మద్యం షాపు వద్దని నిరసన
ప్రజాశక్తి బిట్రగుంట : బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ పరిధిలోని ఇబ్రహీంపేటలో మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ వివిధ ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు షేక్ నూరుద్దీన్, జై భీమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, బత్తుల రవిచంద్ర, మానవ హక్కుల పరిరక్షణ సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దాసరి సునీల్ మద్యంషాపు ఏర్పాటును తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. మద్యం షాపు ఏర్పాటు చేసే ముందు పక్కనే ఉన్న ఐటిఐ కాలేజీ, దాని పక్కనే వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం గుడి ఉన్నందున అక్కడికొచ్చే మహిళా భక్తులకు, కాలేజీ విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందని వారన్నారు. కాలేజీ, గుడిలో మధ్యలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కావలి శాసనసభ్యులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పునరాలోచించుకోవాలని, మద్యంషాపును గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని, ఈ సమస్యను విశ్వనాథరావుపేట సర్పంచి గండూరు మంజులకు వినతి పత్రాన్ని సమర్పించి సమస్యను వివరించారు. కార్యక్రమంలో స్థానికులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కె.శ్రీనివాసులు, అహమ్మద్, నవీద్, బొంత సుధీర్, తిరుపతి, సాగర్, పైడి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










