ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు
మతోన్మాద బిజెపిని సాగనంపుదాం..దేశాన్ని కాపాడుకుందాం
- సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పిలుపు
నెల్లూరు:కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ, ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు , జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సిపిఐ నగర కన్వీనర్ అరిగెల నాగేంద్రసాయిలు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని 53, 54వ డివిజన్ల పరిధిలో సిపిఎం, సిపిఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ప్రచార భేరి కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో బిజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు ఒక పథకం ప్రకారం ప్రజల మధ్య చిచ్చు పెడుతూ దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను నిస్సిగ్గుగా అమలు చేస్తున్నదని విమర్శించారు. కేంద్రంలో తమకు అధికారం కట్టబెడితే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగాన్ని రూపుమాపుతామని హామీ ఇచ్చిందన్నారు. అంతే కాకుండా స్విస్ బ్యాంకుల్లో దాచిన నగదును బయటకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న హామీ ఇచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హౌదా తో పాటు విభజన హామీలను అమలు చేస్తామన్న హామీలను అక్కకెక్కించేసారని దుయ్యబట్టారు. మరోవైపు దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, శ్రమను అమ్ముకునేందుకు లక్షలాదిమంది రోడ్లపై ఎదురుచూడాల్సిన పరిస్థితులు దాపురించాయని అన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ఈ ప్రభుత్వం అంబానీ, ఆధానీల సేవలో తరిస్తోందని, ఇదేమిటని ప్రశ్నించిన వారిని దర్యాప్తు సంస్థలతో వేధించడం దేశంలో పరిపాటయిపోయిందని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతుంటే ఆ మేరకు ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టకుండా అయినకాడికి దోచుకునే పనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడడం సిగ్గుచేటని అన్నారు. గ్రామీణ పేదలకు జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని సైతం మోడీ ప్రభుత్వం నీరుగారుస్తోందని దుయపట్టారు. జి.ఎస్.టి ద్వారా చిరు వ్యాపారులు, సామాన్యుల నడ్డి విరిచే పని చేస్తున్నారని అన్నారు. ప్రజాధనంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అదాని, అంబానీలకు అప్పగించేస్తున్నారని, రైల్వేలు, ఓడరేవులు, విమానయానం, విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారని, కోట్లాదిమంది ప్రజల డబ్బుతో పచ్చగా కళకళలాడుతున్న ఎల్‌ఐసిని దివాలా తీయించే చర్యలను ఈ ప్రభుత్వం చేయడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ దగాకోరు విధానాలను రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన ప్రశ్నించకపోగా వారికి ఊడిగం చేసే పనిలో ఒకరికొకరు పోటీ పడడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. నయవంచక విధానాలతో ప్రజలను మోసగిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వామపక్షాలు చేస్తున్న పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి నాగేశ్వర రావు, నగర కమిటీ సభ్యులు మూలం ప్రసాద్, కె.పద్మ, 53,54వ డివిజన్ సిపిఎం శాఖా కార్యదర్శులు నక్క వెంకటేశ్వర్లు, షేక్ జాఫర్, సిపిఐ నాయకులు ముక్తియర్, షేక్ మున్నా, తదితరులు పాల్గొన్నారు.










