రాయచోటి : జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలు విస్తారంగా ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో 89, 657 ఎకరాలలో మామిడిని పంటను సాగైంది. ముఖ్యంగా రైల్వేకోడూరు, రాజంపేట, పెనగలూరు, చిట్వేలి, గాలివీడు, చిన్నమండెం, కలకడ, కలికిరి, పీలేరు, కె.వి. పల్లి, వాయల్పాడు ప్రాంతాల్లో రైతులు అధికంగా మామిడి తోటలు వేశారు. ఈ సారి కాపు బాగా వచ్చి ఆదాయం పొందవచ్చని ఆశించారు. ఇటీవల కురిసిన అకాల వర్షం వల్ల పూత రాలిపోవడంతో అనుకున్నంత స్థాయిలో పంట రాకపోవడంతో రైతులు కుదేలయ్యారు. అంతో ఇంతో పంట కాపుకొచ్చిన్నప్పటికీ కొంత మేరకు తెగుళ్లు రావడం వల్ల పంట కొంత దెబ్బతింది. అయినప్పటికీ మార్కెట్‌లో మామిడి కాయలు వివిధ ప్రాంతాల నుంచి రాయచోటి మండీలకు చేరుకున్నాయి. వ్యాపారులు కొనేవారిని ఆకర్షించే విధంగా కార్బైడ్ అనే ద్రావణంలో కాయలు ముంచి మాగా పెడుతుంటారు. మరికొందరు వ్యాపారులు త్వరితగతిన కాయలు మాగేలా కార్బైడ్‌ను పొట్లంలో కట్టిపెట్టి మామిడికాయల బాక్సులు పెట్టడం వల్ల రెండు రోజులకే అవి మంచి వర్ణం వస్తాయి. అలాంటి మామిడి పండ్లను మార్కెట్లో వ్యాపారులు తోపుడు బండ్లు గంపల్లో పెట్టి కేజీ రూ. 80 నుండి వంద చొప్పున విక్రయిస్తున్నారు. మామిడి పంట సాగుకు అధిక ఖర్చులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది పంట కూడా సరిగ్గా రాలేదని వ్యాపారస్తులు కూడా కొనడానికి ముందుకు రావడంలేదని వాపోతున్నారు. వచ్చిన అరకొర కాయలను వ్యాపారస్తులు మామిడికాయలు రేట్లు లేవని రైతుల దగ్గర అతి తక్కువ రేటుతో తీసుకొని మార్కెట్లలో అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. మామిడి పండ్లు రంగులో ఉన్నప్పటికీ తింటే అంత రుచిగా ఉండటం లేదు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చెట్లకు మాగిన పండ్లను గడ్డి, బోధ వంటి మధ్యలో కాయలు పెట్టి మగ పెడతారు. అవి ఎంతో రుచిగా రంగుతో తినడానికి ఆరోగ్యకరంగా ఉంటాయి. కానీ నేడు మార్కెట్లో రసాయానాలతో మాగిన పెట్టి పండ్లను విక్రయిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఫుడ్ కంట్రోల్ అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. రాయచోటి నుంచి బెంగళూరు, ముంబాయి, చెన్నై ,హైదరాబాద్ వంటి ప్రాంతాలకు మామిడి పండ్లు కాయలు ఎగుమతి అవుతున్నాయి. ఎక్కువగా బెనిష, మలుగూబ , బెంగళూరు ,రాళ్లవారి మామిడికాయలు ఎక్కువ సంఖ్యలో రైతులు పండిస్తున్నారు.
మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నాం
గ్రామీణ ప్రాంతాలలో చాలామంది రైతులు మామిడి తోటలపైనే ఆధారపడి జీవిస్తున్నాం. నాలుగేళ్లుగా సరైన ఆదాయంలేదు. మామిడి తోటలకు దున్నడం, చెట్లకు పాదులు తీయడం, నీరు కట్టడం, ఎరువులు, మందులు, కూలీలు ఖర్చులు అధికమయ్యాయి. గత సంవత్సరం గాలి, వర్షాల వల్ల మామిడి కాయలు రాలిపోయి చెట్లు కూడా విరిగిపోయాయి. వాటికి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం రైతులకు అందించాలి.
-రమణారెడ్డి, రైతు, మాధవరం , రాయచోటి మండలం










