కృష్ణా జిల్లా పోరంకి ఆదివారం ప్రజాకళోత్సవంతో కళకళలాడింది. ప్రజానాట్యమండలి (పిఎన్‌ఎం) రాష్ట్ర పదో మహాసభల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సఫ్దర్ హష్మీ ఓపెన్ థియేటర్లో వీధి నాటికలు, సాంస్క ృతిక నృత్యాలూ ప్రదర్శించారు. వందలాదిమంది హాజరై ప్రదర్శనలను తిలకించారు. సోమ, మంగళవారాల్లో కూడా ఈ సందడి కొనసాగుతుంది.
- ప్రముఖ సినీ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు
- పిఎన్‌ఎం వీధి నాటకోత్సవాలు ప్రారంభం
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి, విజయవాడ : ప్రజా సమస్యలే ఇతివృత్తంగా ప్రజానాట్య మండలి కళారూపాలు రూపొందించాలని ప్రముఖ సినీ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు అన్నారు. పిఎన్‌ఎం పదో రాష్ట్ర మహాసభను పురస్కరించు కుని ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్ తాడిగడప పరిధిలోని పోరంకి సెంటర్లో సఫ్డర్ హష్మీ ఓపెన్ థియేటర్లో వీధి óనాటకోత్సవాలను ఆయన నగారా మోగించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచం, సంఘం, చరిత్ర, ఆర్థిక రాజకీయాలపై అవగాహన పెంపొందించుకున్నప్పుడే మంచి కళారూపాలు రూపొందించి ప్రజలను చైతన్యం చేయగలమనే విషయాన్ని కళాకారులు గుర్తించాలన్నారు. త్యాగ నిరతి, సిద్ధాంతంపై మంచి అవగాహన ఉన్నప్పుడే నైపుణ్యం కలిగిన కళాకారులుగా తయారవుతారని పేర్కొన్నారు.
ప్రజా నాట్యమండలికి 79 ఏళ్ల చరిత్ర ఉందని, దీనిలో ఎందరో కళాకారులు నిస్వార్ధంగా సమాజహితం కోసం పని చేశారని గుర్తు చేశారు. ఢిల్లీ వీధుల్లో వీధి నాటిక ప్రదర్శిస్తూ హత్యకు గురైన సఫ్డర్ హష్మీ లాంటి త్యాగజీవుల జీవితాలు ప్రజా కళాకారులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం కళా ప్రదర్శనలు ఇచ్చిన బృందాలకు ఉమామహేశ్వరరావు, పిడిఎఫ్ ఎంఎల్‌సి కె.ఎస్.లక్ష్మణరావు, ఆహ్వాన సంఘ అధ్యక్షులు దూబగుంట్ల రామారావు, వికాస్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ పరిమి, అనుమోలు ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు అనుమోలు ప్రభాకరరావు, ఎంబివికె కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ, పిఎంఎం ఎపి, తెలంగాణ కార్యదర్శులు ఎస్.అనిల్ కుమార్, కట్టా నరసింహా, రాష్ట్ర ఉపాధ్య క్షులు పి.విజయకుమార్, కృష్ణా జిల్లా కార్యదర్శి షేక్ ఖాసీం, సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యాజీ తదితరులు మెమోంటోలు అందజేశారు.

భారీ ర్యాలీ
ప్రజాశక్తి- విజయవాడ : ప్రజానాట్యమండలి 10వ రాష్ట్ర మహాసభ సందర్బంగా పెనమలూరు సెంటర్ నుండి పోరంకి సెంటర్ సఫ్డర్ హష్మీ ఓపెన్ థియేటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అగ్రభాగాన పిఎన్‌ఎమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, జాషువా సాంస్కృతిక వేదిక కన్వీనర్ గాదె సుబ్బారెడ్డి, సాంస్కృతిక విభాగం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం తదితర నాయకులు ఉన్నారు. కోలాటం, డప్పు వాయిద్యాలు, తీన్మార్ వాయిద్యాలతో ర్యాలీ మారు మోగింది. విజయవాడ పడమటలంక విద్యార్థినుల కోలాటం, కృష్ణా జిల్లా ఉంగుటూరు, జంగారెడ్డిగూడెం డప్పు కళాకారుల బృందం, సూరంపల్లికి చెందిన మహిళల కోలాట దళం, కులమత భేదాలు లేవంటూ హిందూ, ముస్లిం బారుబారు అంటూ మనుషులంతా ఒక్కటే అని చాటి చెపుతూ నంద్యాలకు చెందిన సుధాకర్, నాగరాజు, బంగారయ్యల వేషధారణ ఆకట్టుకున్నాయి. ధరల భారం, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించొద్దని ఇద్దరు బండి లాగుతున్న దృశ్యం ఆకట్టుకుంది. ప్రభుత్వ రంగాన్ని తెగనమ్మడం, కార్మికుల పొట్టగొట్టడం, రైతుని వేలం వేయడం వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అధిక ధరల భారాన్ని మోయలేమంటూ ఉయ్యూరుకు చెందిన కోటేశ్వరరావు బండరాయి నమూనాను మోస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. విశాఖకు చెందిన తీన్మార్ బృందం రమణ, స్టాలిన్ వాయిద్యాలను వాయిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఎనిమిదేళ్ల కార్తీక్ పులి వేషం, యనమల కుదురు విద్యార్థుల డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. పిఎన్‌ఎం జెండాలు పట్టుకుని కళాకారులు ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కళాకారుల, సాహితీవేత్తలు కళాభిమానులు, కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

సాంస్క ృతిక విధానాన్ని ప్రకటించాలని తీర్మానం
రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలని మహాసభ తీర్మానించింది. ఏలూరుకు చెందిన చైతన్యప్రసాద్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. మౌలాలి బలపరిచారు. దీనిని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మహాసభలో గత నాలుగేళ్లలో జరిగిన కార్యకలాపాల నివేదికను పిఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్‌కుమార్ ప్రవేశ పెట్టారు. అనంతరం ఈ నివేదికపై జిల్లాల వారీగా చర్చించారు. గత నాలుగేళ్లలో మృతి చెందిన కళారంగ ప్రముఖులు, సాహితీ, సామాజికవేత్తలకు మహాసభ ఘనంగా నివాళులర్పించింది.
అజెండాను పిఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి అనిల్‌కుమార్ ప్రతిపాదించగా, మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 26 జిల్లాల నుండి 204 మంది ప్రతినిధులు, మరో వంద మంది కళాకారులు హాజరయ్యారు. అత్యధికంగా విశాఖ జిల్లా నుండి 32 మంది వచ్చారు. మహాసభ అధ్యక్షవర్గంగా పి.విజయకుమార్, రమణ, వలి, కృష్ణవేణి వ్యవహరించారు. మినిట్స్ కమిటీలో చంటి, డి.శ్రీనివాస్, వంశీ, తీర్మానాల కమిటీలో మంగరాజు, చైతన్యప్రసాద్, ఒ.రమణ, అర్హతల కమిటీలో సుభాషిణి, వెంకట చలపతి, వేణు, పవన్, కొండలరాజు ఉన్నారు. పాటల నిర్ణయ కమిటీలో ఐ.వెంకటేశ్వరరావు, పెద్ది రాజు, ఆశన్న, 'షాట్' కమిటీలో కవి, నాగ్, దండు నాగేశ్వరరావు, రాజారమేష్ ఉన్నారు. పిఎన్‌ఎం ఆఫీసు బ్యారర్లంతా స్టీరింగ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.










