Jul 20,2021 15:40

న్యూఢిల్లీ : ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఎంతో కాలంగా నిందలు వేశారని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్లు కనపడటం లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని, దీనిపై ఇప్పుడేమంటారని వైసిపి నేతలను ఆ పార్టీ రెబల్‌ ఎంపి రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి నేతలు అబద్ధాలను ప్రచారం చేశారని, దీని వల్ల 150 మందికిపైగా రైతులు మృతిచెందారని ఆరోపించారు. వారి చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించి, వారి కుటుంబాలను సిఎం జగన్‌ ఆదుకోవాలని కోరారు. కాగా, విశాఖలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, అయితే అక్కడ విచారణ జరిపించలేదని ఆరోపించారు. దసపల్లా హోటల్‌ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయో తెలపాలని, నిజాయితీగల అధికారితో ఉత్తరాంధ్రలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.ఉత్తరాంధ్రకు సీమ నుంచి తరలి వచ్చిన వారు అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదా అంశంపై సిఎం ఆదేశిస్తే ఎంపీలందరం రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. పార్లమెంట్‌లో తొలిసారి వైసిపి ఎంపిలు ప్లకార్డులు పట్టుకొని గొంతెత్తారని అన్నారు. బెయిల్‌ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించడం రాజద్రోహం ఎలా అవుతుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.