రాజానగరం (తూర్పు గోదావరి) : ముగ్గురు రైతులపై సుమారు 100 మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, రాడ్లతో దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పు గోనగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు గల్లా గణపతి, గల్లా నాని, గల్లా బాబ్జిపై గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురు వ్యక్తులను 108 వాహనంలో రాజమహేంద్రవరంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ దాడికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.










