Sep 19,2020 06:57

ప్రియమైన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా,
ఇంతకాలం నేను అంతరాత్మ ఆదేశానుసారం తీర్పులు ఇచ్చానని పదవీ విరమణ సందర్భంగా మీరు చేసిన వీడ్కోలు వ్యాఖ్యలే నేను ఈ లేఖ రాసేలా చేశాయి. నేను ఇంతకాలం న్యాయమూర్తులు ప్రత్యేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ... తమ ముందున్న సమాచారం మేరకు 'భారతీయులమైన మేము' అన్న దృక్పథానికి అనుగుణంగా రాజ్యాంగం పరిధిలో తీర్పులు ఇస్తారని అనుకుంటుండేవాణ్ణి. ఒక న్యాయమూర్తి రాజ్యాంగం బట్టి గాక అంతరాత్మను బట్టి తన నిర్ణయాలు సమర్థించుకోవడం ఇదే మొదటిసారి. మీరు పదవీ బాధ్యతలు స్వీకరించేప్పుడు ఏమని ప్రమాణం చేశారో బాగానే గుర్తుండి వుంటుంది. భయం, పక్షపాతం లేకుండా అంతరాత్మ ప్రబోధాన్ని పాటిస్తానని ప్రమాణం చేశారా? అంతరాత్మ అనే పదం వుందా అసలు? రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షిస్తానని ప్రమాణం చేశారా?
ప్రతి వ్యక్తికి అంతరాత్మ వుంటుంది నిజమే. మన మెదడులో ఒక భాగం చేసే పని మంచిదా చెడ్డదా అని వివేచించి చెప్పే భాగాన్ని అలా పిలుస్తుంటాం. అయితే అది ఎవరి తరహాలో వారికి వుంటుంది. ఒక్క క్షణంలో ఆ విషయానికి వస్తాను.
అడాల్ఫ్‌ హిట్లర్‌ లక్షలాది మంది యూదులను ఆస్విజ్‌ తదితర చోట్ల విష వాయు కుహరాలలో కుక్కి ఊచకోత కోసినప్పుడు ఆయన అంతరాత్మ చాలా స్పష్టంగానే వుంది. పితృభూమి నుంచి పరాయి సంస్కృతులను తుడిచి పెట్టే గొప్ప పని చేస్తున్నావనే ఆయనకు చెప్పింది. అలాగే, 2002లో గుజరాత్‌ బెస్ట్‌ బేకరీ దురంతంలో పేద ముస్లింలను మండే కొలిమి లోకి విసిరేసినపుడు గాని, ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఇళ్లలోకి సిలిండర్లు విసిరేసిన పెద్ద మనుషుల అంతరాత్మలు గాని అవన్నీ మహత్కార్యాలు చేస్తున్నారనే చెప్పి వుంటాయి. కనుక మీ అంతరాత్మ సిద్ధాంతం బూటకమైనది.
పదవీ విరమణ చేస్తున్న సమయంలో మీ అంతరాత్మ స్వచ్ఛంగా వుందని మీరన్నారు. గౌరవ ప్రదంగా రిటైరై భారీ పెన్షన్‌ తీసుకునే నైతిక హక్కు మీకు వుందా లేదా అనేది వేరే ప్రశ్న. మీరు కులీన కుటుంబంలో పుట్టారు గనక లేక మామూలుగా చెప్పే మాటల ప్రకారమైతే హైకోర్టు న్యాయమూర్తి కుమారుడిగా నోట్లో బంగారు చెంచాలు పెట్టుకుని పుట్టారు గనక అదృష్టవంతులు కాగలిగారని గొణగడం లేదు.
మరి కేవలం మీ అహంభావం వల్ల, న్యాయాన్ని తప్పుగా అన్వయించడం వల్ల జీవితాలే ఛిన్నాభిన్నమైన వారి సంగతేమిటి?
