ప్యోంగ్యాంగ్ : కేవలం తిండి కోసం ఎవరూ వారి లక్ష్యాలను వదలుకోరని, దక్షిణకొరియాది చెత్త ఆఫర్ అని ఉత్తర కొరియా అధ్యక్షుని సోదరి కిమ్ యో జోంగ్ వ్యాఖ్యానించారు. అసంబద్ధతకు నిలువెత్తు నిదర్శనం వారి ఆఫర్ అని కిమ్ యో జోంగ్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. తమకు ఆ ప్లాన్ ఏమిటో తెలియదని.. అసలు అటువంటి వాటితో డీల్ ఎప్పుడూ చేయమని తేల్చి చెప్పారు. అలాగే ఆయనవి అమాయక చర్యలని.. పిల్లచేష్టలతో పోలుస్తూ.. నోరుమూసుకోవాలని హెచ్చరించారు. కిమ్ యో జోంగ్ వ్యాఖ్యలపై దక్షిణికొరియా అధ్యక్ష కార్యాలయం స్పందించింది. ఆమె వ్యాఖ్యలు విచారకరమని పేర్కొంది. అయినా కానీ.. తమ ఆఫర్ ఇప్పటికీ అందుబాటులో ఉందని తెలిపింది. బుధవారంతో దక్షిణ కొరియా అధ్యక్షునిగా యూన్ సుక్ యేల్ బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తికావడంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా యూన్ మాట్లాడుతూ.. దశల వారీగా ఉత్తరకొరియాకు ఆర్థిక సాయం చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. అయితే అణ్వాయుధాలను వదులుకోవాలని షరతు విధించిన సంగతి తెలిసిందే.










