ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ (విశాఖ) : ఎల్జి.పాలిమర్స్ కంపెనీకి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద భూముల కేటాయింపు, విశాఖలోని ఎల్జి పాలిమర్స్ స్థానంలో ఎల్జి ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతిచ్చే ఆలోచనను విరమించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖలోని సిపిఎం కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2020 మే 7న విశాఖలోని ఎల్జి పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో 15 మంది మరణించగా, 585 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారని, 30 పశువులు చనిపోయాయని తెలిపారు.
ఈ దుర్ఘటనకు ఎల్జి పాలిమర్స్ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ, జాతీయ గ్రీన్ ట్రీబ్యునల్ (ఎన్జిటి) కమిటీలు పేర్కొన్నాయని గుర్తు చేశారు. స్టైరిన్ గ్యాస్ లీకేజీపై ఎన్జిటి తీర్పును కూడా గౌరవించకుండా కంపెనీ యాజమాన్యం హైకోర్టులో వివాదం సృష్టించిందని, ఎన్‌జిటిలో తాత్కాలిక నష్టపరిహారం కింద జమ చేసిన రూ.50 కోట్లను వెనక్కి తిరిగి ఇవ్వాలని వివాదాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. 1996 నుండి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా, మన దేశ చట్టాలను అమలు చేయకుండా కంపెనీని నడుపుతోందని పేర్కొన్నారు.
ఇటువంటి బహుళజాతి కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రస్తుతమున్న కంపెనీ స్థానంలో ఎలక్ట్రానిక్స్ గృహోపరకరణాల తయారీ కంపెనీకి అనుమతిస్తే ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు హాని తలపెట్టినట్టేనని తెలిపారు. కృష్ణపట్నంలో భూములు కేటాయించడమంటే ఎల్జి పాలిమర్స్ యాజమాన్యనికి లంగినట్టేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పునారాలోచించి ఎల్జి పాలిమర్స్ భూములను స్వాధీనం చేసుకొవాలని, ప్రభుత్వ పెట్టుబడులతో స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరారు. గ్యాస్ లీకేజీ దుర్ఘటన సందర్భంగా మృతి చెందినవారిలో ముగ్గురికి నేటికీ నష్ట పరిహారం ఇవ్వలేదని, వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని, పంటలకు, పశువులకు నష్ట పరిహారం చెల్లించాలని, సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ నిర్మాణం చేపట్టాలని, కాంట్రాక్టు కార్మికులందరికీ 60 ఏళ్ల వరకు జీతాలు యాజమాన్యం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైపవర్ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్ పాల్గొన్నారు.