నాకో మిత్రురాలుంది. కొచ్చిన్‌లో తన ఇల్లు వున్న అపార్ట్‌మెంట్‌ సముదాయాన్ని మీరు కేవలం మీ అహాన్ని సంతృప్తి పర్చుకోవడానికి మాత్రమే కూలగొట్టించారు. ఆగేయాసియాలో 'శాంతి సీమ' అని పిలవబడే చిన్న దేశంలో ఆమె భర్త డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఆ రాచరిక దేశంలో డాక్టర్లకు బాగా జీతాలిస్తారు. వారిది చిన్న కుటుంబం. ఆ పని కాంట్రాక్టు అయిపోయాక ఆ బయిట దేశంలో వుండటం కుదరదని వారికి తెలుసు. అందుకే కేరళకు తిరిగి వచ్చాక జీవితంలో స్థిరపడదామని వారు ఫ్లాట్‌ కొనుక్కొన్నారు. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఆమె చేయగలిగిన అలంకారమంతా చేసింది. ఇప్పుడు ఆమె కలలన్నీ మట్టికొట్టుకుపోయాయి. ఇప్పటికీ ఆ బ్యాక్‌ వాటర్‌ లో వాటి శకలాలు కనిపిస్తాయి. మీరు ప్రశాంతంగానే రిటైరైనారు గాని ఆమె ఎన్నటికీ ప్రశాంతంగా రిటైరవలేరు. ఎందుకంటే మీరు ఆమె ప్రశాంతతను, జీవన భద్రతను ఛిద్రం చేశారు.
అలా కష్టాలపాలైన వ్యక్తి ఆమె ఒక్కరే కాదు. మరో వ్యక్తి గురించి ఆమె నాకు లేఖ రాసింది. ఆయన బ్యాంకు నుంచి రుణం తీసుకుని రెండు ఫ్లాట్లు కొన్నారు. కేరళ తిరిగి వచ్చాక ఒక దానిపై వచ్చే అద్దెతో బతకవచ్చునని ఆశ పడ్డారట. కాని ఈ రోజు ఆయన రెండు ఫ్లాట్లకు ఇఎంఐ కట్టాల్సిందే. కాని అవి రెండూ పేలిపోతున్న దృశ్యం తనకు ప్రాణాంతకమైంది. మీ చర్య పర్యవసానాలేమిటో మీకు తెలుసా?
పైకి చూస్తే మీరు పర్యావరణాన్ని పరిరక్షించినట్టు కనిపిస్తుంది. 2018లో వరదలు వచ్చినపుడు కొచ్చిన్‌ విమానాశ్రయం మొదటి ఫ్లోర్‌ లోకి నీళ్లు వచ్చేశాయని మీరెరుగుదురా? కాని మీరు డైనమైట్లతో పేల్చి పారేసిన అయిదు టవర్లలోకి చుక్క నీరు కూడా రాలేదు. ఆ భవనం ఒక్కసారిగా పుట్టుకురాలేదు. ఆ ఫ్లాట్ల యజమానులు 342 మంది భూమి శిస్తు, నిర్మాణ సామగ్రిపై జిఎస్‌టి చెల్లిస్తున్నారు. బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పుల కోసం సమర్పించిన భూమి దస్తావేజుల విషయంలోనూ ఎలాంటి సమస్యలు లేవు. ఇక చివరగా కేరళ హైకోర్టు ఆ నిర్మాణాన్ని అనుమతించింది. అక్కడ వారు సుఖంగా వుంటున్నారు. ఆ సమయంలో మీరు తల దూర్చి ఎవరూ అడక్కపోయినా ధ్వంసం చేయించారు.
ఇప్పుడు రిటైరైనారు గనక తదుపరి పదవి ఇంకా రాలేదు గనక మీకు తీరిక ఎక్కువగానే వుంటుంది. మిమ్మల్ను నేను కొన్ని డిడిఎ కాలనీలకు తీసుకెళ్లి చూపిస్తాను. పోలీసుల, ఢిల్లీ ఉన్నతాధికారుల చేతులు తడిపి అక్కడ కట్టిన వాటికి ఎన్ని మరమ్మతులు చేశారో, విస్తరించారో చూడ్చొచ్చు. ఇది భారత దేశ రాజధాని నడిబొడ్డున జరిగిన తతంగం.
