Jan 04,2022 08:19
  • 'ఆ' మూడు సంస్థలు ఒకే గొడుగు కిందకు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ధాన్యం సేకరణ బాధ్యతలను పూర్తిస్థాయిలో మార్క్‌ఫెడ్‌కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ధాన్యం సేకరణతో పాటు, చెల్లింపులను కూడా రానున్న రోజుల్లో ఆ సంస్థే నిర్వహించనుంది. మార్క్‌ఫెడ్‌, ఆయిల్‌ఫెడ్‌లతో పాటు, పౌరసరఫరాల సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. పౌరసరఫరాల సంస్థలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై పనిభారం, ఒత్తిడి పెరుగుతున్నా, కొత్తవారిని నియమించు కోవడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగల్‌ ఇవ్వడం లేదు. దీంతో సిబ్బంది విశ్రాంతి లేకుండా ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో మార్క్‌ఫెడ్‌, ఆయిల్‌ఫెడ్‌ సంస్థలను కూడా విలీనం చేస్తే ఆహారధాన్యాల సేకరణ, దానికి సంబంధించిన చెల్లింపులు, సమన్వయం సక్రమంగా, మరింత వేగంగా నిర్వహించవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా విలీనం తరువాత మార్క్‌ఫెడ్‌కు అప్పగించాల్సిన బాధ్యతలపై అధికారులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సమన్వయ బాధ్యతలను పౌరసరఫరాల సంస్థ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో ధాన్యం సేకరణ బాధ్యతలను ఈ ఏడాదే అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మూడు జిల్లాలోనూ ధాన్యం సేకరణ సక్రమంగా జరగడం లేదని ఆర్‌బికెలు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదని, ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని రైతుల నుండి ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.