- కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవాలని సూచన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని పరిధిలో పూలింగు అనంతరం చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధుల సమీకరణలో సిఆర్‌డిఎ తిప్పలు పడుతోంది. వెంటనే కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పనుల కోసం అంచనాలు రూపొందించారు. దీనికి ఇప్పటికిప్పుడు రూ.3,500 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టారు. అంత నిధులు లేకపోవడంతో బ్యాంకర్లను ఆశ్రయించారు. గతంలో ఇచ్చిన అప్పులకు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి. దీంతోపాటు మళ్లీ లోను ఇస్తే వచ్చే ఆదాయాలపై గ్యారెంటీ ఏమిటని బ్యాంకర్లు ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని, తాము ఇచ్చే రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని కోరారు. దీనికోసం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వాలని సూచించారు. దీనికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందా లేదా అన్నదే ప్రశ్నగా మారింది. దీనికితోడు బ్యాంకర్లు గ్యారెంటీ కోరడంతో సిఆర్‌డిఎ ఆలోచనలో పడింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం 2016 నుంచి ఇప్పటి వరకూ ప్లానింగు విభాగం ద్వారా వస్తున్న ఆదాయం రూ.300 కోట్లు దాటలేదు. అటువంటప్పుడు ఆదాయాన్ని ఎలా చూపించాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని బ్యాంకర్లు సూచించడంతో సరైన సమయంలో రీపేమెంట్ చేయకపోతే సమస్యగా తయారవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పష్టమైన ఆదాయం చూపించడం ఎలాగనే అంశంపై సిఆర్‌డిఎ అధికారులకు కూడా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో తాత్కాలిక అవసరాలకు రూ.3,500 కోట్లు ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. మరోవైపు సిఆర్‌డిఎకు ఉన్న సొంత ప్లాట్లను ఈ వేలం ద్వారా అమ్మకానికి పెట్టారు. తొలి విడతలో రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ నిధులతో సదుపాయాలు కల్పించడం ఏ మాత్రమూ సాధ్యం కాదు. తాత్కాలిక పనులు చేస్తున్నామని చెప్పుకోవడానికి మినహా ఆ నిధులు సరిపోవని ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఇ-ఆక్షన్‌కు కూడా అంత స్పందన లేదని తెలిసింది. 29 ప్లాట్లు వేలం పెడితే ముందురోజు వరకూ ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ రూపంలో వచ్చే ఆదాయంపై అధికారులు అంత నమ్మకంగా లేరు. మరోవైపు కోర్టుకు వివరాలు సమర్పించాల్సి వస్తే, ఎలా సమర్పించాలనే అంశంపై న్యాయ విభాగ అధికారులు కూడా వారివంతు ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతున్న నేపథ్యంలో నిధులు వస్తాయా? రావా? అనేది ప్రశ్నార్థకమైంది.