న్యాయమూర్తి గారూ, మీరు కావాలనుకుంటే ప్రభుత్వం ఆ భవనాలు స్వాధీనం చేసుకుని కేంద్ర కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వుండొచ్చు. లేదంటే తలదాచుకోవడానికి నీడ లేనివారికి కేటాయించి వుండొచ్చు. అసలు ఆ ఫ్లాట్ల యజమానులే జరిమానా కట్టడానికి సిద్ధమయ్యారు. కాని దానికి మారుగా మీరు చేసిందేమిటి? మొత్తం కూలగొట్టించారు. ఆ కూల్చివేతకూ శిథిలాల తొలగింపునకు కేరళ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేయవలసి వచ్చింది. ఈ భవనాల కూల్చివేత సందర్భంగా అటూ ఇటూ దెబ్బ తిన్న ఇళ్లలో వారు ప్రభుత్వం నుంచి ఒత్తిడి చేస్తున్నారు. చట్టంలో అందకు అవకాశం లేకున్నా సరే మీ పి.ఎఫ్‌ నుంచి కొంత మొత్తాన్ని అందుకోసం వెచ్చించాలి. ఈ దుర్మార్గమైన చట్టానికి మీరొక్కరినే నిందించదల్చలేదు.
మీపై అధికారులు జోక్యం చేసుకుని కూల్చివేతను ఆపాల్సింది. కాని ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తి తనపై కోర్టు ఉద్యోగిని చేసిన లైంగిక ఆరోపణల నుంచి బయిటపడటమెలాగని తలమునకలవుతున్న స్థితి. ఈ అపార్ట్‌మెంట్‌ యజమానుల కష్టాల గురించి ఆలోచించే స్థితి ఆయనకెక్కడ వుంటుంది? ఇప్పుడు మోడీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పర్యావరణ చట్టాల ప్రకారం ఆ భవనాలను అక్కడే నిరభ్యంతరంగా కట్టుకోవచ్చని మీకు తెలుసా? ఆ సంగతి విన్నప్పుడు మీకు సిగ్గేయడం లేదా? కాని సిగ్గెందుకు వేస్తుంది? మీరు పూర్తిగా మీ అంతరాత్మను బట్టి వ్యవహరిస్తారే గాని వాస్తవాలతో మీకు పనిలేదు కదా!
ఎవరైతే అత్యంత అహంభావులుగా వుంటారో సరిగ్గా అలాంటివారే తమ పైవారి పట్ల వీర విధేయులుగా లోబడి పోతారని నేను గమనించాను. మీరు కూడా అంతే. మినహాయింపు కాదు.
ఫిబ్రవరిలో జరిగిన ఒక అంతర్జాతీయ న్యాయసదస్సులో మీకు మీ న్యాయ సిద్ధాంతాలను వినిపించే అవకాశం కలిగింది.అన్నీ ఈ దేశంలోనే పుట్టాయని చెప్పడం ఇప్పుడు ఆనవాయితీగా మారినట్టే మీరు కూడా మాట్లాడారు. కొన్ని వర్గాల ప్రజలు అంటరాని వారని మాత్రమే గాక వారిని చూసినా పాపమని చెప్పే ఈ దేశం లోనే మానవ హక్కులు, శాసనబద్ధ పాలన ప్రభవించాయని మీరు ప్రవచించారు! మీరు నరేంద్ర మోడీని మహా మేధావిగా అభివర్ణించారు. అంతర్జాతీయ ప్రశంసలు పొందిన దార్శనికుడు అన్నారు. బహుశా మీ పొగడ్తలు మోడీకి కూడా ఇబ్బంది కలిగించి వుంటాయి. ఆయన పని అయిపోయిందని ఆ పార్టీలో వారే చాలా మంది అనుకుంటున్నారు. ఎలా వదిలించుకోవాలో వారికి తెలియడం లేదు. మీ ప్రసంగం చదివాక మాజీ న్యాయమంత్రి అరుణ్‌ జైట్లీ మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. జడ్జిలు పై తరగతులలో తిరుగుతూ బయోడేటా పంచి పెడుతుంటారని ఆయనన్నారు. సమాచార కమిషనర్లు తప్పనిసరిగా మాజీ న్యాయమూర్తులై వుండాలని, ఉత్తర్వు ద్వారా తమకు పదవులు సృష్టించుకున్నారని చెప్పారు. మోడీని మీరు పొగడ్డం పదవీ విరమణానంతర అవకాశాల కోసమేనని నాకు అనిపించింది. సారీ.
