Sep 08,2023 22:39

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.రాజాబాబు, చిత్రంలో నాగిరెడ్డి, పేర్ని


ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (కృష్ణా) : ఖరీఫ్‌ సీజన్లో రైతులకు ఎరువుల కొరత ఏర్పడకుండా వ్యవసాయ అధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీ.నాగిరెడ్డి సూచించారు. శుక్రవారం స్పందన సమావేశపు మందిరంలో కలెక్టర్‌ పి.రాజాబాబు అధ్యక్షతన కష్ణాజిల్లా 39వ నీటిపారుదల సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా ఆగస్టులో తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. రైతులు ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రకాశం బ్యారేజి కింద కష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు (5 జిల్లాలలో) ఉందని, ఇందులో కృష్ణాజిల్లాలో కృష్ణాతూర్పు డెల్టా పరిధిలో ఆయకట్టు 5.62 లక్షల ఎకరాలని అన్నారు. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి సెప్టెంబర్‌ 5వ తేదీ నాటికి మొత్తం 105.32 టిఎంసిల నీటిని ఖరీఫ్‌ సాగుకు, తాగునీటి అవసరాలకు ఉపయోగించామన్నారు. కష్ణా తూర్పు డెల్టాకు 31.58 టిఎంసిల నీరు, కష్ణా పశ్చిమ డెల్టాకు 15.09 టిఎంపిల నీటిని వినియోగించినట్లు చెప్పారు. ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు 58.64 టిఎంసిల కృష్ణా నది నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. కలెక్టర్‌ పి.రాజాబాబు మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజి దిగువ 2 కొత్త బ్యారేజీలు నిర్మాణం కానున్నాయని తెలిపారు. 16 కిమీ దిగువన చోడవరం వద్ద , అలాగే 67 కిమీ దిగువన మోపిదేవి మండలంలో నిర్మించేందుకు రూ.204.37 కోట్లకు స్టేజి -1 పరిపాలన ఆమోదం లభించినట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు బ్యారేజిల నిర్మాణానికి అవసరమైన డిపిఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) తయారు చేసి, అంచనాలను ప్రభుత్వ అనుమతి కోసం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యారేజీల స్టేజి -2 అంచనాలను కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ 2022-23 రేట్లతో మొదటి బ్యారేజీ అంచనా విలువ రూ.2235.42 కోట్లతో, రెండో బ్యారేజీ అంచనా విలువ రూ.2526,39 కోట్లతో పరిపాలనా అనుమతికి ప్రభుత్వానికి సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వం కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ 2023-24 రేట్లతో అంచనాలు తయారు చేసి తిరిగి సమర్పించాల్సి ఉందన్నారు. మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ జిల్లాలో 28,764 టన్నుల వరకు ఎరువులు అవసరమని, ఎరువుల పంపిణీలో రేషన్లైజేషన్‌ విధానం పాటించాలని కోరారు. ఈ సమావేశంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ జన్ను రాఘవరావు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ప్రసాదరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.పద్మావతి, సివిల్‌ సప్లయిస్‌ డీఎం వి.శ్రీధర్‌, జిల్లా సలహామండలి సభ్యులు శ్రీకాకోళపు నాగేశ్వరరావు (బాబు), పట్టపు శ్రీనివాసరావు (నాని), పెన్నేరు ప్రభాకరరావు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.