- చరిత్ర వక్రీకరణ, అసత్య ప్రచారం
- ఎనిమిదేళ్ల పాలన ఘనత
న్యూఢిల్లీ : నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఎనిమిదేళ్ల కాలంలో మోడీ సర్కారు చేసిందేమిటి? సంఫ్‌ుపరివార్, వారి కన్నుసన్నల్లో నడిచే కార్పొరేట్, సోషల్ మీడియా, వాట్సప్ యానివర్శిటీలు విజయాలపై చేసే అట్టహాసపు ప్రచారం సంగతి ఎలా ఉన్నప్పటికీ వాస్తవం ఆందోళనకరం. గత ప్రభుత్వాలతో పోలిస్తే మోడీ ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్ల కాలంలో అన్ని రాజ్యంగ వ్యవస్థలపై దాడి చేసి, వాటిని తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ అంతకు మించి మరోప్రమాదకరమైన చర్యకు మోడీ సర్కారు తెగబడింది! అది దేశ ప్రజల జ్ఞాపకశక్తిపై దాడి చేయడం! ఒక వ్యూహం ప్రకారం అనేక రంగాల్లో మోడీ ప్రభుత్వం ఈ దిశలో చర్యలు తీసుకుంటూ దేశ ప్రజల మెదళ్లను తప్పుడు సమాచారంలో నింపేస్తోంది. భవిష్యత్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాక్సినేషన్‌పై ఇలా...
ప్రజల జ్ఞాపకశక్తిపై మోడీ సర్కారు ఇటీవల చేసిన దాడి కరోనా వ్యాక్సినేషన్. కరోనాను నియంత్రించడంలోనూ, ప్రజల జీవనోపాధికి గండి పడకుండా చూడటంలోనూ తీవ్రంగా వైఫల్యం చెందిన మోడీ ప్రభుత్వం ఆ తరువాత వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తప్పుడు సమాచారాన్ని ప్రజలకు సరఫరా చేసింది. ప్రజలందరికి ఉచితంగా సార్వత్రిక వ్యాక్సినేషన్‌ను చేపట్టాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో ఇప్పటికీ ఈ దిశలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాలేదు. కానీ, మోడీ ప్రభుత్వం దేశంలో ఇదే మొట్టమొదటి వ్యాక్సినేషన్ కార్యక్రమం అయినట్టు, అది కూడా ప్రజలందరికి ఉచితం అన్న తరహాలో ప్రచారం చేసుకుంది. నిజానికి పోలియోతో పాటు అనేక వ్యాధులకు గత ప్రభుత్వాలు ప్రజలంద రికీ ఉచితంగా అందించాయి. ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం ఉద్ధేశ్యపూర్వకంగా మరుగున పరిచింది.
చరిత్ర వక్రీకరరణ...
గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ ప్రభుత్వం చరిత్రను పెద్ద ఎత్తున వక్రీకరణకు గురిచేస్తోంది. ఇది కూడా ప్రజల మెదళ్లపై ఒక వ్యూహం ప్రకారం చేస్తున్న దాడే. స్వాతంత్ర పోరాటంలో నామమత్రపు ప్రమేయం కూడా లేని సంఫ్‌ుపరివార్‌కు పెద్ద పీట వేయడం, భగత్‌సింగ్ వంటి నిజమైన స్వాతంత్ర పోరాట వీరుల చరిత్రలను పాఠ్య పుస్తకాల నుండి తొలగించి, సావర్కర్‌కు స్థానం కల్పించడం వంటివి ఇటువంటివే! ఇది ఇక్కడితో ఆగలేదు. రాజ్యాంగానికి తప్పుడు నిర్వచనం చెప్పడం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం వంటి చర్యలకు మోడీ ప్రభుత్వంలోని మంత్రులే దిగుతున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రుపైనా, వామపక్షాలపైనా దుష్ప్రచారంచేయడంలోనూ మోడీ ప్రభుత్వానిది ఈ తరహా వ్యూహమే! కాశ్మీర్ పైన కేంద్ర ప్రభుత్వం తప్పుడు సమాచారాన్నే ప్రజల ముందుంచింది. ఇటువంటి చర్యల ద్వారా విద్యార్థుల మెదళ్లలోనే విద్వేష విషం నింపడానికి ప్రయత్నం చేస్తోంది.
లౌకికవాదంపై దాడి
స్వాతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లౌకికవాదంపై దాడి చేయడం కూడా మోడీ సర్కారు ప్రత్యేకతే! ఈ చర్య ద్వారా భిన్నత్వంలో ఏకత్వమన్న భారతీయ భావనను ప్రజల మెదళ్లనుండి తుడిచివేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ప్రార్దనాలయాలను, పండుగలను, సాంప్రదాయాలను ఆధారం చేసుకుని సంఫ్‌ుపరివారం చేస్తున్న విద్వేష ప్రచారానికి మోడీ సర్కారు మద్దతుగా నిలుస్తోంది. కాశ్మీర్ విభజన, ఎన్‌పిఆర్, సిఎఎ వంటి నిర్ణయాలను దీనిలో భాగంగానే మోడీ ప్రభుత్వం తీసుకుంది. మైనార్టీలపై దాడులు జరిగిన సమయంలో మౌనంగా ఉండటం, లేదా దాడులు చేసిన వారిని సమర్ధించడం వంటి చర్యలు ప్రజల మధ్య ఉన్న మైత్రీ పూర్వక భావనను ధ్వంసం చేయడానికి ఉద్దేశించినవే! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై దాడి కూడా ఈ తరహా చర్యే !
విమర్శకులపై విషం..
గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ ప్రభుత్వం తనను విమర్శించే వారిపై తీవ్ర స్థాయిలో విషం చిమ్మడంతో పాటు, వారిపై పెద్ద ఎత్తున దాడులకు దిగుతోంది. ఈ తరహా చర్యల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెదవి విప్పడానికి కూడా భయపడే స్థితికి సాధారణ ప్రజలను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. మేధావులు, రచయితలు, కవులు, యూనివర్శిటీ విద్యార్థులు, వామపక్షాల కార్యకర్తలను ఈ ఎనిమిదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుంది. పత్రికాస్వేఛ్చలో దేశం ర్యాంకు గతంలో ఎన్నడూ లేని స్థాయికి పడిపోయింది. వందలాది మంది జర్నలిస్టులు, పౌరహక్కుల కార్యకర్తలు ఉపా, దేశద్రోహం వంటి కేసులతో పాటు, ఐపిసిలోని అనేక సెక్షన్ల కింద విచారణను ఎదుర్కుంటున్నారు.











