- చిత్తూరులో పేరుకుపోయిన నిల్వలు
- కల్తీ సారా తయారు చేస్తారని ఎస్‌ఇబి ఆంక్షలు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి - 'తప్పు ఒకరు చేస్తే శిక్ష వేరొకడికి అన్నట్లు.. సారా తయారు చేసేవారిని వదిలి.. బెల్లం తయారు చేసేవారిని శిక్షిస్తున్నారు. కల్తీ సారా తయారు చేస్తారనే నెపంతో బెల్లం వ్యాపారంపై మన సర్కారు ఆంక్షలు విధించిన విషయం విదితమే. దీంతో చిత్తూరు జిల్లాలోని మండీలన్నీ మూతబడ్డాయి.ఎప్పుడూ రద్దీగా ఉండే బెల్లం మార్కెట్ నిశ్శబ్దంగా దర్శమనమిస్తోంది. ఒకరిద్దరు మండీల యజమానులు కనిపిస్తున్నా దీనవదనాలతో నిశ్రేష్టులై పోయారు. వ్యాపారాలు లేక.. ఒక వేళ అమ్మినా పోలీసులు వచ్చి ఎక్కడ జైలుకు పంపుతారో అనే భయంతో ఉన్న సరుకును గోతాల్లో మూటలు కట్టి నిలువచేశారు. వ్యాపారాలు లేకపోవడంతో హమాలీల పరిస్థితి దయనీయంగా మారింది.
చిత్తూరు జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాల్లో చెరకు పంట సాగవుతోంది. జిల్లాలోని ఆరు చెక్కర పరిశ్రమలు ఉండగా..ఐదు మూతపడ్డాయి. దీంతో ఎక్కువ మంది రైతులు బెల్లం తయారీ వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు రెండు లక్షల టన్నుల బెల్లం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడి నుంచి మన రాష్ట్రంలోనే అన్ని జిల్లాలకు, తెలంగాణ, మహరాష్ట్ర, అస్సాం, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. కేరళలలోని అయ్యప్పస్వామి ఆలయంలోని ప్రసాదాల తయారీకి ఈ బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
బెల్లంపై ప్రభుత్వంపై ఆంక్షలు
సారా తయారీకి బెల్లం ఉపయోగిస్తున్నారనే సాకు చూపి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జిల్లాలోని దాదాపు 400 మండీల్లో ప్రతి షాపునకూ మే 6న స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా జియుఆర్ ఆర్డర్ 1968, 1994, సెక్షన్ 2,3,4,5 ప్రకారం సంబంధిత అధికారి నుంచి లైసెన్సు పొందిన డీలర్స్ మాత్రమే బెల్లం/ నల్ల బెల్లాన్ని విక్రయించేందుకు అర్హులని పేర్కొంది. దీన్ని ఆహార పదార్థాల తయారీకి, పశువుల దాణాకు, ఔషదాల తయారికీ వంటి అనుమతి ఉన్న ఇతర పారిశ్రామిక అవసరాలకు మాత్రమే విక్రయించాలని పేర్కొంది. ఇందులో భాగంగా ప్రతి నెలా నాలుగో తేదీ లోపల మండీల లావాదేవీలు ఎస్‌ఇబికి సమర్పించాలి అని నోటీసు జారీ చేసింది. దీన్ని మండీల యజమానులు తీసుకోలేదు. అధికారులు నోటీసును ఆయా షాపులకు అంటించారు. దీంతో వ్యాపారస్తులు బెల్లం క్రయ, విక్రయాలను నిలిపివేశారు.
సారా తయారు చేసేవారిని పట్టుకోవాలి

సారా తయారు చేసే వారికి బెల్లం అమ్మడం లేదు. కేవలం లైసెన్సు కలిగిన ట్రేడర్లుకు మాత్రమే అమ్ముతున్నాం. మేము మా వ్యాపార లావాదేవీలన్నీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి ఇస్తున్నాం. ఇప్పుడు ఎస్‌ఇబి అధికారులు వచ్చి తమకు ప్రతి నెలా రిటర్న్స్ ఇవ్వాలని చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం. పోలీసులు సారా తయారు చేసేవారిని, అమ్మేవారిని పట్టుకొని శిక్షించాలి.
చంద్రశేఖర్, బెల్లం ఎక్స్‌పోర్టు అసోసియేషన్ ఉపాధ్యక్షులు
బెల్లం పాడైపోతుంది

పదిరోజులుగా బెల్లం మండీలన్నీ మూసివేశారు. దాదాపు రెండున్నర టన్నుల బెల్లం ఇంట్లో ఉండిపోయింది. ఎక్కువరోజులు నిల్వ చేస్తే పాడైపోతుంది. సంవత్సరం రోజులు కష్టపడి సాగు చేస్తే మార్కెట్లో సరుకు అమ్ముకోవడానికి వీల్లేకుండా పోతుంది.
రైతు బాలాజీ,ఎస్‌ఆర్‌పురం మండలం










