ప్రజాశక్తి-జగ్గయ్యపేట: సిపిఎం గ్రామ వ్యవస్థాపకులు మోరే బుజ్జి బాబయ్య ఆశయ సాధనకు అనుగుణంగా సిపిఎం కార్యకర్తలు పనిచేయాలని సిపిఎం పశ్చిమ కృష్ణ కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ సి హెచ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో మంగళవారం గ్రామ సిపిఎం వ్యవస్థాపకులు మోరే బుజ్జి బాబయ్య 46 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుజ్జి బాబయ్య స్థూపం వద్ద గల సిపిఎం జెండాను ఎన్ సి హెచ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం మోర బుజ్జి బాబయ్య స్థూపానికి సిపిఎం సీనియర్ నాయకులు కాకనబోయిన లింగారావు, మోరే బక్కమ్మ స్థూపానికి షేక్ మాబు సుభాని, గొట్టిముకల సైదారెడ్డి స్థూపానికి షేక్ గౌస్ మియాలు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో సిపిఎం విస్తరించడానికి కారకులైన వారిని స్మరించుకోవటం గొప్ప విషయం అన్నారు. నేడు బిజెపి ప్రజాభిత్రికి విధానాలతో ప్రజలపై భారాల మోపుతుందన్నారు. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానంటేయని పెట్రోల్ గ్యాస్ డీజిల్ వంటి రేట్లు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయన్నారు. ఈ విధానాలను తిప్పి కొట్టాలని ఈనెల 24న విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కోటా కృష్ణ, దంతాల వెంకటేశ్వర్లు, ఎస్ రామనాథం, ఎస్ ప్రణయ్ తేజ, బాలు, మహేష్, షేక్ మేరా సాహెబ్, షేక్ మస్తాన్, కె వెంకటేశ్వరరావు, లింగయ్య, దంతాల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.










