Jan 17,2022 08:04
  • అందుబాటులోకి రాని కోవిడ్‌ కేర్‌ సెంటర్లు

ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు, విశాఖ జిల్లాల్లో రోజుకు వెయ్యి చొప్పున పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. రెండో వేవ్‌ సమయంలో రోగులకు వైద్య సేవలందించిన కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఈసారి ఇంకా అందుబాటులోకి రాలేదు. అదనపు బెడ్లు, ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినా పూర్తిస్థాయిలో పనులు పూర్తికాలేదు. ముప్పు ముంచుకొస్తున్న వేళ యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసి వాటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
   శ్రీకాకుళం జిల్లాలో మొదటి విడతగా 16 ఆసుపత్రులను ఎంపిక చేసినా ఇంతవరకు ఎక్కడా ఏర్పాట్లు పూర్తి చేయలేదు. నెల్లూరు జిల్లాలో 39 కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. కడప జిల్లాలో గతంలో 22 కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయగా ప్రస్తుతం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యోగివేమన, అనంతసముద్రం ఉద్యాన యూనివర్సిటీలు, ప్రొద్దుటూరు వెటర్నీరీ కళాశాల, రాయచోటి, రాజంపేట పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థులు ఉండటంతో ఏర్పాట్లు చేయలేదు. విద్యా సంవత్సరం ముగిసిన తరువాతే పూర్తిస్థాయిలో కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం 1500 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా మూడు వేల బెడ్లను సిద్ధం చేస్తున్నారు. తిరుపతి విష్ణు నివాసం, తిరుచానూరు శ్రీపద్మావతి నిలయం, శ్రీనివాసం వసతి సముదాయాల్లో సెంటర్ల ఏర్పాటుకు పనులు సాగుతున్నాయి. విశాఖ జిల్లాలో మూడు వేల పడకలకు అదనంగా మరో రెండు వేలు సిద్ధం చేయాలని అధికారులు భావించారు. ముడసర్లోవలో 900, బక్కన్నపాలెంలో 850 పడకలు మాత్రమే సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గ పరిధిలో రెండు వేల మందికి తగినట్లు రెండేసి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు పనులు సాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో 15 సెంటర్లకు మూడు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
    గుంటూరు జిల్లాలో 21 ప్రభుత్వ, 63 ప్రైవేటు ఆస్పత్రులు కోవిడ్‌ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో 11 పిల్లల ఆస్పత్రులను గుర్తించారు. మొత్తం 6951 బెడ్స్‌ను సిద్ధం చేశారు. గ్రామ సచివాలయం యూనిట్‌గా ఒక్కో కోవిడ్‌ కేర్‌ సెంటరు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఒక్కో సెంటర్‌లో ఐదు బెడ్స్‌, ఇద్దరు వైద్య సిబ్బంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. కరోనా తీవ్రతను బట్టి వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. కృష్ణాజిల్లాలో 18 ప్రభుత్వ, 59 ప్రైవేటు ఆసుపత్రులను సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు ఒక్కో నియోజకవర్గంలో వంద పడకలతో, విజయవాడ సమీపంలోని గూడవల్లి వద్ద కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 18 ప్రభుత్వ, 37 ప్రైవేటు మొత్తం 55 కోవిడ్‌ ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. వీటన్నింటిలో 2,500కుపైగా బెడ్స్‌ అందుబాటులో ఉండనున్నాయి. తూర్పుగోదా వరి జిల్లాలో అదనంగా 27 ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్‌ ఆసుపత్రులుగా మార్చారు. 450 పడకలతో బొమ్మూరు, 450 పడకలతో అల్లవరం మండలం బోడసకుర్రు, 150 పడకలతో సామర్లకోట వైటిసిలో కోవిడ్‌ కేర్‌ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 19 ప్రభుత్వ, 14 ప్రైవేటు ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 3320 పడకలను అందుబాటులో ఉంచారు. కర్నూలు జిల్లాలో కర్నూలు జిజిహెచ్‌లో 1400 పడకలు సిద్ధంగా ఉన్నాయి. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు టిడ్కో భవనాలతో పాటు సున్నిపెంట, డోన్‌లో కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి పంచాయతీకి ఒక సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.