Sep 20,2022 22:44

 సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి. కృష్ణ
ప్రజాశక్తి - వన్‌టౌన్‌

బిజెపీ మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని, నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ఇలా అన్ని ధరలు పెరిగిపోవటంతో పేదల జీవన భృతి అగమ్యగోచరంగా తయారైందని సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి. కృష్ణ అన్నారు. సిపిఎం పశ్చిమ సిటీ సభ్యడు కె. సూరిబాబు ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన గాంధీనగర్‌్‌ జింఖానా గ్రౌండ్స్‌లో దేశ రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. వన్‌టౌన్‌ నెహ్రూ బొమ్మ సెంటర్‌ నుంచి చిట్టినగర్‌్‌ సెంటర్‌, అక్కడి నుండి నెహ్రూ బొమ్మ సెంటర్‌ తదితర ప్రాంతాలలో ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.వి. కృష్ణ మాట్లాడుతూ పేద ప్రజలపౖౖె భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధరలను విపరీతంగా పెంచుతూ, ఆఖరికి పిల్లలు తాగే పాలు, పెరుగు లాంటి రోజువారీ వాడే వాటికి కూడా జిఎస్‌టిలు విధించారని మండిపడ్డారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ లాంటి వైతే ప్రతి నెల నెలా పెంచుకుంటూ పోతూ సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అధికార పార్టీ వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం బిజెపి చంకలో చేరి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాం చేస్తున్నా మోడీ విధానాలకు వత్తాసు పలకటం సిగ్గుచేటన్నారు. ప్రత్యేక హాోదా ఇస్తానన్న మాట తప్పి, ఇవ్వకపోగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసే ప్రయత్నంకు పూనుకుంటు న్నారని తెలిపారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ పోతూ, కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తుందని అన్నారు. బిజెపి మత పిచ్చి పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి పోషిస్తున్నారని తెలిపారు. అసంఘటిత కార్మికులకు రూ. 26 వేలు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌. శ్రీను, ఓరా శ్రీను, గొలుసుల రాజు, కోనా సూర్యనారాయణ, పైడి చిట్టి, సత్యనారాయణ, ఇస్మయిల్‌, చిన్నబాబు, కోనా రాము, లింగయ్య పాల్గొన్నారు.