Dec 03,2021 06:29

     హోండూరస్‌లో అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి షియో మారా భారీ విజయం లాటిన్‌ అమెరికా లోనే కాకుండా, ప్రపంచ వ్యాపితంగా ఉన్న ప్రగతిశీల శక్తుల్లో ఉత్తేజాన్ని నింపింది. 1954లో గ్వాటెమాలలో ప్రగతిశీల అధ్యక్షుడు జాకోబ్‌ ఆర్బెంజిని పదవీచ్యుతుడ్ని చేసినప్పటి నుండి ఈ ప్రాంతంలో తిరుగుబాట్లకు, వివాదాలకు ప్రయోగశాలగా అమెరికా ఈ దేశాన్ని ఎంచుకుంది. అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రలను అధిగమించి వామపక్ష ఫ్రీడమ్‌ అండ్‌ రిఫౌండేషన్‌ పార్టీ (లిబ్రే) నేత షియోమారా కాస్ట్రో ఘన విజయం సాధించడం చిన్న విషయమేమీ కాదు. నవంబరు 28న జరిగిన ఎన్నికల్లో అధ్యక్షురాలిగా ఎన్నికైన షియోమారా రెండు సార్లు అధ్యక్షుడిగా ఉన్న జువాన్‌ ఒర్లాండో హెర్మాండెజ్‌ నుంచి 2022 జనవరిలో అధికార పగ్గాలు చేపట్టనున్నారు. 2009లో సైనిక తిరుగుబాటు ద్వారా ప్రగతిశీల వాది అయిన అధ్యక్షుడు మాన్యుయెల్‌ జెలయాను తొలగించి ఆ స్థానాన్ని ఆక్రమించిన మితవాద నేషనల్‌ పార్టీ 12 ఏళ్ల పాలనకు ఇప్పుడు తెరపడింది. జెలయా ప్రస్తుతం నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన షియో మారా భర్త. 70 శాతం ఓట్లు పోలైన తాజా ఎన్నికల్లో షియోమారా నేతృత్వంలోని లిబ్రే పార్టీ 54 శాతం ఓట్లు సాధించగా, పాలక నేషనల్‌ పార్టీ అభ్యర్థి నస్రీ అస్ఫురా 34 శాతం ఓట్లతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. 9.2 శాతం ఓట్లు సాధించిన యాని లొసింతాల్‌ నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ మూడవ స్థానంతో సరిపెట్టుకోగా మిగతా 13 పార్టీలకు ఒక్కోశాతం చొప్పున ఓట్లు లభించాయి. చిన్నచితకా వామపక్ష అనుకూల పార్టీలు లిబ్రే పార్టీతో అలయెన్స్‌ పెట్టుకున్నాయి. అధ్యక్ష ఎన్నికలతోపాటే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోను లిబ్రే పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని తనకు తిరుగులేదనిపించారు. ఈ ఘన విజయం అనంతరం షియో మారా జాతినుద్దేశించి చేసిన టెలివిజన్‌ ప్రసంగంలో దేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతానని, విద్వేష రాజకీయాలకు, అవినీతికి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సంఘటిత నేరాలకు తావులేని పారదర్శక పాలననందిస్తానని హామీ ఇచ్చారు. ఈ విజయాన్ని పన్నెండేళ్ల ప్రజా పోరాటానికి లభించిన విజయంగా ఆమె అభివర్ణించారు. హౌండూరస్‌కు తొలి మహిళా అధ్యక్షులుగా ఎన్నికైన ఘనత కూడా షియోమారాదే. ఆమె భర్త మాన్యుయెల్‌ జెలయా 2006లో అధ్యక్షులయ్యారు. ఆయన మితవాద పార్టీ నుంచి ఎన్నికైనా అధికారం చేపట్టిన తరువాత లెఫ్ట్‌ వైపు మొగ్గారు. రావుల్‌ కాస్ట్రో, హ్యూగో చావెజ్‌ వంటి యోధులతో సన్నిహిత స్నేహ సంబంధాలు నెరిపారు. లాటిన్‌ అమెరికాలో సామ్రాజ్యవాద వ్యతిరేక కూటమిలో భాగస్వామిగా చేరారు. దీంతో అమెరికా, ఇతర పెట్టుబడిదారీ శక్తులు ఆయనను అప్రతిష్ట పాల్జేసేందుకు నానా రకాలుగా ప్రయత్నించాయి. అయినా ఫలించకపోవడంతో సైనిక తిరుగుబాటు ద్వారా ఆయనను తొలగించాయి. ఆ తరువాత జెలయా కోస్టారికాలో ఆశ్రయం పొందారు. ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత షిియోమారా వామపక్ష భావాలు కలిగిన వ్యక్తులతో ఫ్రీడమ్‌ అండ్‌ రిఫౌండేషన్‌ పార్టీని స్థాపించి అధ్యక్ష పదవికి ఆ పార్టీ తరపున రెండుసార్లు పోటీచేశారు. మొదటి సారి ఓడిపోయినా ఈ సారి ఆమె భారీ విజయం సాధించారు.
    కోటి మంది జనాభా కలిగిన ఈ పేద దేశంలో జెలయా హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజానుకూల విధానాలే షియోమారా విజయానికి పెట్టుబడి. మాన్యుయెల్‌ జెలయా మూడున్నరేళ్ల కాలంలో లాటిన్‌ అమెరికాలో రెండవ పేద దేశమైన హోండూరస్‌ను అభివృద్ధి పథంలో నడిపించారు. పిల్లలందరికీ విద్య ఉచితంగా అందించారు. పేద కుటుంబాలకు చెందిన 16 లక్షల మంది పిల్లలకు లబ్ది చేకూర్చేలా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. చిన్న రైతులకు రాయితీలు ఇచ్చారు. కనీస వేతనం 80 శాతం వరకుపెంచారు. ఇంటి పనివారలకు సామాజిక భద్రత కల్పించారు. రెండు లక్షల కుటుంబాలకు నేరుగా సహాయం అందించారు. పేదరికాన్ని తగ్గించడంలో ఇవన్నీ కీలక పాత్ర పోషించాయి. తిరుగుబాటు తరువాత కన్సర్వేటివ్‌లు అధికారంలోకి వచ్చాక,దేశం వెనుకకు వెళ్లింది. పేదరికం మళ్లీ పెరిగిపోయిందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో లిబ్రే పార్టీ విజయం ప్రాధాన్యత సంతరించుకుంది. హోండూరస్‌ చిన్న దేశమే అయినా పెద్ద సందేశం ఇచ్చింది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే వారికి వెలుగు దివిటీగా నిలిచింది.

- కె. గడ్డెన్న