May 31,2022 08:54

ప్రజాశక్తి-యంత్రాంగం : నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లె గ్రామానికి చెందిన చల్లపల్లె పుల్లారెడ్డి, లక్ష్మీదేవి దంపతుల ద్వితీయ సంతానం యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి సివిల్స్‌లో 15వ ర్యాంక్‌ సాధించారు. యశ్వంత్‌ తండ్రి పుల్లారెడ్డి కడప జిల్లా రాజుపాలెం మండలం కూలూరు కొట్టాల గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. యశ్వంత్‌ 6 నుండి 10వ తరగతి వరకు కడప జిల్లా రాజంపేటలోని జవహర్‌ నవోదయ పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్‌ విజయవాడ శ్రీచైతన్యలో చదివారు. కాకినాడ జెఎన్‌టియులో బిటెక్‌ పూర్తి చేసి బంగారు పతకం సాధించారు. బిటెక్‌ అనంతరం ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ బెంగుళూరులో ఉద్యోగం చేశారు. 2020 యుపిఎస్‌సిలో 93వ ర్యాంకు సాధించి ఐపిఎస్‌కు ఎంపికయ్యారు. ఎలాగైన ఐఎఎస్‌ సాధించాలని పట్టుదలతో శిక్షణ తీసుకుంటూ సివిల్స్‌లో 15వ ర్యాంకు సాధించారు. నంద్యాలకు చెందిన వి.మనీషా జాతీయ స్థాయిలో 154వ ర్యాంకు సాధించింది.

                                                         ఐదో ప్రయత్నంలో విజయం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన ఎంఎస్‌.భరద్వాజ్‌ సివిల్స్‌లో 28వ ర్యాంకు సాధించారు. వరంగల్‌లో నిట్‌ పూర్తి చేశారు. 2017 నుంచి ఢిల్లిలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంటున్నారు. నాలుగు ప్రయత్నాల్లో విఫలం కాగా.. ఐదో ప్రయత్నంలో విజయం సాధించారు. తండ్రి ప్రసాద్‌ గొలుగొండ మండలంలో ప్రభుత్వ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయునిగా, తల్లి హెల్త్‌ డిపార్టుమెంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
 

                                                       అమెరికాలో జాబ్‌ వదులుకొని..

విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామానికి చెందిన పూసపాటి సాహిత్య సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి జగదీష్‌వర్మ, తల్లి పద్మజ కొంతకాలంగా వీరు విశాఖలో నివాసముంటున్నారు. ఆమె తల్లితండ్రులు జగదీష్‌వర్మ, తల్లి పద్మజ. సాహిత్య తాత పూసపాటి కృష్ణంరాజు కథకుడు, నాటక ప్రయోక్త. సాహిత్య చదువంతా విశాఖలోనే సాగింది.భీమవరంలో బి.ఫార్మసి చదివి గోల్డ్‌మెడల్‌ సాధించారు. తరువాత అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆమె సివిల్స్‌పై ఆసక్తితో విశాఖకు తిరిగి వచ్చేశారు. నాలుగో ప్రయత్నంలో ఆమె ర్యాంకు సాధించారు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడుకు చెందిన మనోజ్‌ కుమార్‌ 157వ ర్యాంకు సాధించారు. గుంటూరు శ్యామలనగరానికి చెందిన అశ్విన్‌ మణిదీప్‌ 235వ ర్యాంకు సాధించారు.