Nov 13,2021 06:52

సుఖ్జీత్‌ సింగ్‌ కథనం ప్రకారం... ఆ ప్రాంతంలో స్థానిక రైతు నాయకుడైన తజిందర్‌ సింగ్‌ విర్క్‌ను లక్ష్యంగా పెట్టుకోవాలని మోనూ (ఆశిష్‌ మిశ్రా) అనుకున్నాడు. నల్ల జెండాల ప్రదర్శనలో పాల్గొనాలని ప్రజలను కోరుతూ విర్క్‌ ఒక వీడియోను విడుదల చేశాడు. మోనూ, అతని సహచరులు వీలైనంత ఎక్కువ మందిపై దాడి చేసే లక్ష్యంతో వచ్చారు. విర్క్‌ తీవ్రంగా గాయపడడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తర్వాత జరిగిన ఘర్షణల్లో కాన్వారులో ఉన్న నలుగురు మరణించారు. నిరసనను చిత్రీకరించడానికి వచ్చిన ఒక టీవీ జర్నలిస్ట్‌ రామన్‌ కాశ్యప్‌ను హత్య చేశారు. భుజానికి బుల్లెట్‌ తగలడం వల్ల అతడు చనిపోయాడు. కానీ, రైతులు తీవ్రంగా కొట్టడంతో, గాయాలై చనిపోయాడని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయి.

    తూర్పు ఉత్తరప్రదేశ్‌ లోని లఖింపూర్‌ ఖేరి హిందూత్వ రాజకీయాలకు యుద్ధభూమిగా మారింది. సిక్కు రైతులు అధికంగా ఉన్న ఆ జిల్లాను 'మినీ పంజాబ్‌' అనవచ్చు. సంవత్సరం క్రితం మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతు ఉద్యమం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ లలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది.ఈ ఉద్యమం ఇటీవల కాలంలో తూర్పు ప్రాంతానికి కూడా విస్తరించడంతో స్థానిక బిజెపి నాయకులు దీన్ని రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆటంకంగా భావిస్తున్నారు. బిజెపి నాయకులలో చోటుచేసుకున్న ఈ భావన, అక్టోబర్‌ 3వ తేదీన ఆ జిల్లాలో ఒక ఘోర సంఘటనకు దారి తీయడంతో కొన్ని రైతు కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడైన ఆశిష్‌ మిశ్రా తన సహచరులతో మూడు కార్లను రైతులపై తొక్కించిన సంఘటనలో నలుగురు రైతులతో పాటు మొత్తం 8 మంది మరణించగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా లోని బన్వీర్‌పూర్‌ కు చెందిన అజరు మిశ్రా రాజకీయాల్లోకి రావడానికి ముందు కలప, రసాయనాల అక్రమ రవాణా చేసేవాడు. గ్రామ పంచాయతీ ముందుకొచ్చే సమస్యల పరిష్కారానికి మిశ్రా, ఆయన కుమారుడు ఆశిష్‌ చట్టవిరుద్ధంగా దర్బార్‌ను నిర్వహించేవారు. అర్థబలం, అంగబలం వున్న కారణంగా ప్రజలు భయపడుతూనే వారిని గౌరవించేవారు. కానీ ధనిక సిక్కు రైతులు మాత్రం దర్బార్‌ కు హాజరయ్యేవారు కాదు. మిశ్రా 2010లో గ్రామ ప్రధాన్‌ గా ఎన్నికయ్యాడు. తర్వాత 2012లో నిఘాసన్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి, ఆ తర్వాత 2014, 2019లో వరుసగా ఎంపీగా ఎన్నికయ్యాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు స్థానం కల్పించారు.
 

