ప్రధానమంత్రి నరేంద్రమోడీ పండుగల వేళ చేసిన ప్రసంగం దేశ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కరోనా వైరస్ విజృంభణకు అడ్డుకట్ట వేసే విషయంలో ప్రధాని కొత్తగా చెప్పిందేమీ లేదు. కుప్ప కూలిన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలివ్వడానికి ఏం చేయనున్నారో ఆయన చెప్పలేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయి రేపటిపై బెంగతో దీనాలాపనలు చేస్తున్న కోట్లాదిమందికి బతుకుపై భరోసా ఇవ్వలేదు. కోవిడ్ కాటుతో ఆత్మీయులను దూరం చేసుకుని గుప్పెడు దు:ఖంలో మునిగిపోయిన వారికి అండగా ఎలా ఉంటారో వివరించలేదు. పోనీ, వైరస్‌తో ముందువరసలో నిలబడి పోరాటం చేస్తున్న వైద్య, పారిశుధ్య సిబ్బందికి అవసరమైన మనోధైర్యాన్ని నింపే ప్రయత్నమూ చేయలేదు. ఊరించి, ఊరించి చేసిన ప్రసంగంలో ఆయన చెప్పింది మూడే ముక్కలు! 'మాస్కులు వాడండి..భౌతిక దూరం పాటించండి..చేతులు తరచూ శుభ్రం చేసుకోండి' అని!! కొన్ని నెలలుగా మొబైల్ ఫోన్లలో రింగ్‌టోన్లగా వినపడుతున్న మాటలు ఇవే! ఆ మాటలే చెప్పి సరిపెట్టడం ప్రధాని స్థాయి వ్యక్తికి ఏమాత్రం తగదు! కాకపోతే, చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం వంటి టాస్క్‌లను దేశ ప్రజలకు ఇవ్వకపోవడాన్నే కొంత ఊరటగా భావించాలి. ప్రధాని తన ప్రసంగంలో అగ్ని శేషం, శత్రు శేషం, రోగ శేషం ఉండకూడదన్నారు. కరోనా కష్టకాలంలో అప్పుల బారిన పడని సామాన్య కుటుంబాలు దేశంలో లేవేమో! ఆ మేరకైనా వారిని రుణ విముక్తి చేసే కార్యాచరణేమీ కేంద్ర వద్ద లేదు కాబట్టే రుణ శేషం గురించి ప్రధాని ప్రస్తావించలేదని భావించాలి.
దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్యలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నాం. వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే అమెరికాను కూడా అధిగమించి మొదటి స్థానంకు చేరుకుంటామన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుదలలో స్థిరత్వం లేదు. బుధవారం ఉదయం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తగ్గుదలకు బ్రేక్ పడింది. గడిచిన 24 గంటల్లో 54,044 కేసులు నమోదయ్యాయి. గత నాలుగైదు రోజులతో పోల్చుకుంటే ఈ సంఖ్య ఎక్కువ! రెండు, మూడు రోజులుగా 600 లోపే చోటుచేసుకుంటున్న మరణాలు బుధవారం 700 దాటాయి. రోజువారీ కేసులతో పాటు, మరణాలూ పెరగడం ఆందోళన కలిగించే విషయం. అమెరికాతో పాటు అనేక దేశాల్లో వైరస్ రెండవ విడత విజృంభణ ప్రారంభమైందన్న అంచనాల నేపథ్యంలో రానున్న రోజుల్లో మన దేశంలో ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇప్పటికే, కొన్ని రాష్ట్రాల్లో సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు బాహాటంగానే చెబితే, ప్రధాని మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు ఎందుకనో..?
అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకులు ఆగస్టులో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఒక్క నిర్మాణ రంగంలోనే దేశ వ్యాప్తంగా 41 లక్షల మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయారు. మరో అధ్యయనం ప్రకారం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో దేశ వ్యాప్తంగా 12.20 కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి. వివిధ రంగాల మీద ఆధారపడి ఉపాధి పొందుతున్న ప్రతి పది మందిలో ఒకరి జీవనానికి గండి పడింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం లాక్‌డౌన్ సడలింపుల తరువాత సెప్టెంబర్‌లో 51 లక్షల మంది తిరిగి ఉపాధి, ఉద్యోగాలను పొందారు. అయితే, ఇవన్నీ ఏమాత్రం భద్రత లేనివే! వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఐపిఎస్‌ఒఎస్ లు బుధవారం విడుదల చేసిన నివేదికలో భారత్ లోని 57 శాతం మంది ఉద్యోగులు రానున్న ఏడాది కాలంలో తమ ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారని పేర్కొన్నాయి. వీరిలో అత్యధికులు యువకులే! యువతరం ఇలా నిర్వేదంలో చిక్కుకుంటే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? కరోనా నియంత్రణ ఎంత ముఖ్యమో, ఆర్థిక రంగాన్ని పట్టాలెక్కించి, ప్రజానీకంలో భవితపై భరోసాను నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశలో పటిష్టమైన కార్యాచరణ రూపొందించకుండా, ఉత్త మాటలతో కాలహరణం చేస్తే ప్రయోజనం శూన్యం!










