అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ వారి బ్యానర్‌లో 'పుష్ప' రూపొందుతున్న సంగతి తెలిసిందే. అడవి నుంచి ఎర్రచందనం అక్రమంగా తరలించే అంశం ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. ఈ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? ఎలాంటి శక్తులు కలపను అడవిని దాటిస్తూ ఉంటాయి? అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించనున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇప్పటికే మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో చిత్రీకరించారు. మిగిలిన సన్నివేశాల చిత్రీకరణ కోసం మళ్లీ అక్కడికి వెళ్లేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. లాక్‌డౌన్ తరువాత ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పరిసరాల్లో షూటింగు జరుపుకుంటోంది. ఈ నెలాఖరు వరకూ ఇక్కడే చిత్రీకరణ జరుగుతుందట. ఆ తరువాత షెడ్యూల్‌ను మళ్లీ మారేడుమిల్లి ఫారెస్టులో ప్లాన్ చేశారు. ఆగస్టులో అక్కడ ఓ 15 రోజుల పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌ను సుకుమార్ చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశాడని చెబుతున్నారు. కాగా, ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా మొదటి పార్టు షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.