                                                  నల్ల జెండాల ప్రదర్శన

తెరై ప్రాంతంలో పెరుగుతున్న రైతుల నిరసనలతో అజరు మిశ్రా కోపోద్రిక్తుడయ్యాడు. ఆయన రైతులను హెచ్చరిస్తున్న వీడియో బాగా వైరల్‌ అయింది. తాను తలచుకుంటే 'సర్దార్లను' లేకుండా చేస్తానని అన్నాడు. దానికి నిరసనగా రైతులు అక్టోబర్‌ 3వ తేదీన, లఖింపూర్‌ ఖేరి లో అజరు మిశ్రా నిర్వహించే కుస్తీ పోటీల వేదిక దగ్గర్లో నల్ల జెండాలను ప్రదర్శించి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య దృష్టికి కూడా ఆ సమస్యను తీసుకెళ్ళాలనేది రైతుల ఉద్దేశం. ఆశిష్‌ మిశ్రా, అతని సహచరులు నిరసన వేదిక దగ్గర ఉన్న రైతుల మీద నుండి కాన్వారుతో తొక్కించుకుంటూ వచ్చారు. కారు ఒక రైతును సుమారు 20 అడుగుల దూరం లాక్కెళ్ళింది. అతని శరీరం రెండు ముక్కలైందని సుఖ్జీత్‌ సింగ్‌ అనే రైతు నాయకుడు చెప్పాడు. 'ఆశిష్‌ మిశ్రా పేల్చిన ఐదారు రౌండ్ల బుల్లెట్‌ శబ్దాలను మేము విన్నాం. రైతులు ఆందోళన మొదలుపెట్టే సమయానికి అతడు తప్పించుకొని పారిపోయాడ'ని సుఖ్జీత్‌ సింగ్‌ చెప్పాడు. కోపోద్రిక్తులైన రైతులు కారును తగులబెట్టారు.
     సుఖ్జీత్‌ సింగ్‌ కథనం ప్రకారం, ఆ ప్రాంతంలో స్థానిక రైతు నాయకుడైన తజిందర్‌ సింగ్‌ విర్క్‌ను లక్ష్యంగా పెట్టుకోవాలని మోనూ (ఆశిష్‌ మిశ్రా) అనుకున్నాడు. నల్ల జెండాల ప్రదర్శనలో పాల్గొనాలని ప్రజలను కోరుతూ విర్క్‌ ఒక వీడియోను విడుదల చేశాడు. మోనూ, అతని సహచరులు వీలైనంత ఎక్కువ మందిపై దాడి చేసే లక్ష్యంతో వచ్చారు. విర్క్‌ తీవ్రంగా గాయపడడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తర్వాత జరిగిన ఘర్షణల్లో కాన్వారులో ఉన్న నలుగురు మరణించారు. నిరసనను చిత్రీకరించడానికి వచ్చిన ఒక టీవీ జర్నలిస్ట్‌ రామన్‌ కాశ్యప్‌ను హత్య చేశారు. భుజానికి బుల్లెట్‌ తగలడం వల్ల అతడు చనిపోయాడు. కానీ, రైతులు తీవ్రంగా కొట్టడంతో, గాయాలై చనిపోయాడని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయి. అయితే ఈ అబద్ధపు ప్రచారాన్ని జర్నలిస్టు సోదరుడు పవన్‌ కాశ్యప్‌ కొట్టిపారేశాడు. 'మార్చురీలో అతని వంటి మీద చూస్తే, కొట్టడం వల్ల అయిన గాయాలేమీ లేవు. అలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దు' అని పవన్‌ మీడియాను కోరాడు.
 

