వాల్‌పోస్టరును ఆవిష్కరిస్తున్న దృశ్యం
మార్చి 2 నుంచి శ్రీతల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు
నెల్లూరు:వచ్చే మార్చి మాసం 2వ తేదీ నుండి జరగనున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మౌత్సవాల్లో అందరూ కలిసికట్టుగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి విజయవంతం చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారి ఏ. మలోల అధికారులకు సూచించారు.శనివారం ఉదయం నగరంలోని రంగనాయకులపేటలో వెలసివున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మౌత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఆర్డీవో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నగరంలో పినాకిని నదీ తీరాన వెలసి ఉన్న ఉత్తర శ్రీరంగ క్షేత్రం గా కీర్తించబడే క్షేత్రాదీశులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మౌత్సవాలు వచ్చే మార్చి మాసం 2 వ తేదీ నుండి 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయన్నారు.ఈ ఉత్సవాలను అన్ని ప్రభుత్వ శాఖలు వారికి అప్పగించిన పనులను బాధ్యతాయుతంగా నిర్వహించి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వచ్చే మార్చి మాసం 2 వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ జరుగుతుందని 3 వ తేదీన ఉదయం ధ్వజారోహణం, రాత్రి శేష వాహనం, 4 వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి హంస వాహనం, 5 వ తేదీన ఉదయం సింహ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 6 వ తేదీన ఉదయం పల్లకి, రాత్రి హనుమంత సేవ, 7 వ తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రి బంగారు గరుడసేవ జరుగుతాయన్నారు. అలాగే 8 వ తేది సాయంత్రం పూలంగి సేవ, కళ్యాణోత్సవం, గజ వాహన సేవ, 9వ తేదీన రథోత్సవము, 10 వ తేదీన అశ్వ వాహనము, 11వ తేదీన పుణ్యకోటి విమానము, 12వ తేదీన పుష్పయాగము, 13వ తేదీ రాత్రి తెప్పోత్సవము నిర్వహించడం జరుగుతుందన్నారు.జిల్లా నుండే కాక వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు విరివిగా బ్రహ్మౌత్సవాల్లో పాల్గొంటున్న దష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.ముఖ్యంగా వేసవికాలం కాబట్టి ఆలయంలో చలువ పందిళ్లు మంచినీటి సరఫరా పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. అంతే కాకుండా క్యూ లైన్లు, విద్యుత్ అలంకరణ, ప్రత్యేక దర్శనమునకు క్యూలైన్లు, సాంస్కతిక కార్యక్రమాలు, పారిశుధ్యం,ఉచిత ప్రసాదాల వితరణ ఏర్పాటు చేయాలన్నారు. క్యూ లైన్ల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని ముందుగా నియమించుకోవాలన్నారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకించి ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ను, మహిళ పోలీసులను కూడా ఏర్పాటు చేయాలన్నారు.ముఖ్యంగా రథోత్సవం, తెప్పోత్సవం రోజుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. రైల్వే గేటు వద్ద నుండి సంతపేట నాలుగు కాళ్ల మండపం వరకు ప్రమాదాలు నివారించేందు కోసం పోలీస్ బందోబస్తు, రోప్ పార్టీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతరంగా అందించే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. రథోత్సవం రోజున రధం తిరిగే ప్రాంతంలో అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను, టెలిఫోన్ తీగలను తొలగించాలన్నారు. అవసరమైనంత విద్యుత్ శాఖ ఈ సమావేశంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ముమ్మడి వెంకటేశ్వర ప్రసాద్, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఇలపాక శివకుమార్ ఆచారి, నగర తాసిల్దారు నిర్మలానంద బాబా, దేవస్థానం కార్య నిర్వహణ అధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు, ఆర్డిఓ కార్యాలయం భూసేకరణ తాసిల్దారు మల్లికార్జునరావు, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తదితర అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం అర్చకులు పాల్గొన్నారు










