Nov 16,2021 07:13

గోదాములు ఖాళీ లేనందున రైతుల పంటలను కనీస మద్దతు ధర (ఎం.ఎస్‌.పి)కు కొనుగోలు చేసేది లేదన్న కేంద్ర ప్రభుత్వ ఒక్కాణింపు పరమ దుర్మార్గమైనది. ఒకవైపు అన్ని పంటలకూ ఎంఎస్‌పిని వర్తింపజేయడంతో పాటు చట్టబద్ధత కల్పించాలని లక్షలాది రైతులు ఏడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి ఆందోళన చేస్తుండగా, అస్సలు ధాన్యాలను కొనుగోలు చేసేదే లేదనడం, గోడౌన్లను సాకుగా పేర్కొనడం అన్నదాతల పట్ల, వ్యవసాయం పట్ల మోడీ ప్రభుత్వ కర్కశానికి నిదర్శనం. సర్కారీ నిర్ణయం రైతులకు ఎంఎస్‌పి లేకుండా చేసే మూడు వ్యవసాయ చట్టాల అమలుకు దొడ్డిదారి ప్రయత్నం. ఖరీఫ్‌ పంటలు మార్కెట్‌కొచ్చే వరకు గోదాముల్లోని నిల్వలను ఖాళీ చేయించాల్సింది ప్రభుత్వమే. ఉద్దేశపూర్వకంగా గోడౌన్లలో నిల్వలను కదలనీకుండా, ముక్కపెట్టేందుకైనా సిద్ధపడుతూ, ఆ పేరుతో కొత్త పంటలను కొనుగోలు చేయకుండా చేతులు కట్టేసుకోవడం వెనుక పెద్ద కుట్రే దాగుంది. ఆహార ధాన్యాలు అంత పెద్ద మొత్తంలో గోడౌన్లలో మూలగడానికి హేతువు ఏమిటి? తిండి గింజలు ఇస్తామంటే ప్రజలు వద్దన్నారా? ఆహారం ఇస్తామన్నా తిరస్కరించేంత స్తోమతలో ప్రజలు ఉన్నారా అనే ప్రశ్నలకు సరైన సమాధానాలను మోడీ ప్రభుత్వం విశదీకరిస్తే అసలు బండారం బయట పడుతుంది.
మొన్ననే వెలువడిన వరల్డ్‌ హంగర్‌ ఇండెక్స్‌లో ఆకలి సమస్యను ఎదుర్కొంటున్న దేశాల్లో మనల్ని ఎక్కడో అట్టడుగున నిలిపింది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక కంటే కూడా మన పరిస్థితి అధమం. పౌష్టికాహారం లోనూ భారత్‌ది అదే పరిస్థితి. బాధ్యత గల ప్రభుత్వం ప్రజల ఆకలిని తీర్చేందుకు ఉపక్రమించి యుద్ధ ప్రాతిపదికన ఆహార ధాన్యాలను సేకరించి ఉచితంగా పంచాలి. బిజెపి సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా ధాన్యాలను ముక్కపెట్టడానికి, ఎలుకలు, పందికొక్కుల పరం చేయడానికైనా సిద్ధం తప్ప ప్రజలకు మాత్రం ఇవ్వనంటోంది. కరోనా వలన కోట్లాది మంది అంతకంతకూ పేదరికంలోకి జారుతూ తిండికి అలమటిస్తుండగా ఈ నవంబర్‌ వరకే ఉచిత రేషన్‌ అని భీష్మించింది. ఏడేళ్లలో ప్రజల తలసరి ఆహార వినియోగం 9 శాతం తగ్గిందని నేషనల్‌ శాంపిల్‌ సర్వే బహిర్గతం చేసింది. పేదరికం పెరుగుతోందని, ఆకలి భారతం నిర్మాణమవుతోందని నిర్ధారించడానికి ఇంతకంటే కొలబద్దలు అక్కర్లేదు. ఈ కాలంలో ఆహార పంటల ఉత్పత్తి పెరిగిందేమీ లేదు. సగటున 25-29 మిలియన్‌ టన్నుల మధ్య ఊగిసలాడుతోంది. ఉత్పత్తి పెరగకుండానే గోదాముల నిండా పాత నిల్వలను పేరబెట్టడం ప్రభుత్వ విధానంలో భాగం తప్ప దానంతట అది వచ్చిన తక్షణ సమస్య కాదు.
స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో రైతులు పండించిన ఆహార ధాన్యాల్లో ప్రభుత్వం ఎంఎస్‌పిపై కొంటున్నది 30-32 శాతం మాత్రమే. మిగతాదంతా రైతులు అయిన కాడికి అమ్ముకొని నష్టాల పాలవుతున్నారు. ఎంఎస్‌పి వర్తించే పంటల సంఖ్య పట్టుమని పాతికకు మించలేదు. ఇంత దారుణంగా రైతుల పరిస్థితి ఉండగా, ఇప్పుడున్న అరకొర భద్రతను సైతం అన్నదాతలకు లేకుండా చేస్తోంది మోడీ ప్రభుత్వం. రైతులు పంట పండించడానికి పెట్టే ఖర్చుకు యాభై శాతం కలిపి ఎంఎస్‌పి ఇవ్వాలని స్వామినాథన్‌ సిఫారసు చేయగా, ఆ సూచనను అమలు చేయలేమని ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది. ఇప్పుడు మొత్తానికే ఎంఎస్‌పికి ఎసరు పెట్టేందుకు కొత్త చట్టాలు తెచ్చింది. వాటి అమలును పట్టాలెక్కించే కుతంత్రంలో భాగమే సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ (సిడబ్ల్యుసి) ఆస్తుల మోనిటైజేషన్‌. ఇప్పటికే ప్రొక్యూర్‌మెంట్‌ డీసెంట్రలైజేషన్‌తో ఎఫ్‌సిఐ నిర్వీర్యమైంది. ఎఫ్‌సిఐకి నిధులివ్వకుండా, బకాయిలు పెట్టి సర్కారే సంస్థను అప్పుల పాల్జేసింది. రైతుల పంటల కొనుగోళ్ల బాధ్యత నుండి వ్యూహాత్మకంగా తప్పుకుంటోంది. ఒకే జాతి-ఒకే రేషన్‌ కార్డు, నగదు బదిలీ వంటి చర్యలు ఆహార ధాన్యాల సేకరణ, మార్కెట్‌, పంపిణీపై ప్రభుత్వానికి ఉన్న బాధ్యత నుండి తప్పించేవి. అంతిమంగా కార్పొరేట్లు ఆ రంగాలపై పట్టు బిగించడానికి, విచ్చలవిడి దోపిడీకి తోడ్పడేవి. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రజల ఆహార భద్రతకు, రైతు మనుగడకు పెనుముప్పు. తెలంగాణలో వరి వద్దన్నా, ఎ.పి లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమన్నా కేంద్ర మార్గదర్శకంలోనే. తమ ప్రజల ప్రయోజనాలకు హాని చేసే కేంద్ర విధానంపై రాష్ట్రాలు నిలదీయాలి. తమవి రైతు సంక్షేమ ప్రభుత్వాలని నిరూపించుకోవాలి.