Loksabha : ఆత్మ నిర్భరలో భాగంగానే విశాఖ ఉక్కు పెట్టుబడుల ఉపసంహరణ- కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి
న్యూఢిల్లీ : ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానం ద్వారా ప్రభుత్వరంగ సంస్థలు, ఉక్కు పరిశ్రమల్లో పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. లోక్‌సభలో ఎంపీలు రవికిషన్, ఎస్‌కే గుప్తా, సుభ్రతపాఠక్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కారద్ ఈ మేరకు సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్ - విశాఖ ఉక్కు పరిశ్రమ)లో పెట్టుబడులు ఉపసంహరించాలని ఈ ఏడాది జనవరి 27న కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుందని చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఖాయిలా పడిన ప్రభుత్వరంగ సంస్థల జాబితాలోకి రావని కేంద్రం పేర్కొంది. ఈ రెండు ఉక్కు పరిశ్రమలు ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్నాయని తెలిపింది. మరోవైపు విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తామని స్పష్టం చేసింది. లోక్‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ, ఉక్కుశాఖ ఈ మేరకు సమాధానమిచ్చాయి.