                                                        ఉద్రిక్త పరిస్థితి

ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో, రాష్ట్ర పాలనా విభాగం ఆ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోలీసు బలగాలను మోహరించాలని ఆజ్ఞలు జారీ చేసింది. టికూనియా పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేశారు. దాడి, హత్య చేసినందుకు ఆశిష్‌ మిశ్రాతో పాటు 13 మందిపై నేరం మోపుతూ కేసు నమోదు చేశారు. ఆ సంఘటన జరిగిన సమయంలో తన కుమారుడు అక్కడ లేడని అజరు మిశ్రా చెప్తుంటే, ఉన్నాడని సాక్షులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఐపిసి 144వ సెక్షన్‌ విధించి, ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. సమీప ప్రాంతాల నుండి వేల సంఖ్యలో రైతులు వచ్చారు. వివిధ పార్టీల నాయకులను సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించకుండా అడ్డుకున్నారు. రైతులపై జరిపిన అనాగరిక దాడిలో బాధిత రైతులను కలవకుండా రాజకీయ పార్టీలను అడ్డుకోవడం తప్ప బిజెపి ప్రభుత్వానికి వేరే ఏ పని లేదని...అధికారంతో ప్రజాస్వామ్యం గొంతు నొక్కిన తీరును తీవ్రంగా ఖండిస్తూన్నామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్‌ చేశారు. గతంలో జలియన్‌ వాలాబాగ్‌ లో సృష్టించిన పరిస్థితినే మళ్ళీ ఉత్తరప్రదేశ్‌లో చూస్తున్నాం. నేడో, రేపో వారు దానికి తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. ఇంకా వివిధ పార్టీల నాయకులు ఈ ఘోర సంఘటనను ముక్త కంఠంతో ఖండిస్తూ, దీనికి పాలక బిజెపి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.
     లఖింపూర్‌ ఖేరి సంఘటన రాష్ట్రంలో దిగజారుతున్న పాలనను రుజువు చేస్తుంది. సంఘీభావం తెలిపే క్రమంలో, ప్రతిపక్షాలన్నీ ఈ ఘటనపై ఏకం అవుతున్నాయి. బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ కూడా, రైతులను తొక్కిస్తూ వేగంగా వెళ్ళిన కార్ల వీడియోను షేర్‌ చేస్తూ, ఈ దృశ్యం ఎంతటి వారినైనా కదిలిస్తుందని, ఈ వీడియోను పరిగణలోకి తీసుకొని, నిందితులపైన చర్యలు తీసుకోవాలని ట్వీట్‌ చేశారు. తర్వాత ఆయనతో పాటు తల్లి మనేకా గాంధీని బిజెపి జాతీయ కౌన్సిల్‌ నుండి తప్పించారు.
     ఉత్తరప్రదేశ్‌ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఇదే ఐక్యతను కొనసాగిస్తే, బిజెపి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాని ఫలితమే కేంద్రంలో బిజెపి భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పాలనా యంత్రాంగానికి, రైతులకు మధ్య శాంతిని నెలకొల్పడంలో, తీక్షణతలను తగ్గించడంలో సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రధాన ప్రతినిధులలో ఒకరైన రాకేష్‌ టికాయత్‌ కీలక పాత్రను పోషించారు. అజరు మిశ్రాను మంత్రివర్గం నుండి తొలగించాలని, ఆయన కుమారుడిని అరెస్ట్‌ చెయ్యాలని, మరణించిన రైతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
     అక్టోబర్‌ 9వ తేదీన, 12 గంటల విచారణ అనంతరం స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)...నిందితులను అరెస్ట్‌ చేసి మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి పంపింది. డెంగ్యూ సోకిందని ఆశిష్‌ మిశ్రా ను అక్టోబర్‌ 24న జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. సుప్రీంకోర్టు ఈ సంఘటనను సూమోటోగా స్వీకరించి, అక్టోబర్‌ 26న ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి రమణ నేతృత్వంలోని సూర్యకాంత్‌, హిమా కోహ్లీ లతో కూడిన బెంచ్‌ ... ఈ హింసాయుత ఘటనకు సాక్షులుగా ఉన్నవారికి రక్షణ కల్పించాలని ఆదేశించింది. వందల వేల సంఖ్యలో ఉన్న ప్రజల నుండి కేవలం 23 మంది సాక్షాలను మాత్రమే నమోదు చేశారని బెంచ్‌ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
 

