Oct 01,2020 07:22

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులందరూ నిర్దోషులేనన్న తీర్పుతో లక్నో సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయాన్ని అపహాస్యం చేసింది. అయోధ్యలో 450 ఏళ్ల క్రితం నుండి వున్న బాబ్రీ మసీదు 1992 డిసెంబర్‌ 6న నేలమట్టమైంది. సంఘపరివార్‌ శక్తులు ఏళ్లతరబడి దేశమంతటా మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టి బాబ్రీ మసీదును ధ్వంసం చేశారని ప్రపంచానికంతటికీ తెలుసు. ఆ విధ్వంస చర్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలూ ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. అయినా, నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవని, అభియోగాలను సిబిఐ నిరూపించలేకపోయిందనీ న్యాయమూర్తి కేసు కొట్టేశారు. మసీదు విధ్వంసానికి మార్గనిర్దేశం చేస్తూ సంఘటనా స్థలంలో ప్రత్యక్షంగా పాల్గొన్న బిజెపి-విహెచ్‌పి-ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్ర నేతలందరూ అమాయకులేనని కోర్టు పేర్కొనడం ఆశ్చర్యకరంగా ఉంది. నిందితులందరూ నిర్దోషులైతే మసీదు దానికదే కుప్పకూలిపోయిందా? ఎవరైనా మ్యాజిక్‌ చేశారా? అన్న సందేహాలు చిన్న పిల్లలకు సైతం కలగడం సహజం. ఎంతో కష్టపడి దశాబ్దాల పాటు విచారించిన న్యాయమూర్తి ఇంత అన్యాయమైన తీర్పు ఇచ్చారేమిటా అని జనం విస్తుపోతున్నారు. ఈ తీర్పు 'అందరూ శాకాహారులే అయితే రొయ్యల బుట్ట ఎలా ఖాళీ అయింద'న్న సామెతను గుర్తుకు తెస్తోంది.
జస్టిస్‌ లిబర్‌హాన్‌ కమిషన్‌ నివేదిక పేర్కొన్న నిర్ధారణలకు, దేశ సర్వోన్నత న్యాయస్థానం గత ఏడాది ఇచ్చిన తీర్పులో స్పష్టంగా చెప్పిన అంశాలకు కూడా సిబిఐ కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి, బిజెపి సహా వివిధ సంఘపరివార్‌ సంస్థలకు, నాయకులకు పదుల కోట్ల రూపాయలు బ్యాంకు అకౌంట్ల ద్వారానే బదిలీ అయ్యాయని జస్టిస్‌ లిబర్‌హాన్‌ కమిషన్‌ స్పష్టంగా పేర్కొంది. ఇంత సొమ్ము బదిలీ కావడం, దశలవారీగా ప్రజలను రెచ్చగొట్టి సమీకరించడం ముందస్తు ప్రణాళిక, పథకం ప్రకారమే ఈ విధ్వంసానికి పాల్పడ్డారనడానికి నిదర్శనమని కూడా చెప్పింది. బాబ్రీ మసీదు కూల్చివేత చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని గత ఏడాది నవంబరు 8న అయోధ్య తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ముందస్తు పథకం ప్రకారమే (క్యాలిక్యులేటెడ్‌ యాక్ట్‌) మసీదును నేలమట్టం చేశారని ఆ తీర్పు చెప్పిన ఆనాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు కల్యాణసింగ్‌ తప్ప నిందితులెవరూ ఎలాంటి సాక్ష్యాధారాలనూ చూపలేకపోయారు. మరోవైపు సిబిఐ 351 మంది సాక్షులను, అనేక ఆధారాలనూ కోర్టు ముందుంచింది. అయినాగాని ఏ ఒక్కరినీ ఆ విధ్వంసానికి బాధ్యులను చేయకుండా ప్రధాన కుట్రదారులందరూ నిర్దోషులని లక్నో కోర్టు తీర్పునివ్వడం దారుణం. ఏళ్ల తరబడి విచారించి, రెండు వేల పేజీల సుదీర్ఘ తీర్పునిచ్చినా అది కొండను తవ్వి ఎలుక తోకను కూడా పట్టనట్టయిందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను పూర్తిగా కొట్టి పారేయలేం. లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా భారత్‌కు గల పేరు ప్రతిష్టలకు ఈ తీర్పు మాయని మచ్చ. రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం.
మోడీ గద్దెనెక్కినప్పటి నుండీ దేశంలో మతతత్వ విచ్ఛిన్నకర ధోరణులను పెంచి పోషించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నిటి లోకి సంఘపరివార్‌ శక్తులు చొరబడ్డాయి. బిజెపి పూర్తి మెజార్టీతో రెండోసారి గద్దెనెక్కిన అనంతరం విశృంఖలంగా చెలరేగుతోంది. ప్రశ్నించిన వారి గొంతు నులిమేయడం, ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు తప్పుడు కేసులతో సహా అన్ని విధాలా నిరంకుశ చర్యలకు పాల్పడుతోంది. 'ఒకే దేశం-ఒకే మతం-ఒకే భాష...' వంటి నినాదాలతో 'భిన్నత్వంలో ఏకత్వం' గల భారత్‌లో బహుళత్వాన్ని లేకుండా చేయాలని చూస్తున్నారు. దేశ సమైక్యత, సమగ్రతలకు, మత సామరస్యానికి చేటు తెస్తున్నారు. ఈ తప్పుడు ధోరణిని, మైనారిటీల పట్ల వ్యక్తమవుతున్న అసహనాన్ని తాజా తీర్పు మరింత బలపరిచినట్టయింది. ఏది ఏమైనా లౌకిక భారతదేశంలో మైనార్టీల హక్కులకు, వారి మనోభావాలకు ఈ తీర్పు వ్యతిరేకంగా ఉంది. లౌకిక రాజ్యాంగానికి కట్టుబడి సిబిఐ తక్షణమే ఈ తీర్పుపై అప్పీల్‌ చేయాలి.