహ నిర్మాణ శాఖాధికారులకు తెలియజేసింది. ఇటీవల తన భర్త మృతిచెందాడని తన ఇద్దరు పిల్లలతో కూలి చేసుకుంటూ జీవిస్తున్నానని రోశమ్మ చెబుతోంది. ఈ నేపథ్యంలో గృహం కోసం అధికారులను కలిసానని చెప్పింది. ఇప్పుడు అది మంజూరైనట్లు నగదు, మెటీరియల్ కూడా తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారని వాపోతోంది. సిమెంట్ కట్టలు తీసుకున్నట్లు ఉన్న సొమ్మును చెల్లిస్తానని ఇల్లు మంజూరయ్యేలా చూడాలని అధికారులను కోరింది. అది తమ చేతుల్లో లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సంబంధిత అధికారుల నుండి ఉత్తర్వులు వస్తేనే తప్ప ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఈ విషయమై ఆ శాఖ డిఇ విజయ భాస్కర్ రాజును ప్రజాశక్తి వివరణ కోరగా, సదరు విషయాలను ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా తెలియజేస్తానని, ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వస్తే నూతనంగా గహాలు మంజూరు చేయించే కార్యక్రమం చేపడతామని తెలిపారు.










