Feb 23,2023 21:32

ట్యాంకును పరిశీలిస్తున్న కమిషనర్‌

ప్రజాశక్తి-నెల్లూరు :రానున్న వేసవికాలం నీటి ఎద్దడిని దష్టిలో ఉంచుకుని నగర వ్యాప్తంగా మంచినీటి సరఫరాకు ఏలాంటి అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ హరిత అధికారులకు సూచించారు. గురువారం స్థానిక 31 వ డివిజన్‌ సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ రోడ్డు ప్రాంతంలో పర్యటించారు. చవటగుంట, విజయలక్ష్మి నగర్‌ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. కమిషనర్‌ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దష్టి సారించి స్వచ్ఛ నెల్లూరు సాకారానికి కషి చేయాలని అధికారులు, సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న వివిధ వీధుల్లో డ్రైను కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని, దోమల నిర్మూలనకు మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల నివారణా చర్యల్లో భాగంగా అన్ని డ్రైను కాలువల్లో ఆయిల్‌ బాల్స్‌ పిచికారీ చేయాలని, క్రమం తప్పకుండా ఫాగింగ్‌ పనులు నిర్వహించాలన్నారు. నగర పాలక సంస్థ అందజేసిన చెత్త బుట్టలలో తడి, పొడి చెత్తను విడిగా తీసి ఉంచాలని, రీ సైక్లింగ్‌ విధానానికి ప్రజలంతా బాధ్యతగా సహకరించాలని కోరారు. డివిజన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో డ్రైను కాలువల్లో పూడికతీత, సిల్ట్‌ తొలగింపు పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ ను సందర్శించిన కమిషనర్‌ మంచినీటి సరఫరా పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువు నీటిని సేకరించిన అనంతరం వివిధ విభాగాలలో జరుగుతున్న మంచినీటి శుద్ధి ప్రాసెసింగ్‌ విధానాలను నిశితంగా తనిఖీ చేశారు. వేసవికాలంలో మంచినీటి సరఫరాలో తలెత్తే అంతరాయలపై ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కమిషనర్‌ సూచించారు. మంచినీటి పరిశుభ్రతకు ప్రధాన ప్రాధాన్యత కల్పిస్తూ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను సిబ్బంది కచ్చితంగా పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్‌ ఆదేశించారు. నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వెంకట రమణ, ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు సంపత్‌ కుమార్‌, సంజరు, శేషగిరిరావు ఉన్నారు.