రంజన్‌ గొగోరు పదవీ విరమణ చేసిన వెనువెంటనే ఆయనకు మోడీ రాజ్యసభ సీటిప్పించారు. బిజెపి అసోం ముఖ్యమంత్రి అభ్యర్థి అనీ చెబుతున్నారు. హోం మంత్రి అమిత్‌ షా ప్రమేయం వున్నట్టు చెప్పబడే సొరాబుద్దీన్‌ దంపతుల కేసు విచారిస్తున్న జస్టిస్‌ బి.హెచ్‌ లోయా అంతుపట్టని రీతిలో మరణించిన కేసు విచారణకు మిమ్మల్ని ఎంపిక చేయడంతో మీరు అందరి దృష్టి లోకి వచ్చారు. రాజకీయంగా ప్రాధాన్యత గల కేసులు మీకే కేటాయించడంపై ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తులు తిరుగుబాటు చేసిన తర్వాత మీరు ఆ కేసు నుంచి తప్పుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోరు తనపై వచ్చిన కేసునే విచారించడానికి తన ఆధ్వర్యంలోనే ధర్మాసనం ఏర్పాటు చేసి మిమ్మల్ను తీసుకున్నప్పుడు దేశమంతా నిర్ఘాంతపోయింది. మీకేమాత్రం సిగ్గు, బిడియం వున్నా ఆ ధర్మాసనంలో వుండేవారు కాదు. 'న్యాయ వ్యవస్థ పైనే నీలి నీడలు ప్రసరించిన జస్టిస్‌ మిశ్రాకు వీడ్కోలు' అంటూ ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా శర్మ రాసిన వ్యాసం చదవమని నేను స్నేహితులకు చెబుతున్నాను. అలాగే ప్రశాంత్‌ భూషణ్‌కు జరిమానా వేసి ఖజానాకు ఒక రూపాయి సమకూర్చిన మీ ఆఖరి కానుక గురించీ చెప్పనివ్వండి. మీ మాజీ అధిపతిపై ఆరోపణల వివరాలు ప్రచురించకుండా మీడియాను నిరోధించడం ద్వారా మీరు చేయని ధిక్కారం ఏమిటి? ఆయన చేసిందేమిటి? ఆ రూపాయి వసూలు చేయడానికి మీరెంత డబ్బును, సమయాన్ని వృధా చేశారో తెలుసా? కాశ్మీర్‌ 370వ అధికరణం రద్దు గురించి చర్చించడానికి సమయం లేదంటూ చేసింది ఇది.
ఇప్పుడు మీరు రిటైరై పోయారు. ఏ గవర్నరు పదవో లేక ఏదైనా చైర్మన్‌ పదవో మీకు దక్కవచ్చు. ఇది పశ్చాత్తాప పడవలసిన సమయం. మీ వల్ల ఎందరి జీవితాలో నాశనమైన దానికి ప్రాయశ్చితం చేసుకోవలసిన తరుణం మిస్టర్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా.
మీ వగైరా వగైరా..
                                                                                                                                     * ఎ.జె. ఫిలిప్‌ (లేఖకుడు సీనియర్‌ జర్నలిస్టు, వ్యాఖ్యాత)