May 27,2022 09:45

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు కోసమే ప్రభుత్వం రూ.650 కోట్లను కేటాయించినట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ ఆస్పత్రిలోనూ మందుల కొరత తలెత్తకూడదన్నారు. సూపరింటెండెంట్లు సకాలంలో ఇండెంట్‌ ఇస్తే వెంటనే నిధులు మంజూరు చేస్తామన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్‌ నుంచి ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టరు జె నివాస్‌తో కలిసి కృష్ణబాబు అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ.. మందుల కొనుగోలుకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. రోగులకు అవసరమైన మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ నిధులను వేరే అవసరాలకు వాడొద్దని కలెక్టర్లకు సూచించారు. అత్యవసర నిధులను సర్జికల్స్‌ కోసం వాడితే ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది పనితీరును తరచుగా పర్యవేక్షించాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. ఆస్పత్రుల్లో వాస్తవం కంటే 40 శాతం తక్కువ సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. ఆస్పత్రుల కోసం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నా.. ఫలితం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సినేషన్‌లో వెనుకబడిన జిల్లాలు లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 24వ తేదీ తర్వాత పంపించే కోవిడ్‌ పరిహారాల చెల్లింపునకు 90 రోజుల గడువు పడుతుందని తెలిపారు. ఆస్పత్రుల్లో ఈ నెలాఖరుకల్లా బయోమెట్రిక్‌ హాజరును నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బంది విషయంలో హెచ్‌ఒడిలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బయోమెట్రిక్‌ హాజరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆస్పత్రుల్లో ఎక్కడా ఖాళీలుండకూడదని, సిబ్బంది నియామకాల్లో నిబంధనలను సడలించనున్నట్లు తెలిపారు. వైద్య సేవలపై పత్రికల్లో వచ్చే వార్తలపై కలెక్టర్లు స్పందించాలన్నారు. తిరుపతి రుయా ఘటన నేపథ్యంలో అదనంగా అవసరమైన మహాప్రస్తానం వాహనాలపై సిఎంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న కొత్త మెడికల్‌ కాలేజీలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కృష్ణబాబు సూచించారు.