Dec 03,2022 21:31

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : మూడు రాజధానుల ఏర్పాటుతోనే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి అన్నారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయ రాజధానికి కావలసిన అర్హతలన్నీ కర్నూలుకు ఉన్నాయని, దీంతో పాటుగా ప్రధాన నగరాలైన హైదరాబాద్‌ బెంగళూరు,తిరుపతి, విజయవాడ మొదలైన పట్టణాలన్నీ దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు రాయలసీమ ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. రాయలసీమలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కర్నూలును న్యాయ రాజధానిగా చేయడానికి మద్దతు తెలుపకపోవడం చూస్తుంటే రాయలసీమ పట్ల వారికున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతుందని అన్నారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్‌, సింగిల్‌ విండో అధ్యక్షులు రామిరెడ్డి, ఎంపీపీ కవిత సత్యనారాయణ, స్టేట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నాగరాజు గౌడ్‌, సర్పంచి ప్రభావతి దేవల నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.