Apr 11,2023 21:02

రాయచోటి : మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు

 రాయచోటి టౌన్‌ : మున్సిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు. మంగళవారం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి మున్సిపల్‌ కమిషనర్‌ గంగా ప్రసాద్‌కు వితీ పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులు ఒక్కొక్కరికి మూడు ఖాతాలలో పిఎఫ్‌ అకౌంట్స్‌ ఉన్నాయని, ఒక ఖాతాగా సరిచేయాలన్నారు. 62 ఏళ్ల వయోపరిమితి పెంచి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెరిగిన ధరల కనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలివ్వాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా విధుల్లోకి తీసుకున్న వారిని ఆప్కాస్‌లోకి తీసుకోవాలని తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒకరికి మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. మాస్క్‌లు, గ్లౌజులు, కొబ్బరినూనె, చెప్పులు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యకుడు పి.శ్రీనివాసులు, ఎపి రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.నాగబసిరెరెడ్డి, ఎస్‌.రామచంద్ర, మున్సిపల్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షులు ఎం.అగ్గిరామయ్య, తిరుపాల్‌, రమణమ్మ, మంగమ్మ, సిద్ధయ్య, సురేంద్ర పాల్గొన్నారు.
రాజంపేట అర్బన్‌ : పెండింగ్‌లో ఉన్న మున్సిపల్‌ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులు, ఆటో డ్రైవర్లకు 2 నుండి 4 నెలల వేతనాలు పెండింగులో ఉన్నాయని తెలిపారు. హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ రెండవ వారంలో కూడా వేతనాలు చెల్లించకుంటే కార్మికులు తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కార్మికుల యూనియన్‌ నాయకులు సిహెచ్‌.ఓబయ్య, కార్మికులు ప్రసాద్‌, సాలమ్మ, రవి ప్రకాష్‌, సుబ్బన్న, రవిశంకర్‌ పాల్గొన్నారు.