                                                       కుల దుర్మార్గం

అక్టోబర్‌ 15 న సింఘూ సరిహద్దు ప్రాంతంలో నిరసన వేదిక దగ్గర ఉన్న పోలీస్‌ బారికేడ్‌కు 35 సంవత్సరాల దళిత సిక్కు వ్యవసాయ కార్మికుని (లఖ్బీర్‌ సింగ్‌) శవం వేలాడదీసి ఉండడంతో రైతుల నిరసనలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అతని చెయ్యి తెగిపోయింది. శరీరంపై గాయాలయ్యాయి. నిహాంగ్స్‌ సిక్కు సభ్యుడైన సరబ్‌జిత్‌ సింగ్‌ ఈ ఘోరమైన నేరాన్ని చేసినట్లు ఒప్పుకున్నాడు. అతనితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారి పవిత్ర గ్రంథాన్ని తాకడం ద్వారా అతడు అగౌరవ పరిచాడు కాబట్టి చేసిన నేరానికి తాము విచారించడం లేదన్నారు. తరువాత వారి మొత్తం కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేశారు. తార్న్‌ తరణ్‌ జిల్లాలోని చీమాకాలన్‌ గ్రామం లఖ్బీర్‌ సింగ్‌ అంత్యక్రియలు చేయడానికి స్థలం కేటాయించకుండా, అంత్యక్రియలను కూడా బహిష్కరించింది. గురుగ్రంథ్‌ సాహిబ్‌ సత్కార్‌ కమిటీ, సిక్కుల ఆచారం ప్రకారం లఖ్బీర్‌ అంత్యక్రియలు చేయకుండా నిషేధించింది.
     ఈ సంఘటనను రైతు ఉద్యమంలో ఒక ప్రమాదకరమైన దృష్టి మళ్ళించే చర్యగా పేర్కొంటూ, ఇలాంటి కుట్రపూరిత చర్యలకు రైతులెవరూ ఎరగా మారొద్దని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌.కె.ఎం) విజ్ఞప్తి చేసింది. ఎస్‌.కె.ఎం ఒక ప్రకటన విడుదల చేస్తూ, దీని వెనుక రైతు ఉద్యమానికి చెడ్డపేరు తీసుకొచ్చే, హింసతో లోబరచుకునే ఒక కుట్ర ఉందని పేర్కొంది. ఇంత దుర్మార్గమైన హత్యకు పాల్పడిన నిహాంగ్‌ సింగ్‌ నాయకులను కలిసిన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, కైలాష్‌ చౌదరీలు వెంటనే పదవులకు రాజీనామా చెయ్యాలి. రైతులను చులకనగా చూస్తూ, వారిని లోబరచుకునే కుట్రను విచారించేందుకు సుప్రీంకోర్టు జడ్జిని నియమించాలని ఎస్‌.కె.ఎం డిమాండ్‌ చేసింది. ఇది రైతు ఉద్యమం తప్ప, మత ఉద్యమం కాదని చెప్పింది.
      దాదాపు సంవత్సరం క్రితం ప్రారంభమైన రైతు ఉద్యమంలో 600 మందికి పైగా రైతులు ప్రాణాలను కోల్పోయారు. 2017లో యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత మోడీకి, ఆయనకు మధ్య అధికార ఆధిపత్య పోరు ఉన్న విషయం రహస్యమేమీ కాదు. ఆదిత్యనాథ్‌ ను బలహీనపర్చేందుకు కేంద్రం కొన్ని ఎత్తులు వేసిందని...కానీ రైతుల డిమాండ్లను కొన్నింటిని అంగీకరించడం ద్వారా ముఖ్యమంత్రి ఆ ఎత్తులను చిత్తు చేశాడని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కుల, మత హింసను ఎన్నికల్లో ప్రోత్సహించడం బెజిపి ఎన్నికల వ్యూహం. ఈ వ్యూహం ఈసారి సఫలం కాకపోవచ్చు.

('ఫ్రంట్‌లైన్‌' సౌజన్యంతో)
దివ్యా త్రివేది

దివ్యా త్రివేది